థ‌ర్డ్ ఇన్సింగ్స్ క‌లిసొస్తుందా…!

తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా నేత పీతల సుజాత రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ? తాజా ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే హోదాలో తిరిగి సీటు దక్కించుకోలేని [more]

Update: 2019-07-08 14:30 GMT

తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా నేత పీతల సుజాత రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ? తాజా ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే హోదాలో తిరిగి సీటు దక్కించుకోలేని ఆమె ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను బట్టి మూడో ఇన్నింగ్స్‌కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ టీచర్ గా ఉన్న పీతల తొలిసారి అనూహ్యంగా 2004లో ఆచంట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిప్రయత్నంలోనే విజయం సాధించారు. ఆ ఎన్నికల త‌ర్వాత‌ పార్టీ అధికారంలో లేకపోవడంతో ఆమె ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు.

సీటు ఇవ్వకపోవడంతో….

2009లో ఆచంట జనరల్ కావడంతో జిల్లాలో ఉన్న మూడు ఎస్సీ నియోజకవర్గాల్లో ఎక్కడో ఒకచోట తనకు సీటు వస్తుందని పీతల సుజాత ఆశించారు. ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా టీడీపీలోని కొన్ని రాజకీయ శక్తుల వల్ల చంద్రబాబు ఆమెకు సీటు ఇవ్వలేదు. ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది… ఐదేళ్లపాటు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం తన వంతుగా కష్టపడినా సుజాతకు 2014లో అదృష్టం తలుపు తట్టింది. చంద్రబాబు చింతలపూడి నుంచి ఆమెను బరిలోకి దింపటం ఆమె రెండో సారి ఎమ్మెల్యేగా గెలవడం బాబు క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కించుకోవటం చకచకా జరిగిపోయాయి.

లాబీయింగ్ చేయలేక….

ఐదేళ్లపాటు జిల్లా టిడిపిలో ఉన్న గ్రూపు రాజకీయాల నేపథ్యంలో కొందరు సీనియర్లు పీతల సుజాతను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఈ క్రమంలోనే ప్రక్షాళనలో మంత్రి పదవి పోగొట్టుకున్న పీతల సుజాత సిట్టింగ్ ఎమ్మెల్యే హోదాలో మరోసారి పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే సుజాత వ్యతిరేక వర్గం చంద్రబాబు దగ్గర చేసిన లాబీయింగ్‌తో మరోసారి ఆమెకు సీటు రాలేదు. విచిత్రం ఏంటంటే 2004లో ఫస్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన పీతల సుజాత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా 2009లో సీటు దక్కించుకోలేకపోయారు ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది.

సుజాతకే మళ్లీ ఛాన్స్……

ఐదేళ్ల గ్యాప్ తర్వాత 2014లో రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినా ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి మళ్ళీ పీతల సుజాత సీటు దక్కించుకోలేక పోవటం… మళ్ళీ పార్టీ ప్రతిపక్షంలో ఉండటం కాకతాళీయంగా జరిగాయి. ఇక చింతలపూడి నియోజకవర్గంలో సుజాతని కాదని సీటు తెచ్చుకున్న కర్రా రాజారావు 35 వేల ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. 2009లో తొలిసారి పోటీచేసి ఓడిన ఆయన పదేళ్ల తర్వాత 2019లో మరోసారి పోటీ చేసి మళ్ళీ ఓడారు. సుజాత‌కు సీటు రాన‌ప్పుడు రెండుసార్లు టిడిపి ప్రతిపక్షంలో ఉంటే… అటు రాజారావుకు సీటు వచ్చిన రెండు సార్లు కూడా టిడిపి చిత్తుచిత్తుగా ఓడింది. దీంతో రాజారావును ఇప్పుడు ప‌క్కన పెట్టేయ‌డం ఖాయం కావ‌డంతో మళ్లీ సుజాత థ‌ర్డ్ ఇన్సింగ్స్‌కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News