ఢిల్లీలో పని మొదలుపెట్టారు

అంతా అనుకున్నట్లుగానే జరుగుతుంది. చంద్రబాబు ముందుచూపు ఇప్పుడు ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో తెలుగుదేశం ఓటమి పాలు కావడం, కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబుకు కంటి మీద [more]

Update: 2019-10-17 11:00 GMT

అంతా అనుకున్నట్లుగానే జరుగుతుంది. చంద్రబాబు ముందుచూపు ఇప్పుడు ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో తెలుగుదేశం ఓటమి పాలు కావడం, కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబుకు కంటి మీద కునకు లేదు. ఇటు కేంద్రంలో అటు రాష్ట్రంలో తన శత్రువులే రాజ్యమేలుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రధాని మోడీని, బీజేపీని తీవ్రంగా దూషించిన చంద్రబాబు మళ్లీ సఖ్యత కోసం ఏమాత్రం సంకోచించడం లేదు. బీజేపీతో స్నేహాన్ని పునరుద్ధరించుకోవడం కోసం హస్తినలో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయంటున్నారు.

నలుగురు చేరినప్పుడే….

ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీలో కరడు గట్టిన నేతలుగా భావించిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోయారు. రాజ్యసభ లో బీజేపీకి సంఖ్య అవసరం కావడంతో సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటిలను చేర్చుకుంది. ఇది చంద్రబాబు వ్యూహంలో భాగమేనని కొందరు వాదించినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం జీర్ణించుకోలేకపోయారు. చంద్రబాబు అనుమతితోనే వారు బీజేపీలోకి వెళ్లారన్నది సీనియర్ నేతలకు తెలియంది కాదు. అందుకే తోట త్రిమూర్తులు సుజనాచౌదరి లాంటి నేతలు పార్టీని వీడిపోతే చంద్రబాబు ఎందుకు నోరు మెదలేదని ప్రశ్నించారు.

సుజనా చౌదరి దౌత్యంతో….

ఇప్పుడు బీజేపీతో సయోధ్యకు చంద్రబాబు రెడీ అయ్యారు. కేంద్రంలో బీజేపీతో స్నేహంగా ఉంటేనే రాష్ట్రంలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై కేసులు ఆగిపోతాయి. వలసలకు కూడా ఫుల్ స్టాప్ పడుతుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తనకు మోడీతో వ్యక్తిగత వైరం లేదని ప్రకటించారు. అలా ప్రకటన చేసిన మరుసటిరోజు నుంచే ఢిల్లీలో బీజేపీ అధిష్టానం వద్ద బాబు ప్రతిపాదనను ఉంచే ప్రక్రియ ప్రారంభమయింది. అమిత్ షా, జేపీ నడ్డాలతో సుజనా చౌదరి దీనిపై చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీ పెట్టే షరతులకు అంగీకరిస్తామని, తిరిగి ఎన్డీఏలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని సుజనా చౌదరి బీజేపీ కేంద్ర నాయకత్వం వద్ద పదే పదే విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం.

దీపావళి తర్వాతే…..

ఇటీవల ఒక మీడియా అధిపతి కూడా అమిత్ షాను నేరుగా కలసి పలు అంశాలపై చర్చించారు. ఈ చర్చల్లోనూ టీడీపీని తిరిగి కలుపుకోవాలని ఆయన కూడా అమిత్ షా వద్ద కదిపినట్లు చెబుతున్నారు. ఆయన కలసి వచ్చిన తర్వాతే చంద్రబాబు బీజేపీ పట్ల సానుకూల ప్రకటన చేయడం గమనార్హం. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల తర్వాత సుజనా చౌదరి దీనిపై మరోసారి చర్చించే అవకాశముంది. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం టీడీపీతో మళ్లీ స్నేహం వద్దే వద్దంటున్నారు. ముఖ్యంగా కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు వంటి నేతలు చంద్రబాబును కలుపుకుంటే పార్టీ ఎదిగే ప్రసక్తి లేదని అధిష్టానానికి చెబుతూ వస్తున్నారు. మొత్తం మీద దీపావళి తర్వాత చంద్రబాబును కలుపుకునేందుకు బీజేపీ ఇష్టపడుతుందా? లేదా? అన్నది తెలిసే అవకాశముంది.

Tags:    

Similar News