నువ్వటుంటే.. నేను ఇటుంటా… ఇదీ సైకిల్ సవారీ

టీడీపీకి కంచుకోట వంటి అనంత‌పురంలో ఇప్పుడు త‌మ్ముళ్ల మ‌ధ్య కొన‌సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధాలు మొత్తానికే పార్టీకి రూపు రేఖ‌లు లేకుండా చేస్తున్నాయ‌ని అనిపిస్తోంది. ఈ ప‌రిణామాలు ద్వితీయ [more]

Update: 2020-03-24 14:30 GMT

టీడీపీకి కంచుకోట వంటి అనంత‌పురంలో ఇప్పుడు త‌మ్ముళ్ల మ‌ధ్య కొన‌సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధాలు మొత్తానికే పార్టీకి రూపు రేఖ‌లు లేకుండా చేస్తున్నాయ‌ని అనిపిస్తోంది. ఈ ప‌రిణామాలు ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని కుంగదీస్తున్నాయి. ముఖ్య నాయకులు ఎడమొహం పెడమొహంగా ఉంటుండడంతో ఎవరిపక్షాన నిలబడాలో తెలియని అయోమయ పరిస్థితిలో వారున్నారు. నేతల మధ్య గ్రూపులతో పార్టీకి నష్టం వాటిల్లుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ‌త ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చవిచూసినా నాయకులు గుణపాఠం నేర్చుకోకపోవడం గ‌మ‌నార్హం. జిల్లా వ్యాప్తంగా దాదాపు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ నేత‌ల మ‌ధ్య విభేదాలు తార‌స్థాయిలో కొన‌సాగుతున్నాయి.

పెనుకొండ‌:

ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఎడమొహం, పెడమొహంగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఎవరి పక్షం వహించాలో తేల్చుకోలేని స్థితిలో సతమతమవుతున్నాయి. ఇద్దరూ బలమైన బీసీ నాయకులు కావడంతో పాటు ఒకే నియోజకవర్గంలో వారుండడంతో పార్టీ శ్రేణుల పరిస్థితి అటు నుయ్యి.. ఇటు గొయ్యి అన్నట్లు మారింది. ఇద్దరు నేతలు ఎవరికి వారు తామే గొప్ప అని అనుకోవడం, ద్వితీయ శ్రేణి నాయకులను కలవరపరుస్తోంది. ప్రస్తుత స్థానిక ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ వీరు ఇలానే ఉండ‌డం గ‌మ‌నార్హం.

శింగ‌న‌మ‌ల:

ఈ నియోజకవర్గం ప్రస్తుతం గ్రూపు రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. నియోజకవర్గ ఇన్‌చార్జి బండారు శ్రావణిశ్రీ, మాజీ ఎమ్మెల్యే యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తూండడంతో ద్వితీయశ్రేణి నాయకుల్లో చీలికలేర్పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై ఆ ప్రభావం ఉంటుంది. సహకరించడానికి కొందరు ద్వితీయశ్రేణి నాయకులు ససేమిరా అంటూండడమే ఇందుకు నిదర్శనం. ఎన్నికల్లో తాము సహకరించే ప్రసక్తే లేదని పార్టీ అధిష్ఠానానికే వారు ఇప్పటికే సూచించినట్లు సమాచారం. పార్లమెంటు ఇన్‌చార్జి జేసీ పవన్‌రెడ్డి జోక్యం చేసుకున్నప్పటికీ ఫలితం కనిపించ లేదు. దీంతో స్థానికంపై టీడీపీ ఆశ‌లు వ‌దులుకున్నట్టేన‌ని అంటున్నారు.

