సొమ్ములు ల్లేవ్…సైకిల్ తొక్కలేం…?

అధికారంలో ఉన్నప్పుడు సాగిన హడావిడి, హంగామా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉండవుగా. గతంలో వచ్చినట్లే పార్టీ ఫండ్ దండిగా వస్తుందనుకున్న తమ్ముళ్ళకు అధిష్టానం మొండి చెయ్యి ఇవ్వడంతో డీలా [more]

Update: 2020-03-23 03:30 GMT

అధికారంలో ఉన్నప్పుడు సాగిన హడావిడి, హంగామా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉండవుగా. గతంలో వచ్చినట్లే పార్టీ ఫండ్ దండిగా వస్తుందనుకున్న తమ్ముళ్ళకు అధిష్టానం మొండి చెయ్యి ఇవ్వడంతో డీలా పడుతున్నారట. తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ముందు నుయ్యి వెనుక గొయ్యి మాదిరిగా పరిస్థితి మారింది. ఎన్నికలు వాయిదా వేసినందుకు అధిష్టానం ఆనంద పడుతుంటే క్యాడర్ మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. గత ఎన్నికల్లో వచ్చిన విధంగా ఆర్ధిక సాయం అందుతుందని రంగంలోకి దూకిన వారికి చేదు అనుభవాలే ఎదురౌతున్నాయి. దాంతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారట వారంతా.

అప్పులు కూడా పుట్టడం లేదాయె …

అధిష్టానం ఎలాగూ ఇవ్వదని అర్ధం అయినవారు అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. ఆర్ధిక సంవత్సరం చివరి నెల కావడంతో అణా కానీ కూడా ఎవ్వరు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరు. మరికొందరు విపక్షంలో ఉన్నవారికి సొమ్ములు ఇస్తే వారు గెలవకపోతే ఎలా చెల్లిస్తారని అధిక వడ్డీ ఇస్తామన్నా లేదనేస్తున్నారని గ్రామాల్లో చర్చ నడుస్తుంది. దాంతో ఇప్పుడు నామినేషన్లు వేసి ఎప్పుడు జరుగుతాయో తెలియని ఎన్నికలకు క్యాడర్ కైనా ఖర్చులు పెట్టాలిసిన వారంతా ఉసురు మంటున్నారు.

మా దగ్గర సొమ్ములు లేవు…

ఎన్నికలు జరిగి ఏడాది కూడా కాకపోవడంతో మరోపక్క ఎమ్యెల్యేలు, ఎంపీలు సైతం ఖాళీ జేబులు చూపిస్తుండటంతో మరింత షాక్ కి గురౌతున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇది ఇలా ఉంటే అధికారపార్టీ అభ్యర్థుల ప్రలోభాలకు ఆర్ధిక ఇబ్బందుల దృష్ట్యా కొందరు తలవొగ్గుతూ ఉన్నట్లు వస్తున్న వార్తలతో పసుపు శిబిరంలో ఆందోళన రోజు రోజుకు పెరుగుతుంది. ఇలా సైకిల్ తొక్కే ఓపిక లేనివారిని అధినేత ఎలా ఆదుకుంటారా అన్నది ఇప్పుడు అందరిని వేధిస్తున్న ప్రశ్న. రాష్ట్ర పార్టీ కూడా ఆర్ధిక కష్టాల్లో ఉండటంతో అక్కడి నుంచి సాయం కూడా ఇక లేనట్లే అని తేలిపోతుంది.

Tags:    

Similar News