పోగేసుకున్న వారే పో.. పో మంటున్నారే?

ప్రస్తుతం టీడీపీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. స్థానిక ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు ప‌రిష‌త్ ఎన్నిక‌ల నుంచి పార్టీ త‌ప్పుకోవాల‌ని.. చంద్రబాబు పిలుపునిచ్చారు. అయిన‌ప్పటికీ.. కొంద‌రు [more]

Update: 2021-04-19 12:30 GMT

ప్రస్తుతం టీడీపీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. స్థానిక ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు ప‌రిష‌త్ ఎన్నిక‌ల నుంచి పార్టీ త‌ప్పుకోవాల‌ని.. చంద్రబాబు పిలుపునిచ్చారు. అయిన‌ప్పటికీ.. కొంద‌రు నాయ‌కులు మాత్రం ప‌రువు పేరుతో ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. అయితే.. ఈ క్రమంలో పార్టీ నుంచి ఆర్థికంగా వీరికి స‌హ‌కారం క‌రువైంది. నిజానికి స్థానిక ఎన్నిక‌ల్లో చంద్రబాబు చాలా మందికి సాయం చేయాల‌ని.. పిలుపునిచ్చారు. అంత‌ర్గత చ‌ర్చల్లో నేత‌ల‌కు ఈ విష‌యాన్ని నూరిపోశారు. అయితే.. చంద్రబాబు చెప్పిన‌ప్పుడు.. స‌రే.. అన్న నాయ‌కులు తీరా ఎన్నిక‌ల విష‌యానికి వ‌చ్చే స‌రికి.. మాత్రం ఎవ‌రికి వారు త‌ప్పుకొన్నారు.

ఆర్థిక సాయం అందించాలని…..

నిజానికి చంద్రబాబు చెప్పినవారిలో మాజీ మంత్రులు, ఆర్థికంగా బ‌లంగా ఉన్నవారే ఉన్నారు. కానీ, వారెవ‌రూ కూడా స్పందించ లేదు. వీరు స్పందించి.. నేత‌ల‌కు ఆర్థికంగా అంతో ఇంతో సాయం చేసి ఉంటే.. పార్టీ కొన్ని చోట్ల అయినా గెలుపు గుర్రం ఎక్కేద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పార్టీకి ప‌ట్టున్న కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో 30 శాతం సీట్లు గెలుచుకుంది. అదే పార్టీ నుంచి ప్రతి నియోజ‌క‌వ‌ర్గానికి ఎంతో కొంత సాయం అంది ఉంటే మ‌రో 10 – 15 శాతం పంచాయ‌తీలు అద‌నంగా గెలిచి ఉండేవాళ్లమ‌ని ప‌లువురు ఇన్‌చార్జ్‌లు అదిష్టానం ముందు ఆవేద‌న వ్యక్తం చేశారు.

బాగా సంపాదించుకున్నా….

ఈ క్రమంలో ఇప్పుడు ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లోనూ ఎవ‌రూ ముందుకు రార‌ని ఊహించే చంద్రబాబు త‌ప్పుకొన్నార‌ని సీనియ‌ర్ల నుంచి వాద‌న ఉంది. ఆర్థికంగా చాలా మంది గ‌త చంద్రబాబు హ‌యాంలో సంపాయించుకున్నారు. కాంట్రాక్టులు, వివిధ రూపాల్లో ఆర్థిక లావాదేవీలు జ‌రిపిన వారు బాగానే పోగేసుకున్నారు. పెట్టుబ‌డులు పెట్టి లాభించారు. కానీ, ఇప్పుడు వారు వెనుక‌డుగు వేస్తున్నారు. అయితే.. వీరికి టీడీపీపై ప్రేమ లేద‌ని కాదు.. కానీ.. అధికార పార్టీ విష‌యంలో వారు ఒక అంచ‌నాకు వ‌చ్చారు. వైసీపీ ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఏపార్టీ కూడా దానిని ఎదుర్కొనే ప‌రిస్థితి లేద‌ని టీడీపీలో ఆర్థికంగా బ‌లంగా ఉన్న వారు న‌మ్ముతున్నారు.

వచ్చే ఎన్నికల నాటికి….

పైగా స్థానిక ఎన్నిక‌ల్లో గెలిచినా.. సంపాయించుకునే మార్గాలు కూడా ఉండ‌వు. సో.. ఇప్పుడు డ‌బ్బులు పంచేసి.. చేతులు ఎత్తేయ‌డం క‌న్నా.. మౌనంగా ఉండ‌డ‌మే మేల‌ని చాలా మంది మాజీ మంత్రులు, ఎంపీలుసైతం త‌ల‌పోసిన‌ట్టు చంద్రబాబుకు తెలిసింది. అయితే.. వీరి ఆలోచ‌న మంచిదే అయినా.. టీడీపీని నిల‌బెట్టాల్సిన అవ‌స‌రం కూడా ఉంద‌నేది పార్టీ నేత‌ల మాట‌. కానీ, ఇప్పుడు ఎవ‌రూ ఎవ‌రి మాటా వినిపించుకునే ప‌రిస్థితి లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి ఏదైనా మారితే.. అప్పుడు వీరంతా స‌హ‌క‌రించే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు.

Tags:    

Similar News