ఇక్కడ టీడీపీ-వైసీపీ ఎమ్మెల్యేలు భాయీ భాయీ..!

రాజ‌కీయాలు రాజ‌కీయాలే.. కానీ… పంప‌కాల విష‌యానికి వ‌చ్చేస‌రికి మాత్రం అంతా ఒక్కటే. ప్రజాధ‌నాన్ని వెనుకేసుకోవ‌డంలోనూ ఏ నేత అయినా.. ఏ పార్టీ అయినా.. ఒక్కటే. ఈ విష‌యంలో [more]

Update: 2020-09-01 08:00 GMT

రాజ‌కీయాలు రాజ‌కీయాలే.. కానీ… పంప‌కాల విష‌యానికి వ‌చ్చేస‌రికి మాత్రం అంతా ఒక్కటే. ప్రజాధ‌నాన్ని వెనుకేసుకోవ‌డంలోనూ ఏ నేత అయినా.. ఏ పార్టీ అయినా.. ఒక్కటే. ఈ విష‌యంలో గ‌త చంద్రబాబు హ‌యాంలోనూ వైసీపీ నాయ‌కులు టీడీపీ నేత‌ల‌తో చేతులు క‌లిపార‌నే విమ‌ర్శలు వ‌చ్చాయి. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ ప్రభుత్వంలోనూ ఈ త‌ర‌హా రాజ‌కీయాలు వెలుగు చూస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి త‌న ప్రభుత్వం నిప్పు.. అవినీతిని స‌హించేది లేదు.. అని ప‌దేప‌దే చెప్పుకొనే జ‌గ‌న్ స‌ర్కారులోనే ఇలా జ‌రుగుతుండ‌డంతో అంద‌రూ నివ్వెర పోతున్నారు.

మైనింగ్ ఎక్కువ కావడంతో…

విష‌యంలోకి వెళ్తే.. తూర్పుగోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గంలో మైనింగ్ నిక్షేపాలు ఎక్కువ‌. ఇక్కడ ప్రభుత్వానికి నేరుగా రాయ‌ల్టీ చెల్లించి చేసే మైనింగ్ కొంతైతే.. దీనివెనుక దోపిడీ మ‌రింత‌. ఈ దోపిడీలో చంద్రబాబు హ‌యాంలోనూ అధికార పార్టీ నాయ‌కులు ఉన్నారు. ఇక‌, ఇప్పుడు ప్రభుత్వం మారింది. నియోజ‌క‌వ‌ర్గం మాత్రం టీడీపీ నేత ప‌రిధిలోనే ఉంది. అయితే, ఇదే జిల్లాలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన వైసీపీ నాయ‌కుడు, జ‌గ‌న్‌కు వ్యాపార భాగ‌స్వామిగా కూడా ఓ ఎమ్మెల్యే ఒక‌రు ఈ నిక్షేపాల‌పై క‌న్నేశారు. ఎంతైనా ప్రత్యర్థిపార్టీ నేత నియోజ‌క‌వ‌ర్గం. అక్కడ మైనింగ్ ను దోచుకోవ‌డం వెనుకేసుకోవ‌డం అంటే కొంత క‌ష్టమే.

మాజీ మంత్రితో చేతులు కలిపి…

అయినా.. వ్యూహం ఉండాలే కానీ.. దోపిడీకి మార్గం ఉండ‌క‌పోతుందా? ఈ అధికార పార్టీ నేత‌కూడా అదే వ్యూహంతో ముందుకు సాగారు. స‌ద‌రు టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రిని మ‌చ్చిక చేసుకున్నారు. ఆయ‌న కూడా ఎలాగూ పార్టీ అధికారంలో లేదు కాబ‌ట్టి.. త‌న‌కు చేతులు ఆడ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేతో చేతులు క‌లిపారు. టీడీపీ ఎమ్మెల్యే స‌మీప బంధువే.. మైనింగ్ అక్రమాల‌ను చూస్తున్నారు. ఆయ‌న టీడీపీ ప్రభుత్వంలో స‌ద‌రు నేత‌కు పీఏగా ఉన్నారు. ఇప్పుడు ఆయ‌నే అధికార పార్టీ ఎమ్మెల్యేకు కూడా పీఏగా మారారు. దీంతో ఇంకేముంది అధికార‌, ప్రతిప‌క్షాల ఎమ్మెల్యేలు చేతులు క‌లుపుకొన్నారు. దీంతో ఇప్పుడు వీరి అక్రమ దందా మూడు పువ్వులు ఆరుకాయ‌లుగా మారిపోయింది.

పావాలా వాటా అయినా….

తాను ముప్పావ‌లా దోచుకుని, ప్రతిప‌క్ష ఎమ్మెల్యేకు పావలా వాటా ఇస్తున్నారు. దీంతో త‌న చేతికి మ‌ట్టి అంట‌కుండా.. చేతిలో డ‌బ్బులు ప‌డుతుంటే.. ఆ మాజీమంత్రి కూడా స‌రే అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ.. అదే మైనింగ్‌ను దోచుకున్న అనుభ‌వ‌మో.. ఏమో.. ఆయ‌న కిక్కురుమ‌న‌డం లేదు. ఇక‌, జిల్లాలో మ‌రో మంత్రి హ‌వా కొన‌సాగుతున్న నేప‌థ్యంలో స‌ద‌రు ఎమ్మెల్యే కావాల్సినంత దోచుకుంటున్నారని జిల్లాలో మిగిలిన వైసీపీ నాయ‌కులు కూడా గుస‌గుస‌లాడుకుంటున్నారు.

విరుచుకుపడే నేత….

నిజానికి టీడీపీ నాయ‌కుడు , మాజీమంత్రి జ‌గ‌న్ ప్రభుత్వంపై అప్పుడ‌ప్పుడు.. విమ‌ర్శలు చేసేవారు. అయితే, బ‌హుశ ఈ ఒప్పందం ఫ‌లిత‌మో.. ఏమో.. ఇప్పుడు మాత్రం సైలెంట్ అయ్యారు. ఒక్కమాట కూడా అన‌డం లేదు. చంద్రబాబు ఉద్యమాల‌కు పిలుపు ఇస్తున్నా.. ఆయ‌న మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. అయితే, ఈ విష‌యం వెలుగు చూడడంతో అంద‌రూ నివ్వెర పోతున్నారు. అయినా.. త‌మ‌కు ఏమీ ప‌ట్టన‌ట్టు.. ఈ టీడీపీ.. ఆ వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం త‌మ దారిలో తాము దూసుకుపోతున్నారు.

Tags:    

Similar News