టీడీపీని పంచేసుకుంటున్నారుగా?

టీడీపీ అంటే ఒక పొలిటికల్ బ్రాండ్. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా అన్న నందమూరి పెట్టిన పార్టీ ఇది. దేశానికి స్వాతంత్రం వచ్చాక మొదటి మూడు దశాబ్దాలు కాంగ్రెస్ [more]

Update: 2020-10-09 12:30 GMT

టీడీపీ అంటే ఒక పొలిటికల్ బ్రాండ్. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా అన్న నందమూరి పెట్టిన పార్టీ ఇది. దేశానికి స్వాతంత్రం వచ్చాక మొదటి మూడు దశాబ్దాలు కాంగ్రెస్ వే రోజులు. ఇక ఉమ్మడి ఏపీలో చూస్తే కాంగ్రెస్ కి అసలు పోటీయే లేదు. 50 దశకంలో కొంతవరకూ పోటీ ఇచ్చిన వామపక్షాలు ఆ తరువాత చీలిపోవడంతో కాంగ్రెస్ కి బాగా కలసివచ్చింది. ఇక దేశమంతా జనతా ప్రభంజనం వీచినా కూడా ఏపీ జనాలు కాంగ్రెస్ వెంట నడించారంటే ఎంతటి నమ్మకమో మరి. అటువంటి కాంగ్రెస్ కి సరైన ఆల్టర్నేటివ్ లేదు అనుకుంటున్న వేళ నేనున్నాను అంటూ ఎన్టీయార్ రంగంలోకి దిగారు. అప్పటికే ప్రతీ పల్లెల్లోనూ, ఇంటిలోనూ చేరిపోయిన కాంగ్రెస్ ని కూకటి వేళ్లతో సహా పెకిలించారు ఎన్టీయార్.

నానాటికీ తీసికట్టు….

ఇక చంద్రబాబు మామ పక్కన ఉండి టీడీపీని ఎంతవరకూ అభివృద్ధి చేశారో కానీ ఆయన ఎన్టీయార్ కి వెన్నుపోటు పోడిచి చేతిలోకి సీఎం సీటు, పార్టీతో సహా తీసుకున్న తరువాత తెలుగుదేశం ప్రభలు మెల్లగా కరిగిపోవడం జరిగింది. 2004, 2009 ఎన్నికల్లో ఓటమి ఒక ఎత్తు అయితే ఏకంగా 23 సీట్లు వచ్చిన 2019 ఎన్నికల ఫలితాలను టీడీపీకి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక ఈ ఏడాదిన్నర కాలంలో బాబు రాజకీయ వ్యూహాలకే పరిమితం అయ్యారు. అధికార పార్టీని ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నాను అనుకున్నారు కానీ టీడీపీ పాతాళానికి జారుతోందని ఆలోచించలేకపోయారు. దాంతో ఇపుడు వెనక్కి తిరిగి చూసుకుంటే టీడీపీ పతనం అంచుల్లో ఉంది.

ఏమీ కారా…?

నిజానికి నాయకుడు అన్న వాడి అంతిమ లక్ష్యం పీఠమే. కానీ అది దక్కడానికి ఎంతో పోరాటం చేయాలి, దీక్షా దక్షతలను చాటుకోవాలి. కానీ చంద్రబాబు తీరుని ఎపుడు చూసినా విపక్షంలోకి రాగానే జావగారిపోతున్నారు. అధికారంలో ఉంటే బాబు రాజసం చెప్పనలవికాదు, ఆయన చండశాసనుడే. అదే బాబు మాజీ అయితే మాత్రం కనీసం దిగువ స్థాయి నాయకుడు సైతం పట్టించుకోకుండా జంప్ చేస్తున్నారు. ఇపుడు ఏపీలో టీడీపీ సీన్ చూసి సగటు ప్రజానీకం కూడా ఎంత పార్టీ ఎలా అయిపోయింది అని అనాల్సివస్తోంది. బాబు కూడా పవర్ లోలేని పార్టీలో తీసికట్టు అయిపోతున్నారు.

ఇదీ లెక్కట….

ఎమ్మెల్యేలు అందరూ వైసీపీ వైపు సాగుతున్నారు. ఎంపీలు మాత్రం చక్కగా బీజేపీ గూటికి చేరుకున్నారు. ఈ లెక్కేదో బాగుందని వైసీపీ బీజేపీ కూడబలుక్కున్నట్లుగా టీడీపీ మీద పడి పంచేసుకుంటున్నాయి. అక్కడ మోడీ, ఇక్కడ జగన్ అధికారంలోకి రావడంతో మొదటగా జంప్ అయింది నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు. వారు వెళ్ళడమే కాదు, రాజ్యసభలో టీడీపీని కూడా బీజేపేలో విలీనం చేసేశారు. ఇక మరో వైపు చూసుకుంటే లోక్ సభలో గెలిచిన ముగ్గురు టీడీపీ ఎంపీలు ఉన్నారు. వీరు ముగ్గురి తోవ వేరుగా ఉన్నట్లుగా ఉన్నా అంతిమంగా వీరు చేరేది బీజేపీ గూట్లోకేనా అన్న చర్చ వస్తోంది. అందులో ముందుగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారు అంటున్నారు. ఆయన తల్లి మాజీ మంత్రి గల్లా అరుణ టీడీపీ పొలిట్ బ్యూరోకి రాజీనామా చేసి బాబుకు గట్టి షాక్ ఇచ్చేశారు. ఇదే వరసలో కేశినేని నాని, సిక్కోలు ఎంపీ రామ్మోహననాయుడు కూడా ఉన్నారని అంటున్నారు. ఇంకో వైపు చూస్తూంటే వరసగా ఎమ్మెల్యేలు టీడీపీకి గుడ్ బై కొట్టేసి వైసీపీ జెండా ఎత్తుతున్నారు. ఇవన్నీ చూస్తూంటే 2021 నాటికి ఏపీలో టీడీపీ ఎంతవరకు మిగిలి ఉంటుందన్నది తమ్ముళ్లకే కలవరం కలిగిస్తోందిట.

Tags:    

Similar News