క‌ళ్యాణ‌దుర్గం:

ఈ నియోజకవర్గంలోనూ ఇన్‌చార్జి ఉమామహేశ్వరనాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి రెండు వర్గాలుగా విడిపోయారు. ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలు చేపడుతూండడంతో.. ఏ వర్గం వైపు వెళ్లాలో తెలియక పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. స్థానిక అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఈ వర్గ విభేదాలు కొంత ప్రభావం చూపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య అసంతృప్తులకు తోడు ఈ రెండు వర్గాలు కలిసి పనిచేస్తే టీడీపీకి తిరుగుండదనే వాదన పార్టీ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. అయితే, ఆదిశ‌గా మాత్రం టీడీపీ నాయ‌కులు దృష్టి పెట్టక‌పోగా ఆధిప‌త్య రాజ‌కీయాల‌కే ప‌రిమిత‌మ‌య్యారు.

క‌దిరి:

మ‌రో నియోజ‌క‌వ‌ర్గం కదిరిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నియోజకవర్గ ఇన్‌చార్జి కందికుంట వెంకటప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే చాంద్‌బాషా వర్గీయుల మధ్య ఆది నుంచి విభేదాలున్నాయి. దీంతో పార్టీ శ్రేణులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. తాజాగా మండల కన్వీనర్‌ రామకృష్ణారెడ్డి టీడీపీని వీడారు. ఇక్కడ నేతల మధ్య సఖ్యత కొనసాగితే ప్రయోజనం ఉంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కానీ, ఆ ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.

అనంత అర్బన్‌ :

అనంతపురం అర్బన్‌లోనూ గ్రూపులకు కొదవేమీ లేదు. ఇక్కడ అన్ని వర్గాలనూ ప్రస్తుత ఇన్‌చార్జి కలుపుకునిపోతే మేయర్‌ పీఠం టీడీపీదేనని ద్వితీయశ్రేణి నాయకులు, తెలుగు తమ్ముళ్లు భరోసాతో ఉన్నారు. ఆ దిశగా అడుగులు పడాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి. గుంతకల్లులోనూ విభేదాలున్నాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ కొందరు నాయకులను కలుపుకుని పోవడం లేదనే విమర్శలు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. తాడిపత్రి నియోజకవర్గంలో గ్రూపులు లేనప్పటికీ.. సుదీర్ఘకాలం పాటు రాజకీయాలు చేస్తూ వస్తున్న జేసీ దివాకర్‌రెడ్డి తాజాగా స్థానిక ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ శ్రేణుల్లో ఒకింత అభద్రతాభావం కలిగించాయని చెప్పవచ్చు. ఇక రాప్తాడులో తమకు ప్రాధాన్యం లేదనే అసంతృప్తితో పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇక్కడ ప‌రిటాల కుటుంబంపై ఎవ‌రైనా అసంతృప్తి వ్యక్తం చేస్తే వాళ్లను బ‌య‌ట‌కు పంపేస్తున్నార‌న్న విమ‌ర్శలున్నాయి.

ధ‌ర్మవ‌రం:

ధర్మవరంలో సార్వత్రిక ఎన్నికల అనంతరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పార్టీ వీడి బీజేపీలోకి చేరడంతో నాయకత్వం బలహీనపడింది. కాగా కొన్ని నెలల క్రితం ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు పరిటాల కుటుంబం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పరిటాల శ్రీరామ్‌ ఆ నియోజకవర్గంపై దృష్టి సారించారు. స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులను నిలబెట్టే దిశగా ఆయన కృషి చేస్తున్నారు. అయితే, ఏమేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి.

పుట్టప‌ర్తి:

పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ద్వితీయ శ్రేణి నాయకత్వం మధ్య విభేదాలున్నాయి. గత ఎన్నికల్లో ఓటమికి అవే కారణమని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పుడు స్థానిక ఎన్నిక‌ల్లో స‌హ‌క‌రించుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీంతో పార్టీ ఓట‌మి అంచున వేలాడుతోంది. ఇలా మెజార్టీ నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలున్నాయనడం ఎవరూ కాదనలేని విషయమని పార్టీ వర్గాలు తేల్చి చెబుతున్నాయి.

Tags:    

Similar News