టీడీపీ జిల్లాల్లో వైసీపీ పాగా.. మ‌రి వైసీపీ జిల్లాల్లో..?

రాష్ట్రంలో చిత్రమైన రాజ‌కీయం క‌నిపిస్తోంది. ప్రధానంగా.. అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్ర‌తిప‌క్షం టీడీపీల వ్యవ‌హారం ఆస‌క్తిగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శలు, ప్రతివిమ‌ర్శలు [more]

Update: 2021-05-14 11:00 GMT

రాష్ట్రంలో చిత్రమైన రాజ‌కీయం క‌నిపిస్తోంది. ప్రధానంగా.. అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్ర‌తిప‌క్షం టీడీపీల వ్యవ‌హారం ఆస‌క్తిగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శలు, ప్రతివిమ‌ర్శలు కామనే అయిన‌ప్పటికీ.. వైసీపీ వ్యూహాత్మకంగా రాష్ట్రంలో విస్తరిస్తోంది. ముఖ్యంగా టీడీపీ కంచుకోట‌లుగా ఉన్న జిల్లాల్లో వైసీపీ పాగా వేస్తోంది. కానీ, వైసీపీకి కంచుకోట‌లుగా ఉన్న జిల్లాల్లో టీడీపీ ప‌ట్టు పెంచుకునే విషయంపై దృష్టి పెట్టడం లేదు. అంతేకాదు.. దీనిని సాధించేందుకు కూడా పార్టీ నాయ‌కులు ఎవ‌రూ ఆలోచ‌న చేయ‌డం లేదు.

ఎన్నికలకు ముందు..?

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ప‌శ్చిమ‌, తూర్పు గోదావ‌రి, విజ‌య‌న‌గ‌రం, గుంటూరు, విశాఖ‌, కృష్ణా జిల్లాల్లో టీడీపీకి గ‌ట్టి ప‌ట్టుంది. త‌మ వ్యవ‌స్థాప‌క ఓటు బ్యాంకుతో పాటు.. అభిమానులు, సానుభూతి ప‌రులు.. ఇలా అనేక రూపాల్లో టీడీపీ ఆ జిల్లాపై ప‌ట్టు పెంచుకుని ముందుకు వెళ్లిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. కొన్ని కొన్ని జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేయ‌డం, మ‌రికొన్ని జిల్లాల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాలో గెలుపు గుర్రం ఎక్కడం వంటివి జ‌రిగాయి. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో ఆయా జిల్లాల‌ను పూర్తిగా వైసీపీ ఆక్రమించేసింది. టీడీపీ కంచుకోట‌ను బ‌ద్దలు కొట్టింది.

వైసీపీ పాగా వేయడంతో….

కొన్ని కొన్ని టీడీపీ పీఠాల‌ను సైతం క‌దిలించేసి.. వైసీపీ పాగా వేసింది. ఇలా జిల్లాల‌కు జిల్లాల‌ను అధికార పార్టీ త‌న హ‌స్తగ‌తం చేసుకుంటోంది. అంటే.. టీడీపీకి ప‌ట్టున్న జిల్లాల‌లో వైసీపీ ఇప్పుడు బ‌ల‌మైన పార్టీగా ఎదిపోతోంది. నాయ‌కులు సైతం దూకుడుగా ఉన్నారు. ఇక‌, అధిష్టానం అయితే.. పైకి చెప్పక‌పోయినా.. టీడీపీకి ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గాలు, జిల్లాలు, మండ‌లాలు.. ఇలా దేనినీ వ‌దిలి పెట్టకుండా.. త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయ‌త్నిస్తోంది.

టీడీపీకి పట్టున్న జిల్లాల్లో…

మ‌రి.. స‌హ‌జంగానే రాజ‌కీయాల్లో పంతాలు, ప‌ట్టుద‌లలు ఉంటాయి కాబ‌ట్టి.. వైసీపీకి ధీటుగా.. త‌మ వంతుగా టీడీపీ ప్రయ‌త్నించి.. వైసీపీకి ప‌ట్టున్న జిల్లాల్లో టీడీపీని బ‌లోపేతం చేస్తోందా? అంటే.. ప్రశ్నార్థకంగానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నెల్లూరు, ప్రకాశం (టీడీపీకి కూడా ప‌ట్టుంది), సీమ జిల్లాలు నాలుగింటిలోనూ గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ పూర్తిగా ప‌ట్టుసాధించింది. ముఖ్యంగా చంద్రబాబు సొంత జిల్లాను అన్ని విధాలా టార్గెట్ చేసుకుని మ‌రీ దూకుడు చూపిస్తోంది. ఈ క్రమంలో వైసీపీకి ఇక్కడ తిరుగులేద‌ని అంటున్నారు.

కంచుకోటలను సయితం..?

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న టీడీపీ నాయ‌కులు.. మ‌రి వైసీపీకి ధీటుగా ఇక్కడ ఎదిగేందుకు ప్రయ‌త్నిస్తున్నారా? అంటే.. లేద‌నే చెప్పాలి. పైగా త‌మ‌కు ప‌ట్టున్న జిల్లాల‌నే వ‌దిలేసుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇలా మొత్తంగా.. వైసీపీ.. త‌న దూకుడుతో.. టీడీపీకి ప‌ట్టున్న జిల్లాల్లో పాగా వేస్తుంటే.. క‌నీసం .. టీడీపీ త‌న ఆత్మగౌర‌వం కాపాడుకునేందుకు అంటే.. త‌న‌కు ఎప్పటి నుంచో కొట్టిన పిండిగా ఉన్న జిల్లాల‌ను కూడా టీడీపీ కాపాడుకోలేక పోతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News