టీడీపీలో ఆగ‌ని పంచాయితీలు… ప‌వ‌న్ టార్గెట్‌గా కొత్త గొడ‌వ ?

తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన అనంత‌పురం జిల్లాలో పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ గొడ‌వ‌లు ముదిరి పాకాన ప‌డ్డాయి. ప‌రిటాల గ్రూప్‌, జేసీ గ్రూప్‌, [more]

Update: 2021-02-10 05:00 GMT

తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన అనంత‌పురం జిల్లాలో పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ గొడ‌వ‌లు ముదిరి పాకాన ప‌డ్డాయి. ప‌రిటాల గ్రూప్‌, జేసీ గ్రూప్‌, ప‌య్యావుల గ్రూప్‌, ప్రభాక‌ర్ చౌద‌రి గ్రూప్‌, హ‌న్నంత‌న్న గ్రూప్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ గ్రూపుల గోల దెబ్బతోనే 2014 ఎన్నిక‌ల్లో వైసీపీని రెండు సీట్లకు ప‌రిమితం చేసిన టీడీపీ… గ‌త ఎన్నిక‌ల్లో తానే రెండు సీట్లతో స‌రిపెట్టు కోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఇక జేసీ దివాక‌ర్ రెడ్డి ఎంపీగా ఉన్న ఐదేళ్లు టీడీపీ నేత‌లు విప‌క్ష పార్టీలతో పోరాడ‌డం కంటే ఆయ‌న‌తో పోరాడ‌డంత‌నే టైం వేస్ట్ చేసుకున్నారు. చివ‌ర‌కు గ‌త ఎన్నిక‌ల్లో జేసీతో పాటు ఆయ‌న సోద‌రుడు ప్రభాక‌ర్ రెడ్డి ఇద్దరూ త‌ప్పుకోగా వీరి వార‌సులు ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయారు.

తన వర్గం కోసం……

ఇక తాడిప‌త్రిలో ఓడిన అశ్మిత్ రెడ్డి పూర్తిగా సైలెంట్ అవ్వగా… టీడీపీలో భ‌విష్యత్తు ఉంటుందా ? అన్న సందేహంలోనూ ఉన్నట్టు భోగ‌ట్టా ? ప‌వ‌న్ కుమార్ రెడ్డి మాత్రం యాక్టివ్‌గానే ఉంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయాక అనంత‌పురం పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా జేసీ ప‌వ‌న్ కుమార్ రెడ్డి వ్యవ‌హ‌రిస్తున్నారు. ప‌వ‌న్ త‌న పార్లమెంటు ప‌రిధిలోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న అనుచ‌ర‌గ‌ణాన్ని ఎంక‌రేజ్ చేస్తూ ప‌ట్టుకోసం ఎన్నో ప్రయ‌త్నాలు చేస్తున్నారు. అనంత‌పురం న‌గ‌రంలో స్థానిక ఎన్నిక‌ల్లో త‌న వ‌ర్గం నేత‌ల‌కు కార్పొరేట‌ర్ సీట్ల కోసం నానా హంగామా చేశారు.

ఎవరితో చెప్పకుండానే…?

ఇక ఇక్కడ ప‌ట్టుకోసం త‌న పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు క‌లిపి ఓ పార్టీ కార్యాల‌యం ఏర్పాటు చేయాల‌ని ప్లాన్ చేసి అందుకు త‌గ్గట్టుగానే హ‌డావిడి చేశారు. అనంత‌పురం పార్లమెంట‌రీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసుల‌కు చెప్పకుండానే ప‌వ‌న్ ఈ కార్యాల‌యాన్ని ప్రారంభించే ప్రయ‌త్నం చేశారు. అయితే ప‌వ‌న్ తీరుపై మాజీ ఎమ్మెల్యేలు ప్రభాక‌ర్ చౌద‌రి, ఉన్నం హ‌న్మంతరాయ చౌద‌రి, జితేంద‌ర్ గౌడ్ భ‌గ్గుమ‌న్నారు. తాము ప‌వ‌న్ కుమార్ రెడ్డి కార్యాల‌య ప్రారంభోత్సవానికి వెళ్లమ‌ని చెప్పారు.

ఇద్దరు మాత్రమే…..

చివ‌ర‌కు ఈ విష‌యం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టికి వెళ్లడంతో అక్కడ నుంచి ఫోన్ రావ‌డంతో జేసీ పవన్ వెన‌క్కు త‌గ్గారు. చివ‌రి నిమిషంలో దానిని పార్టీ కార్యాల‌యంగా కాకుండా జేసీ ప‌వ‌న్ వ్యక్తిగ‌త కార్యాల‌యంగా మార్చాల్సి వ‌చ్చింది. ఇక పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో శింగ‌న‌మ‌ల ఇన్‌చార్జ్ బండారు శ్రావ‌ణి, క‌ళ్యాణ‌దుర్గం ఇన్‌చార్జ్ ఉమామ‌హేశ్వర నాయుడు మాత్రమే జేసీ ప‌వ‌న్‌తో క‌లిసి ఉంటున్నారు. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌లు, మాజీ ఎమ్మెల్యేలు మాత్రం ప‌వ‌న్‌తో క‌లిసి రాజ‌కీయం చేసేందుకు ఇష్టప‌డ‌డం లేదు.

ఎక్కువ ప్రయారిటీ ఇవ్వొద్దంటూ…..

మూడు ద‌శాబ్దాలుగా టీడీపీకి వ్యతిరేకంగా రాజ‌కీయం చేసిన జేసీ కుటుంబానికి ఎక్కువ ప్రయార్టీ ఇస్తే జిల్లాలో బీసీల‌తో పాటు మ‌రో రెండు సామాజిక వ‌ర్గాల్లో పార్టీ ప‌ట్ల వ్యతిరేక‌త ప్రబ‌లే ప్రమాదం ఉంద‌ని ప‌లువురు నేత‌లు చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లార‌ట‌. వారిని తాడిప‌త్రి దాటి బ‌య‌ట‌కు రాకుండా క‌ట్టడి చేయాల‌ని బాబుకు చెప్పార‌ట‌. ఏదేమైనా అనంత టీడీపీ నేత‌లు జేసీ పవన్ పెత్తనాన్ని స‌హించే ప‌రిస్థితి లేద‌ని వారి చ‌ర్యలే చెప్పక‌నే చెపుతున్నాయి.

Tags:    

Similar News