టీడీపీకి ఫ్యూచర్ అప్పుడేనట

రాష్ట్రంలో ఇప్పటికే డీలా ప‌డిన టీడీపీ పుంజుకునేదెలా ? ఏమంత్రం వేస్తే.. పార్టీలో జ‌వ‌స‌త్వాలు వ‌స్తాయి ? ఒక‌ప్పటి రాజ‌భోగం మ‌ళ్లీ పార్టీ కి ఎప్పుడు ? [more]

Update: 2019-11-24 14:30 GMT

రాష్ట్రంలో ఇప్పటికే డీలా ప‌డిన టీడీపీ పుంజుకునేదెలా ? ఏమంత్రం వేస్తే.. పార్టీలో జ‌వ‌స‌త్వాలు వ‌స్తాయి ? ఒక‌ప్పటి రాజ‌భోగం మ‌ళ్లీ పార్టీ కి ఎప్పుడు ? ఇప్పుడు ఇవ‌న్నీ ప్రశ్నలే..! వీటికి స‌మాధానం ల‌భించాలంటే.. వ‌చ్చే ఏడాది సంక్రాంతి త‌ర్వాత జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో స‌త్తా చాట‌డ‌మే త‌రువాయి అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా ప‌రాజయం పాలైంది. రెండో సారి అధికారంలోకి రావాల‌ని భావించినా సాధ్యం కాలేదు. అయితే, ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మే అనుకున్నా…టీడీపీ మ‌నుగ‌డ ప్రధానంగా సాగాలి క‌దా..!

నిస్తేజంలో ఉన్న పార్టీని…..

ఇప్పుడు పార్టీ మ‌నుగ‌డ టీడీపీకి క‌ష్ట సాధ్యంగా మారిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి ఎలా ఉంటుందో? పార్టీ ఎలాంటి ప‌రిస్థితిని ఎదుర్కొంటుందో కూడా చెప్పలేని స్థితి నేడు ఏర్పడింది. ఇప్పటికే నాయ‌కులు పార్టీకి ఒక్కరొక్కరుగా దూర‌మ‌వుతున్నారు. ఉన్న వారు కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీని బ‌తికించుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ప్రజ‌ల్లో కోల్పోయిన పార్టీ హ‌వాను తిరిగి నిల‌బెట్టుకోవడం ఎంతో ప్రధాన‌మైన అంశం. ఈ క్రమంలోనే వ‌చ్చే జ‌న‌వ‌రి త‌ర్వాత జ‌రిగే స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత‌, అవ‌స‌రం చంద్రబాబుపై ఎంతైనా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

2013లోనూ ఇలాగే….

వాస్తవంగా 2009 ఎన్నిక‌ల్లో రెండోసారి టీడీపీ ఓడిపోయిన‌ప్పుడు అటు తెలంగాణ ఉద్యమం, ఇటు వైసీపీ ఆవిర్భావంతో ఏపీలోనూ టీడీపీ బ‌తికే ప‌రిస్థితి లేదు. అయితే 2013 నాటి ప‌రిస్థితి చూస్తే.. అప్పటి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీ పుంజుకుంది. దీంతో 2014లో అధికారంలోకి వ‌చ్చేందుకు అవ‌కాశం ఏర్పడింది. ఇక‌, ఇప్పటి ప‌రిస్థితి చూస్తే.. సార్వత్రిక ఎన్నిక‌ల్లో కుప్పకూలింది. ఈ నేప‌థ్యంలో స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌కు ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అంటున్నారు. అయితే, గతానికి ఇప్పటికి అంటే 2013 స్థానిక ఎన్నిక‌ల‌కు ఇప్పుడు జ‌రగ‌బోయే ఎన్నిక‌ల‌కు మ‌ధ్య చాలా వ్యత్యాసం క‌నిపిస్తోంది.

చతికల పడితే మాత్రం….

అప్పట్లో రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్ స‌హా అనుభ‌వ‌జ్ఞుడు అనే భావ‌న చంద్రబాబుపై ఉండ‌డంతో టీడీపీ న‌ల్లేరుపై న‌డ‌క మాదిరిగా దూసుకుపోయింది. ఇక‌, ఇప్పుడు ప‌రిస్తితి అలా లేదు. వైసీపీ ప్రభుత్వం చాలా బ‌లంగా ఉంది. దీనికి ఇప్పటికే టీడీపీ నుంచి వెళ్లిన వారి బ‌లం కూడా తోడైంది. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ ప్రవేశ పెట్టిన ప‌థ‌కాల ఎఫెక్ట్ కూడా భారీగా ప‌డ‌నుంది. కీల‌క‌మైన ప‌థ‌కాలు కూడా వ‌చ్చే జ‌న‌వ‌రి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉగాది నాటికి ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రధానంగా మార‌నుంది. ఈ నేప‌థ్యంలో స్థానిక సంస్థల‌ను సాధ్యమైనంత వ‌ర‌కు త‌న ఖాతాలో వేసుకునేందుకు జ‌గ‌న్ కూడా తీవ్రంగా ప్రయ‌త్నించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ స‌త్తా చాటుతుందా? చ‌తికిల ప‌డుతుందా? అనేది ఆస‌క్తిగా మారింది. చ‌తికిల ప‌డితే మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూడా పార్టీ పుంజుకునే ప‌రిస్థితి ఉండ‌బోద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News