ఇప్పటికీ.. ఆ జిల్లాలో టీడీపీదే హ‌వా.. గెలిచిన వైసీపీ నేత‌లు సున్నా

రాజ‌కీయంగా పెద్ద జిల్లాగా అతిర‌థ ‌మ‌హార‌థుల‌ను అందించిన జిల్లా కృష్ణాజిల్లా. టీడీపీ వ్యవ‌స్థాప‌క అధ్యక్షుడు నందమూరి తార‌క‌రామారావు ఈ జిల్లావారే. ఇక‌, జిల్లా నుంచి అనేక మంది [more]

Update: 2020-07-10 02:00 GMT

రాజ‌కీయంగా పెద్ద జిల్లాగా అతిర‌థ ‌మ‌హార‌థుల‌ను అందించిన జిల్లా కృష్ణాజిల్లా. టీడీపీ వ్యవ‌స్థాప‌క అధ్యక్షుడు నందమూరి తార‌క‌రామారావు ఈ జిల్లావారే. ఇక‌, జిల్లా నుంచి అనేక మంది నాయ‌కులు కీల‌కంగా రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పారు. అలాంటి జిల్లాలో టీడీపీకి, కాంగ్రెస్‌కు కూడా ప‌ట్టు ఎక్కువ‌. అయితే, కాంగ్రెస్ విచ్చిన్నం కావ‌డంతో ఆ పార్టీ నుంచి నేత‌లైతే.. వైసీపీలోకి వ‌చ్చారు కానీ, పార్టీప‌రంగా జిల్లాపై ప‌ట్టు సాధించ‌లేక పోయారు. అదే స‌మ‌యంలో ప్రజ‌ల్లోనూ త‌మ‌పై న‌మ్మకం పెంచుకోలేక పోతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అవ‌నిగ‌డ్డ నుంచి విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం వ‌ర‌కు కూడా ప్రజ‌లు ఇప్ప ‌టికీ.. టీడీపీ లేదా కాంగ్రెస్ ‌(మాజీ) నేత‌ల‌పైనే విశ్వాసం చూపిస్తున్నారు.

పట్టు సాధించేందుకు…..

దీంతో టీడీపీ, కాంగ్రెస్‌ల ఓట‌మి లేదా విచ్ఛిన్నాన్ని వైసీపీ నాయ‌కులు భ‌ర్తీ చేయ‌లేక పోతున్నారు. ఏ పార్టీ అయినా.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జిల్లాల‌పై ప‌ట్టు సాధించేందుకు కృషి చేస్తుంది. కానీ, కృష్ణా జిల్లాలో మాత్రం ఈ త‌ర‌హా ప‌ట్టు సాధించేందుకు వైసీపీ ఇప్పటి వ‌ర‌కు పెద్దగా ప్రయ‌త్నం చేయ‌లేదు. ఏదో గాలివాట‌మో.. లేదా జ‌గ‌న్ సునామీతోనో.. ఇవ‌న్నీ కాక‌..టీడీపీ నేత‌ల‌పై వ్యతిరేక‌త‌తోనో.. వైసీపీ నేత‌లు గెలుపు గుర్రం ఎక్కార‌నే వాద‌న బ‌లంగా ఉంది. ఒకటి రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌ను మిన‌హాయిస్తే.. మిగిలిన జిల్లా అంతా కూడా టీడీపీ నేత‌లే చ‌క్రం తిప్పుతున్నారు. వారు ఓడిపోయినా.. ప్రజ‌లు మాత్రం వారి చెంత‌కే వెళ్తున్నారు. వారి స‌మ‌స్యలు తెలుగు త‌మ్ముళ్లకే మొర‌పెడుతున్నారు.

పట్టున్న నేతలు కావడంతో….

టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు మంత్రులు దేవినేని ఉమ, కొల్లు ర‌వీంద్ర, అటు బీజేపీ నుంచి మంత్రిగా ఉన్న కామినేని శ్రీనివాస్‌, ఎంపీ కేశినేని నాని, కొనక‌ళ్ల నారాయ‌ణ‌, బొండా ఉమామ‌హేశ్వర‌రావు, బోడే ప్రసాద్‌, గ‌ద్దె రామ్మోహ‌న్‌, వ‌ల్లభ‌నేని వంశీ మోహ‌న్‌, కాగిత వెంకట్రావు, మండ‌లి బుద్ద ప్రసాద్‌, అటు జ‌గ్గయ్యపేట‌లో శ్రీరాం తాత‌య్య ఎవ‌రికి వారు సీనియ‌ర్ నేతలుగా ఉండి ఎక్కడిక‌క్కడ ప‌ట్టు సాధించారు. ఇప్పుడు వైసీపీలో ఏకంగా ముగ్గురు మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంప‌ల్లి శ్రీనివాస్ ఉన్నా సీనియ‌ర్ నేత సామినేని ఉద‌య‌భాను, మ‌రో మాజీ మంత్రి పార్థసార‌థి, మ‌ల్లాది విష్ణు లాంటి నేత‌లు ఉన్నా వీళ్లలో ఏ ఒక్కరు జిల్లా అంత‌టా ప్ర‌భావం చూపే వాళ్లే లేరు.

ఈ నియోజకవర్గాల్లో…..

ఈ నేప‌థ్యంలో జిల్లాలో వైసీపీ నేత‌లు ఇంత‌మంది ఉన్నా.. ఏం చేస్తున్నార‌నే వాద‌న తెర‌మీదికి వ‌స్తోంది. ఉదాహ‌ర‌ణ ‌కు ఓ నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల గురించి చ‌ర్చిద్దాం. విజ‌య‌వాడ ప‌శ్చిమం. ఇక్కడ నాయ‌కులు చాలా త‌క్కువ‌. ఉన్నవారిలో జ‌లీల్‌ఖాన్‌పై ప్రజ‌లు విశ్వాసం ఉంది. మైనార్టీ వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న పాత‌బ‌స్తీ అంతా కూడా జ‌లీల్ ఏ పార్టీలో ఉన్నా.. ఆయ‌నకే జై కొడుతున్నారు. గ‌త ఏడాది ఆయ‌న కుమార్తె ఓడిపోయినా.. ఇక్కడ నుంచి గెలిచిన వెల్లంప‌ల్లి శ్రీనివాస్ మంత్రిగా ఉన్నా.. ప్రజ‌లు మాత్రం జ‌లీల్ ద‌గ్గర‌కే వెళ్తున్నారు. అదేవిధంగా విజ‌య‌వాడ సెంట్రల్‌. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో బొండా ఉమా టీడీపీ నుంచి వ‌రుస‌గా రెండోసారి పోటీ చేసి ఓడిపోయారు.

గెలిచిన వైసీపీ నేతలు…

అయినా కూడా ప్రజ‌లు ఆయ‌న‌కే త‌మ బాధ‌లు చెప్పుకొంటున్నారు. పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి ఉంది. ఇక్కడ టీడీపీ నుంచి వ‌రుస‌గా పోటీ చేసి ఓడిపోయిన బోడే ప్రసాద్‌పైనే ప్రజ‌లు న‌మ్మకం పెట్టుకున్నారు. సార‌థి క‌న్నా బోడే హ‌డావిడే ఎక్కువ క‌నిపిస్తోంది. తిరువూరులోనూ ప‌రిస్థితి ఇలానే ఉంది. గ‌తంలో ఇక్కడ నుంచి టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిన మాజీ మంత్రి కేఎస్‌. జ‌వ‌హ‌ర్ పైనే ప్రజ‌లు న‌మ్మకంతో ఉన్నారు. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాలు రెండంకెల వ‌ర‌కు ఉన్నాయ‌ని.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నేత‌లు గెలిచినా.. ప‌ట్టు సాధించే ప్రయ‌త్నం చేయ‌క‌పోవ‌డం, ప్రజ‌ల‌కు చేర‌ువ కాలేక పోవ‌డంతో టీడీపీ నేత‌లే రారాజులుగా వెలుగొందుతున్నార‌ని అంటున్నారు. మ‌రి ఇలాంటి రిపోర్టులు వ‌చ్చిన త‌ర్వాత అయినా.. వైసీపీ నాయ‌కులు మార‌తారో లేదో చూడాలి.

Tags:    

Similar News