టీడీపీ, వైసీపీ లీడ‌ర్లకు కుల‌మే ఫ‌స్ట్‌… బాబు, జ‌గ‌న్ సెకండే

రాష్ట్రంలో కుల రాజ‌కీయాల‌కు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ప్రత్యర్థుల‌పై పైచేయి సాధించ‌డంలోను.. త‌మ‌ను తాము ప్రొజ‌క్ట్ చేసుకోవ‌డంలోను కూడా నాయ‌కులు కులం కార్డును వినియోగించ‌డం [more]

Update: 2020-09-18 03:30 GMT

రాష్ట్రంలో కుల రాజ‌కీయాల‌కు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ప్రత్యర్థుల‌పై పైచేయి సాధించ‌డంలోను.. త‌మ‌ను తాము ప్రొజ‌క్ట్ చేసుకోవ‌డంలోను కూడా నాయ‌కులు కులం కార్డును వినియోగించ‌డం ప‌రిపాటిగా మారింది. చాలా మంది పార్టీల‌తో సంబంధం లేకుండా ఏ పార్టీ అయితే త‌మ కులం వాడికి సీటు ఇచ్చిందో ఆ వ్యక్తికే ఓట్లేస్తుంటారు. ఇటీవ‌ల కాలంలో ఏపీలో కుల రాజ‌కీయాలు బాగా ముదిరిపోయాయి. అయితే.. చాలా వ‌ర‌కు జిల్లాల్లో ప్రత్యర్థి పార్టీ నాయ‌కుడు త‌న కులం వ్యక్తే అయినా.. విమ‌ర్శలు స‌ర్వసాధార‌ణం. కానీ, చిత్రంగా శ్రీకాకుళం జిల్లాలో మాత్రం కుల రాజ‌కీయాలు భిన్నంగా న‌డుస్తున్నాయి. త‌మ కులానికి చెందిన వారు ప్రత్యర్థులుగా ఉంటే మాత్రం ఒక్కమాట కూడా ఇక్కడి నాయ‌కులు అన‌రు.

ఒకరిపై ఒకరు విమర్శలు…..

వారు ఏ పార్టీలో ఉన్నప్పటికీ.. కుల‌మే ప్రధానం. ఉదాహ‌ర‌ణ‌కు జిల్లాలో రెండు ప్రధాన పార్టీలో దిగ్గజాలైన నాయ‌కులు ఉన్నారు. టీడీపీ త‌ర‌ఫున ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గుండ ల‌క్ష్మీదేవి, బొగ్గు ర‌మ‌ణ‌మూర్తి ఉన్నారు. వీరు కొప్పుల వెల‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన‌వారు. అయితే, ప్రత్యర్థి పార్టీ వైసీపీ త‌ర‌ఫున జిల్లాలో రాజ‌కీయ చ‌క్రం తిప్పుతున్నవారు ధ‌ర్మాన కృష్ణదాస్‌, ధ‌ర్మాన ప్రసాద‌రావు. వీరిది కూడా అదే సామాజిక వ‌ర్గం. స‌హ‌జంగానే వైసీపీకి, టీడీపీకి మ‌ధ్య ఉన్న వైరాన్ని, ఆధిప‌త్య రాజ‌కీయాల‌ను బ‌ట్టి.. వీరు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శలు చేసుకుంటార‌ని అంద‌రూ అనుకుంటారు.

అవినీతి విషయాలను కూడా….

కానీ, అలాంటి ప‌రిస్థితి మాత్రం మ‌న‌కు ఎక్కడా క‌నిపించ‌దు. శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గంలో గుండ ల‌క్ష్మీదేవి-ప్రసాద‌రావు బంధువులు, అదేవిధంగా న‌ర‌స‌న్నపేట‌లో మంత్రి ధ‌ర్మాన కృష్ణదాస్‌.. మాజీ ఎమ్మెల్యే బొగ్గు ర‌మ‌ణ మూర్తి కూడా బంధువులే. ఈ నేప‌థ్యంలో వీరు పార్టీల ప‌రంగా ప్రత్య‌ర్థులే అయిన‌ప్పటికీ.. ఒక‌రిపై ఒక‌రు మాత్రం విమ‌ర్శలు చేసుకోరు. పోనీ.. అస‌లు మౌనంగా ఉంటారా ? అంటే అదేం లేదు. ధ‌ర్మాన సోద‌రులు ఇద్దరూ కూడా టీడీపీ అధినేత చంద్రబాబుపై విమ‌ర్శ‌లు గుప్పిస్తారు. ఇక‌, గుండ‌, బొగ్గు ర‌మణ‌‌మూర్తిలు.. వైసీపీ అధినేత‌పై నిప్పులు చెరుగుతారు. కానీ, వారిపై వారు మాత్రం విమ‌ర్శలు చేసుకోరు. వీరు స్థానికంగా ఒక‌రి పేరు మ‌రొక‌రు ఎత్తరు. కేవలం చంద్రబాబు, జ‌గ‌న్‌ను మాత్రమే తిడ‌తారు. వీరిలో వీళ్లు ఎంత అవినీతి చేసినా, ఎన్ని త‌ప్పులు చేసినా కూడా ఎవ్వరు బ‌య‌ట పెట్టుకోరు.

బాబు, జగన్ లు మాత్రమే…..

ఇక కింజార‌పు ఫ్యామిలీకి ఎర్రన్నాయుడు ఉన్నప్పటి నుంచే ధ‌ర్మాన‌కు మ‌ధ్య మంచి రాజ‌కీయ స‌హ‌కారం ఉంటుంద‌న్న టాక్ ఉంది. ఎంపీ ఓటు మాత్రం ఎర్రన్నకు, ఎమ్మెల్యే ఓటు ధ‌ర్మాన‌కు అన్న సూత్రం మీదే వీరు పార్టీ ఓడినా స్థానికంగా మాత్రం వీరు గెలిచారు. అందుకే 1999లో కాంగ్రెస్ స్టేట్‌లో ఓడినా ఇక్కడ ధ‌ర్మాన ఎమ్మెల్యే అయ్యారు. 2004లో స్టేట్‌లో టీడీపీ ఓడితే ఇక్కడ ఎర్రన్న ఎంపీ అయ్యారు. అంతేకాదు, గ‌త ఎన్నిక‌ల్లో ధ‌ర్మాన వైసీపీలో ఉన్నప్పటికీ.. ఎంపీగా ఓటును కుర్రోడికి ( రామ్మోహ‌న్ నాయుడికి ) వేయాల‌నే ప్రచారం చేశార‌ని విమ‌ర్శలు ఉన్నారు. దీనికి కార‌ణం.. వీరంతా కూడా ఒకే కులానికి చెందిన వారు.. స‌మీప బంధువులు అవ్వడ‌మే కార‌ణం అన్నది అక్కడ ఓపెన్ సీక్రెట్‌. మొత్తానికి రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో రాజ‌కీయాలు ఎలా ఉన్నప్పటికీ.. శ్రీకాకుళంలో మాత్రం చాలా డిఫ‌రెంట్‌గా న‌డుస్తున్నాయ‌నే చెప్పాలి… ఇక్కడ నేత‌ల‌కు బాబు, జ‌గ‌న్ మాత్రమే శ‌త్రువు‌లు అనుకోవాలేమో..!

Tags:    

Similar News