కుటుంబ ఆధిపత్యానికి ఫుల్ స్టాప్ పెట్టాలని…?

గ‌త ఏడాది ఎదురైన ప‌రాభ‌వం నుంచి పార్టీని ఒడ్డుకు చేర్చాల‌ని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు అనేక చ‌ర్యలు చేప‌డుతున్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న ఇప్పటికే పార్లమెంటు [more]

Update: 2020-10-17 12:30 GMT

గ‌త ఏడాది ఎదురైన ప‌రాభ‌వం నుంచి పార్టీని ఒడ్డుకు చేర్చాల‌ని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు అనేక చ‌ర్యలు చేప‌డుతున్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న ఇప్పటికే పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌పై యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు క‌మిటీల‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇక‌, ఇప్పుడు జిల్లాల‌పై ప‌డ్డార‌ని తెలుస్తోంది. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ముఖ్యంగా ఇప్పుడున్న ప‌రిస్థితిలో దారుణంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌పై చ‌ర్యలు తీసుకుని ఇంచార్జ్‌ల‌ను నియ‌మించాల‌ని భావిస్తున్నార‌ని తెలుస్తోంది. తాజాగా ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో రెండు కీల‌క నియోజ‌క వ‌ర్గాల‌కు చంద్రబాబు ఇంచార్జ్‌ల‌ను నియ‌మిస్తున్నట్టు స‌మాచారం.

ప్రయోగాలు చేసినా…..

మేక‌పాటి కుటుంబం బ‌లంగా ఉన్న ఆత్మకూరు నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపు గుర్రం ఎక్కాల‌నేది బాబు వ్యూహం ఈ క్రమంలోనే ఆయ‌న అనేక ప్రయోగాలు చేశారు. 2014 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి గూటూరి మురళీ కన్నబాబు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని క్రిష్ణయ్యను టీడీపీ రంగంలోకి దించినా ఫలితం లేకుండా పోయింది. ఓటమి తర్వాత క్రిష్ణయ్య నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటం లేదని పార్టీ అధినేతే గుర్తించారు. అయితే.. ఇప్పటికిప్పుడు చ‌ర్యలు తీసుకుంటే బాగోద‌న్న కోణంలో వేచి చూశారు. అయినా ఆయన‌లో మార్పు క‌నిపించ‌లేదు. దీంతో ఇప్పుడు ఇక్కడ మార్పున కు శ్రీకారం చుట్టిన‌ట్టు తెలుస్తోంది.

బొమ్మిరెడ్డికి బాధ్యతలు?

సుదీర్ఘ రాజ‌కీయ ప్రస్థానం ఉన్న రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నెల్లూరు జ‌డ్పీ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్రరెడ్డిని ఇక్కడ నియ‌మించాల‌ని, ఆయ‌న‌కు ప‌గ్గాలు అప్పగించాల‌ని బాబు భావిస్తున్నట్టు స‌మాచారం. బొమ్మిరెడ్డి ఫ్యామిలీ చాలా ఏళ్లుగా రాజ‌కీయాలు చేస్తున్న మాట వాస్తవం. గ‌తంలో వైసీపీలో ఉన్న ఆయ‌న గత ఏడాది టికెట్ ఆశించారు. అయితే, అప్పటికే టైట్‌గా ఉండ‌డంతో జ‌గ‌న్ తిర‌స్కరించ‌డంతో పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. జ‌గ‌న్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. త‌ర్వాత ఆయ‌న టీడీపీలో చేరిపోయారు. ఈ క్రమంలోనే ఆయ‌న‌కు అవ‌కాశం ఇవ్వనున్నట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆత్మకూరులో రెడ్డి వ‌ర్గానికి సీటు ఇస్తే రెడ్డి వ‌ర్గంతో పాటు క‌మ్మ వ‌ర్గం క‌లిస్తేనే క్క‌డ పార్టీ పుంజుకుంటుంద‌ని బాబు నిర్ణయానికి వ‌చ్చారు.

దూరంగా ఉంటుండటంతో….

ఇక‌, మ‌రో కీల‌క నియోజ‌క‌వ‌ర్గం ఉద‌య‌గిరి. ఇది కూడా మేక‌పాటి కుటుంబం ఆధీనంలోనే ఉండ‌డం గ‌మ‌నార్హం. మేక‌పాటి చంద్రశేఖ‌ర్‌రెడ్డి ఇక్కడ చ‌క్రం తిప్పుతున్నారు. అయితే, టీడీపీ త‌ర‌ఫున బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన బొల్లినేని రామారావు ఇక్కడ 2014లో విజ‌యం సాధించారు. త‌ర్వాత గత ఎన్నిక‌ల్లో మాత్రం ఆయ‌న ఓడిపోయారు. ఈ క్రమంలో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉంటూ.. వ్యాపారాల్లోనే మునిగి తేలుతున్నారు.

మదాల కుటుంబానికి……

పార్టీ కార్యకలాపాల‌ను ఆయ‌న పట్టించుకోవ‌డం లేద‌న్న విమ‌ర్శలు పార్టీ కేడ‌ర్లోనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో మాజీ మంత్రి దివంగత మాదాల జానకిరాం సమీప బంధువైన మదన్ 2019 ఎన్నికల ముందు యాక్టివ్‌గా ఉండి టికెట్ కోసం ప్రయత్నించారు. రామారావుకు టికెట్‌ రావడంతో ఆయ‌న సైలెంట్ అయినా.. పార్టీ కోసం పనిచేశారు. ఈ నేప‌థ్యంలో ఉద‌య‌గిరి ఇంచార్జ్ పీఠాన్ని మ‌ద‌న్‌కు ఇచ్చే ఛాన్స్ ఉంద‌ని ప్రచారం జ‌రుగుతోంది. మ‌రి నెల్లూరు జిల్లాలో ఈ రెండు మార్పులు ఆత్మకూరు, ఉద‌య‌గిరిలో టీడీపీని ఎంత వ‌ర‌కు ప‌టిష్టం చేస్తాయో ? చూడాలి.

Tags:    

Similar News