ఆ పార్టీని మ‌ళ్లీ చంద్రబాబే సేవ్ చేస్తాడా ?

అవును! ఇప్పుడు రాష్ట్రంలోని క‌మ్యూనిస్టు పార్టీని గ‌మ‌నిస్తున్న వారంతా.. ఇదే మాట అంటున్నారు. 2009లో చంద్రబాబుతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగిన క‌మ్యూనిస్టులు 2014లో కిర‌ణ్‌కుమార్ రెడ్డి జై స‌మైక్యాంధ్ర [more]

Update: 2021-03-19 09:30 GMT

అవును! ఇప్పుడు రాష్ట్రంలోని క‌మ్యూనిస్టు పార్టీని గ‌మ‌నిస్తున్న వారంతా.. ఇదే మాట అంటున్నారు. 2009లో చంద్రబాబుతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగిన క‌మ్యూనిస్టులు 2014లో కిర‌ణ్‌కుమార్ రెడ్డి జై స‌మైక్యాంధ్ర అడుగుల్లో న‌డిచారు. ఇక గ‌త 2019 ఎన్నిక‌ల్లో చంద్రబాబును తిట్టిపోసిన .. క‌మ్యూనిస్టులు .. జ‌న‌సేన వెంట న‌డిచారు. అయితే.. ఎన్నిక‌ల త‌ర్వాత‌.. క‌నీసం త‌న మిత్రప‌క్షాలుగా ఉన్న కామ్రేడ్లకు ఒక్క మాట కూడా చెప్పకుండానే ఆయ‌న వెళ్లి బీజేపీ తో పొత్తు పెట్టుకున్నారు. దీంతో అలిగిన క‌మ్యూనిస్టులు క‌లిసి పోరాటాలు చేయాల‌ని నిర్ణయించుకునేందు కు రెడీ అయ్యారు. అయితే అది కూడా అంచ‌నాల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో ఎవ‌రికి వారుగా దారులు ఎంచుకున్నారు.

నేరుగా పొత్తు పెట్టుకుని….

ఈ క్రమంలో ప్రస్తుతం జ‌రుగుతున్న మునిసిప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో సీపీఐ.. టీడీపీతో బ‌హిరంగ పొత్తుతోనే ముందుకు సాగుతోంది. టీడీపీకి బ‌లం లేని చోట‌.. త‌మ‌కు ఎడ్జ్ ఉన్న వార్డుల‌ను ఎంచుకుని మ‌రీ.. టీడీపీతో ఒప్పందం మేరకు అక్కడ నుంచి పోటీ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఉదాహ‌ర‌ణ‌కు విజ‌య‌వాడ‌ను తీసుకుంటే.. మొత్తం 64 డివిజ‌న్లు ఉన్నాయి. వీటిలో టీడీపీ కేవ‌లం 44 చోట్ల మాత్రమే పోటీ చేస్తుండ‌గా సీపీఐ అభ్యర్థులు 8 డివిజ‌న్ల‌లో పోటీ చేశారు. మిగిలిన‌ చోట్ల టీడీపీ-జ‌నసేన‌ల మ‌ధ్య ర‌హ‌స్య ఒప్పందం మేర‌కు అక్కడ జ‌న‌సేన పోటీ చేసింది. దీంతో సీపీఐకి ఒక ఊపు వ‌చ్చింద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మిత్రపక్షంగా వ్యవహరించి….

ఆది నుంచి కూడా టీడీపీతో మిత్ర ప‌క్షంగా వ్యవ‌హ‌రించిన సీపీఐ.. 2009లో పొత్తు.. పెట్టుకుని ఉమ్మడి ఏపీ సార్వత్రిక స‌మ‌రంలో నాలుగు స్థానాలు ద‌క్కించుకుంది. త‌ర్వాత రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో 2014లో కిర‌ణ్ కుమార్‌రెడ్డి పార్టీతోను, 2019లో జ‌న‌సేన‌తోను క‌లిసి ముందుకు సాగింది. ఇక ఆ త‌ర్వాత చంద్రబాబును కొన్ని రోజుల పాటు తిట్టిపోసినా.. ఇప్పుడు మాత్రం ఉనికి చాటుకునేందుకు కామ్రేడ్లు, పొత్తు లేక పోతే.. క‌లిసి రాద‌నే సెంటిమెంటును బ‌లంగా న‌మ్ముతున్న చంద్రబాబు క‌లిసిపోయారు.

వచ్చే ఎన్నికల నాటికి…..

వీరిద్దరు ర‌హ‌స్యంగానే ఒప్పందం చేసుకున్నా అది ‌బహిరంగం కావ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అంటే 2024 ఎన్నిక‌ల్లో అంద‌రూ ( టీడీపీ + క‌మ్యూనిస్టులు + జ‌న‌సేన ) క‌లిసిపోయే అవ‌కాశం కూడా క‌నిపిస్తోంది. ఏదేమైనా.. రాజ‌కీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శ‌త్రువులు ఉండ‌ర‌ని అంటారు క‌దా! క‌మ్యూనిస్టులు కూడా ఇప్పుడు ఇదే సూత్రాన్ని వ‌ల్లె వేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి ఈ జ‌న‌రేష‌న్ జ‌నాలు మ‌ర్చిపోతోన్న పార్టీగా ఉన్న సీపీఐ ఇలాగైనా మ‌ళ్లీ వార్తల్లో నానుతోంది.
.

Tags:    

Similar News