మరణ శాసనం రాసేస్తున్నారా?

మహానుభావుడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ టీడీపీ, ఎన్నో రికార్డులు సృష్టించిన పార్టీ కూడా టీడీపీనే. ఎమెర్జెన్సీ వీర వనిత ఇందిరా గాంధీనే సవాల్ చేసి గెలిచి వచ్చిన [more]

Update: 2019-10-24 06:30 GMT

మహానుభావుడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ టీడీపీ, ఎన్నో రికార్డులు సృష్టించిన పార్టీ కూడా టీడీపీనే. ఎమెర్జెన్సీ వీర వనిత ఇందిరా గాంధీనే సవాల్ చేసి గెలిచి వచ్చిన పార్టీ టీడీపీ. పార్లమెంట్ లో జాతీయ పార్టీలను కూడా పక్కన పెట్టి మరీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించిన ఘనత కూడా ఆ పార్టీకి ఉంది. అదే విధంగా దేశంలోని విపక్షాలను ఏకం చేసి ప్రధానమంత్రులను, రాష్ట్రపతుల ఎంపికలో కీలకపాత్ర పోషించిన చరిత్ర టీడీపీది. అటువంటి టీడీపీ అన్నగారి మరణం తరువాత మెల్లగా దిగజారిపోతూ వచ్చి ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉనికి కోసం పోరాడుతోంది. అదే సమయంలో చంద్రబాబు సిద్ధాంత రాహిత్య రాజకీయాలు, అవకాశవాద విధానాలు టీడీపీకి మరణ శాసనమే రాస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఎంత మాట అనేశారో…?

టీడీపీతో మాకు పొత్తు ఏంటి అంటూ వెటకారం ఆడారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు. అంతే కాదు ఆ పార్టీతో ఎప్పటికి కలిసేది లేదని కుండబద్దలుకొట్టారు. బీజేపీతో టీడీపీని విలీనం చేస్తామంటే తానే స్వయంగా బీజేపీ హైకమాండ్ తో మాట్లాడుతానని కూడా ఆయన ఎకసెక్కం ఆడారు. చిత్రమేంటంటే జీవీఎల్ చేసిన కామెంట్ పై కనీసం స్పందించేందుకు కూడా తమ్ముళ్లకు నోరు రాలేదు. దీన్ని బట్టి చూస్తే బీజేపీ చెప్పిన దానికి మౌనంగానే అంగీకరిస్తున్నారా అన్న భావన కలుగుతోంది. టీడీపీకి అంత గతి పట్టిందని తమ్ముళ్ళు కూడా నమ్ముతున్నారా అన్నది కూడా చర్చకు వస్తోంది. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే గతమెంతో ఘనంగా ఉంది. భావి చూస్తే బెంగ కలుగుతోంది. అందువల్లనే ఎపుడేం జరుగుతుందో తెలియక తమ్ముళ్ళు ఈ విధంగా మాట్లాడకుండా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా అన్న అభిప్రాయమే అందరిలో కలుగుతోంది.

బాబు బలవంతుడేగా…?

ఎవరెన్ని చెప్పినా కూడా ఇప్పటికీ ఏపీలో వైసీపీని ఢీ కొట్టే దమ్ము ఒక్క టీడీపీకే ఉందన్నది రాజకీయ విశ్లేషకుల కచ్చితమైన భావన. ఎందుచేతంటే బాబుకు దేశంలోనే బడా నాయకులతో సంబంధాలు ఉన్నాయి. ఆర్ధికంగా టీడీపీని గట్టెక్కించాలంటే అది ఆయనకు చిటికీలో పని, ఇక బలమైన కమ్మ సామాజికవర్గం దన్ను టీడీపీకి ఎపుడూ శ్రీరామ‌రక్షగా ఉంది. అదే సమయంలో దేశంలో ఏ పార్టీకీ లేనంత అంకితభావం కలిగిన క్యాడర్ టీడీపీ సొంతం. ఇక ఏపీలో 2019 జరిగిన ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు మాత్రమే వచ్చినా కూడా ఓట్ల షేరింగ్ పరంగా చూసుకున్నపుడు మాత్రం దాదాపుగా నలభై శాతం తెచ్చుకుని సత్తా చాటింది.

మైనస్ పాయింట్ ఇదే…..

అయితే ఇన్ని అనుకూల అంశాలు ఉన్నా కూడా టీడీపీకి ఉన్న ఒకే ఒక్క మైనస్ పాయింట్ బాబు వయసు. డెబ్బై పడిలో పడిన బాబు 2024 వరకూ ఇదే జోష్ తో పార్టీని ముందుకు నడిపించలేరన్న దాంట్లో మాత్రం అంతా అంగీకరిస్తారు. పైగా టీడీపీకి బాబు తరువాత ఆ స్థాయిలో అందుకునే నాయకత్వం కూడా లేదు. బహుశా ఈ ఒక్క కారణాన్ని చూసుకునే బీజేపీ టీడీపీని విలీనం చేసుకుంటామంటూ పెద్ద మాటలే వాడుతోంది. ఏది ఏమైనా టీడీపీకి ఇది నైతికంగా కొట్టిన దెబ్బ. మరి దీన్ని తిప్పికొట్టలేకపోవడం అంటేనే పసుపు పార్టీ తన బలహీనతను తానే అంగీకరిస్తోందనే అనుకోవాలి.

Tags:    

Similar News