అనంత టీడీపీ నేతల రూటు సపరేటు.. పంచాయతీల్లో ఫెయిల్.. మరి?

అనంతపురంలో తెలుగుదేశం పార్టీ పరిస్థిత దయనీయంగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా చతికలపడింది. పట్టున్న ప్రాంతాల్లోనూ టీడీపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. హిందూపురం వంటి నియోజకవర్గాల్లోనూ [more]

Update: 2021-03-06 09:30 GMT

అనంతపురంలో తెలుగుదేశం పార్టీ పరిస్థిత దయనీయంగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా చతికలపడింది. పట్టున్న ప్రాంతాల్లోనూ టీడీపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. హిందూపురం వంటి నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఆధిక్యత కనపర్చడం టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపింది. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు అనంత నేతల ఎదుట అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అధికార పార్టీ ఆగడాలను నేతలు సమర్థవంతంగా ఎదుర్కొనలేకపోయారని చంద్రబాబు అభిప్రాయపడినట్లు సమాచారం.

బలమున్న ప్రాంతాల్లోనూ…..

అనంతపురం జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం, ఉరవకొండ స్థానాలను మాత్రమే దక్కించుకోగలిగింది. ఇక్కడ పార్టీకి పటిష్టమైన ఓటు బ్యాంకు ఉంది. అయితే నేతల మధ్య సమన్వయం లేకపోవడం, ఆధిపత్య పోరుతో పంచాయతీలను చేజార్చుకుంది. మొత్తం 995 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే అందులో 740 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. 61 స్థానాల్లో వైసీపీ రెబల్ అభ్యర్థులు గెలుపొందారు. కేవలం 180 పంచాయతీల్లోనే టీడీపీ గెలవగలిగింది.

పదే పదే చంద్రబాబు….

దీంతో మున్సిపల్ ఎన్నికలలోనైనా కలసికట్టుగా పనిచేయాలని పార్టీ అధినేత చంద్రబాబు అనంతపురం నేతలకు సూచించినట్లు తెలిసింది. పట్టణ ప్రాంతాల ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తి ఉందని, కనీసం ఈ ఎన్నికల్లోనైనా గెలుపు కోసం కృషి చేయాలని చంద్రబాబు టీడీపీ నేతలను పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అనంతపురం కార్పొరేషన్ తో పాటు పది మున్సిపాలిటీలకు ఇక్కడ ఎన్నికలు జరగనుండటంతో ముఖ్య నేతలకు చంద్రబాబు బాధ్యతలను అప్పగించారు.

పది మున్సిపాలిటీల్లో….

అనంతపురం కార్పొరేషన్ తో పాటు కీలకమైన తాడిపత్రి, హిందూపురం, రాయదుర్గం, ధర్మవరం, గుంతకల్లు, కదిరి, గుత్తి, కల్యాణదుర్గం, పుట్టపర్తి, మడకశిర మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఒక్క హిందూపురంలోనే ఎమ్మెల్యే ఉన్నారు. ధర్మవరం బాధ్యతలను పరిటాల శ్రీరామ్ కు అప్పగించారు. మిగిలిన చోట్ల ఇన్ ఛార్జులు ఉన్నారు. అందరూ కలసి పనిచేసి టీడీపీ విజయానికి కృషి చేయాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. మరి మున్సిపల్ ఎన్నికల్లోనైనా టీడీపీ కుదురుకుంటుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News