అసలు ఏం జరుగుతోంది…?

ఏపీలో మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని భావించి కూడా ప్రతిప‌క్షానికే ప‌రిమిత‌మ‌య్యారు టీడీపీ నాయ‌కులు. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో 23 మంది మాత్రమే టీడీపీ నుంచి విజ‌యం సాధించారు. [more]

Update: 2019-07-19 09:30 GMT

ఏపీలో మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని భావించి కూడా ప్రతిప‌క్షానికే ప‌రిమిత‌మ‌య్యారు టీడీపీ నాయ‌కులు. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో 23 మంది మాత్రమే టీడీపీ నుంచి విజ‌యం సాధించారు. అయితే, వీరిలో చాలా మందిలో ఇంకా ఓట‌మి తాలూకు ప‌రిస్థితి ఇప్పటికీ క‌నిపిస్తోంది. దీంతో చాలా మంది నాయ‌కులు.. ఇప్పటికీ బ‌య‌ట‌కు రాలేక పోతున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. గ‌త నెల‌లోనే తొలి సెష‌న్ పూర్తయింది. రెండో సారి కూడా స‌మావేశాలు కూడా జ‌రుగుతున్నాయి. బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మై మూడు రోజులు సాగాయి. ఈ క్రమంలో అధికార, ప్రతిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్దం జోరుగా సాగుతోంది.

యుద్ధం జరుగుతున్నా….

సీఎం జ‌గ‌న్‌, ప్రతిప‌క్ష నాయ‌కుడు, మాజీ సీఎం చంద్రబాబుల మ‌ధ్య ప్రభుత్వ విధానాల‌కు సంబంధించి యుద్ధమే సాగుతోంది. మ‌రి ఈ స‌మ‌యంలో ప్రతిప‌క్షం త‌ర‌ఫున గ‌ట్టిగా గ‌ళం వినిపించేందుకు నాయ‌కులు పెద్దగా స‌భలో క‌నిపించ డం లేదు. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఎదుర‌వుతున్న యుద్ధాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు టీడీపీలో కీల‌క‌మైన నాయ‌కులు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో ఇప్పుడు ప్రతిప‌క్షం తేలిపోతోంది. అధికార ప‌క్షం నుంచి ఎదుర‌వుతున్న దాడిని త‌ట్టుకునేందుకు కేవ‌లం ఒక‌రిద్దరు మాత్రమే టీడీపీ నుంచి బ‌ల‌మైన గ‌ళాన్ని వినిపిస్తున్నారు. అయినా కూడా వైసీపీ దాడిని బ‌లంగా తిప్పికొట్టలేక పోతున్నారు.

డుమ్మా కొడుతూ….

ఈ నేప‌థ్యంలో టీడీపీ త‌ర‌ఫున ఎన్నికైన 23 మంది ఏం చేస్తున్నార‌నే ప్రశ్న తెర‌మీదికి వ‌స్తోంది. ప్ర‌స్తుతం స‌భ‌కు హాజ‌రవుతున్న టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 12కు అటు ఇటుగా మాత్రమే ఉంటోంది. మ‌రి గెలిచిన వారిలో మిగిలిన 10 మంది ఎందుకు స‌భ‌కు రావ‌డం లేదు? అనే ప్రశ్న తెర‌మీదికి వ‌స్తోంది. వీరిలోనూ కొంచెం బ‌లంగా మాట్లాడ‌గ‌లిగే నాయ‌కులు గంటా శ్రీనివాస‌రావు, గొట్టిపాటి ర‌వి వంటి వారుకూడా స‌భ‌కు డుమ్మా కొడుతున్నారు. అస‌లు వీరిద్ద‌రూ ఇప్పటి వ‌ర‌కు ఒక్కసారిగా కూడా స‌భ‌కు వ‌చ్చినట్టు స‌మాచారం లేదు. ఇక‌, చంద్రబాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌య్య తొలి సెష‌న్‌లో రెండు రోజులు వ‌చ్చి.. ప్రమాణం ముగిసిన త‌ర్వాత ఇప్పటి వ‌ర‌కు అసెంబ్లీ ఛాయ‌ల‌కు కూడా రాలేదు.

అనుమానం నిజమైతే…?

దీనిని బ‌ట్టి స‌భలో వైసీపీ దూకుడు చూసి వీరంతా భ‌య‌ప‌డుతున్నారా? లేక టీడీపీ ఓట‌మిని ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారా? అనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇక వీరిలో కొందరు నేతలు ఇప్పటికే బిజెపి నేతలతో టచ్ లో ఉన్నార‌న్న ప్రచారం కూడా జరుగుతోంది. అటు బిజెపి వాళ్లు సైతం టిడిపికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని… వీరంతా త్వరలోనే తమ పార్టీలో చేరుతారంటూ లీకులు ఇస్తున్నారు. వైసిపి వాళ్ళు కూడా తాము గేట్లు ఎత్తితే టీడీపీ నుంచి ఏడు… ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గోడదూకేందుకు కాచుకొని కూర్చుని ఉన్నారని చెబుతున్నారు. బిజెపి… వైసీపీ నేతల వ్యాఖ్యలు ఇలా ఉంటే టిడిపిలో కొంత మంది ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై కూడా సొంత పార్టీ నేతల్లోనే అనుమానాలకు కారణమవుతున్నాయి. ఈ సందేహాలు ఉన్న నేత‌ల్లోనే ఇప్పుడు చాలా మంది అసెంబ్లీకి డుమ్మా కొట్టేస్తున్నారు.

Tags:    

Similar News