టీడీపీలో వీరి జాడేదీ..? కన్పించడమే మానేశారే?

టీడీపీలో గిరిజ‌న నేత‌లు ఎక్కడ ఉన్నారు? ఏంచేస్తున్నారు ? గ‌తంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతో ఇంతో వెనుకేసుకున్నార‌నే వాద‌న వినిపించిన నాయ‌కులు ఇప్పుడు ఏం చేస్తున్నారు [more]

Update: 2021-01-09 11:00 GMT

టీడీపీలో గిరిజ‌న నేత‌లు ఎక్కడ ఉన్నారు? ఏంచేస్తున్నారు ? గ‌తంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతో ఇంతో వెనుకేసుకున్నార‌నే వాద‌న వినిపించిన నాయ‌కులు ఇప్పుడు ఏం చేస్తున్నారు ? ఇప్పుడు పార్టీలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈవాద‌న వినిపిస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పోల‌వ‌రం, అర‌కు, పాడేరు, సాలూరు, పాల‌కొండ‌, కురుపాం, రంప‌చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో చ‌క్రం తిప్పిన నాయ‌కులు.. ఇప్పుడు ఎక్కడా క‌నిపించ‌డం లేదు. వారి మాట కూడా వినిపించ‌డం లేదు.

తక్కువ స్థానాల్లో గెలిచినా…..

వాస్తవానికి 2014లో ఒక్క పోల‌వ‌రంలో మాత్రమే ముడియం శ్రీనివాస‌రావు.. టీడీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించారు. మిగిలిన అన్ని గిరిజిన నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. వీరిలో రంప‌చోడ‌వ‌రం, అర‌కు, పాడేరు ఎమ్మెల్యేలు వైసీపీని వ‌దిలి.. టీడీపీలో చేరిపోయారు. వీరిలో అర‌కు ఎమ్మెల్యే కిడారిని మావోయిస్టులు హ‌త‌మార్చారు. ఆ త‌ర్వాత ఆయ‌న కుమారుడు శ్రావ‌ణ్ కుమార్ టీడీపీలో మంత్రి అయ్యారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో పోటీ చేసినా.. డిపాజిట్లు కూడా ద‌క్కలేదు. పైగా మూడో స్థానంలో నిలిచి ప‌రువు పోగొట్టుకున్నారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి…..

అప్పటి నుంచి శ్రావ‌ణ్‌ సైలెంట్ అయ్యారు. అడ‌పా ద‌డ‌పా .. పార్టీ కార్యక్రమాల‌కు హాజ‌ర‌వుతున్నా అనుకున్న రేంజ్‌లో మాత్రం దూకుడు చూపించ లేక పోతున్నారు. పైగా ఆయ‌నకు వైసీపీ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయ‌న్న లీకులు వ‌దులుతున్నాయి. ఇక‌, పాడేరు నుంచి వైసీపీ త‌ర‌ఫున గెలిచిన గిడ్డి ఈశ్వరి కూడా టీడీపీలోకి వ‌చ్చారు. త‌ర్వాత ఆమె కూడా సైలెంట్ అయ్యారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసినా ఓడిపోయారు. ఇక‌, రంపచోడ‌వ‌రంలో గెలిచిన వంతల రాజేశ్వరి.. త‌ర్వాత వైసీపీని వీడి టీడీపీలోకి చేరిపోయారు. ఇక‌, గ‌త ఏడాది ఆమె కూడా ఓడిపోయారు.

ఎన్నికల ఫలితాల తర్వాత…..

పోల‌వ‌రం మాజీ ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస‌రావుకు గ‌త ఎన్నిక‌ల్లో సీటే రాలేదు.. ఎన్నిక‌ల త‌ర్వాత శ్రీనివాస్‌ అడ్రస్ క‌నిపించ‌డం లేదు. కానీ, వీరంతా కూడా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. అధికారాన్ని బాగానే వినియోగించుకున్నారు. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. వైసీపీపై తీవ్ర విమ‌ర్శలు కూడా చేశారు. కానీ.. టీడీపీ ఓట‌మితో ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని.. పార్టీ జెండా ప‌ట్టుకునేందుకు కూడా ముందుకు రావ‌డం లేదు.

వీరిలో ఎంతమంది?

దీంతో వీర‌స‌లు పార్టీలో ఉన్నారా? లేరా? అనే సందేహాలు వ్యక్తమ‌వుతున్నాయి. చంద్రబాబు కూడా వీరిని ప‌ట్టించుకోవ‌డం మానేశారు. పార్టీలో ఎంద‌రికో ప‌ద‌వులు ఇస్తే.. వీరిలో కిడారి శ్రావ‌ణ్‌కు మాత్రం చిన్న ప‌ద‌వి ద‌క్కింది. ఇక ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణికి మాత్రం అర‌కు పార్లమెంట‌రీ పార్టీ ప‌గ్గాలు ఇవ్వగా ఆమె మాత్రమే స్థానికంగా వాయిస్ వినిపిస్తున్నారు. వీరిలో కూడా వ‌చ్చే రెండేళ్ల వ‌ర‌కు ఎంద‌రు పార్టీలో ఉంటారో ? కూడా చెప్పలేని ప‌రిస్థితి..!

Tags:    

Similar News