“సీమ” ను కంట్రోల్ చేశారా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ కోస్తా జిల్లాల్లోనే తమపై దాడులు, అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. నిజమే… గుంటూరు, నెల్లూరు, [more]

Update: 2019-10-11 11:00 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ కోస్తా జిల్లాల్లోనే తమపై దాడులు, అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. నిజమే… గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం వంటి జిల్లాల్లోనే ఎక్కువగా ఈ ఫిర్యాదులు అందుతున్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం తీసుకున్నా, చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ వివాదాలు తీసుకున్నా ఇదే అని స్పష్టంగా చెప్పవచ్చు.

సీమలో మాత్రం….

అయితే ముఖ్యంగా రాయలసీమలో ఇలాంటి గొడవలు లేకపోవడం విశేషంగానే చెప్పుకోవాలి. నిజానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కువగా ఎన్నికల అనంతరం గొడవలు చెలరేగుతాయని భావించారు. ప్రధానంగా అనంతపురం, కడప జిల్లాల నుంచి టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తారని భావించారు. కానీ అందరి అంచనాలకు అతీతంగా ఈ రెండు జిల్లాల్లో పరిస్థితి ప్రశాంతంగానే ఉండటం గమనార్హం.

తాడిపత్రి, రాప్తాడుల్లో…..

అనంతపురం జిల్లాలోని రాప్తాడు, తాడిపత్రి నియోజకవర్గాల్లో ఎక్కువగా ఘర్షణలు జరుగుతాయని భావించారు. దశాబ్దాల కాలం నుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాన్ని తాడిపత్రిలో వైసీపీ నేత పెద్దారెడ్డి ఓడించారు. కానీ ఇక్కడ పెద్దారెడ్డి సంయమనంతో వ్యవహరిస్తున్నారు. అలాగే రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబంపై గెలిచిన ప్రకాశ్ రెడ్డి కూడా కక్ష సాధింపు చర్యలకు దిగుతారని భావించారు. కానీ రాప్తాడులో సయితం టీడీపీ శ్రేణుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవు.

టీడీపీ నేతలు కూడా….

రాయలసీమలో ఒక్క ఆళ్లగడ్డ ప్రాంతంలోనే టీడీపీ నేతల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. మాజీ మంత్రి అఖిలప్రియ తన అనుచరులపై అక్రమ కేసులను బనాయిస్తున్నారంటూ కేంద్రహోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇక కడప జిల్లాలో టెన్షన్ గా ఉంటుందనుకున్న జమ్మలమడుగులో సయితం రాజకీయ కక్ష సాధిస్తున్నారని టీడీపీ నేతలు రోడ్డెక్కలేదు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సీమ జిల్లాల నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు ఎలాంటి కంప్లయింట్లు పెద్దగా ఇవ్వడం లేదు. ఒక్క కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే ఈ రకమైన ఫిర్యాదులు అందుతున్నాయి.

Tags:    

Similar News