ఆ రెండూ ఇక వచ్చే ఛాన్స్ లేదట

రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి రావాల్సిన టీడీపీ బొక్కాబోర్లా ప‌డిన విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల‌కు ముందు బ‌ల‌మైన నాయకుల‌ను చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ నుంచి త‌ప్పించారు. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో [more]

Update: 2019-11-11 06:30 GMT

రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి రావాల్సిన టీడీపీ బొక్కాబోర్లా ప‌డిన విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల‌కు ముందు బ‌ల‌మైన నాయకుల‌ను చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ నుంచి త‌ప్పించారు. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో కొంద‌రు చెప్పుడు మాట‌లు విని.. కొత్తవారికి చంద్రబాబు ప‌గ్గాలు అప్పగించారు. అయితే, జ‌గ‌న్ సునామీ స‌హా స్థానికంగా వారికి ప‌ట్టులేక పోవ‌డంతో వారు ఓడిపోవ‌డంతో పాటు టీడీపీని కూడా భ్రష్టు ప‌ట్టించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. అయితే, మ‌రికొన్ని నియోజక‌వ‌ర్గాల్లో మ‌రింత‌గా టీడీపీ ప‌రిస్థితి దిగ‌జారింద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని రెండు నియోజ‌క‌వ‌ర్గాలు క‌నిపిస్తున్నాయి. అవి రెండు కూడా ఒక‌టి ఎస్సీ, మ‌రొక‌టి ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాలు కావ‌డం గ‌మనార్హం.

శాశ్వతమని భ్రమించి…..

వాస్తవానికి టీడీపీకి గ‌ట్టి ప‌ట్టున్న జిల్లా ప‌శ్చిమ గోదావ‌రి. 2014 ఎన్నిక‌ల్లో ఒక్క తాడేప‌ల్లి గూడెం మిన‌హాయించి(దీనిని పొత్తు లో భాగంగా బీజేపీకి కేటాయించారు. ఆ పార్టీ గెలిచింది) మిగిలిన అన్ని చోట్లా కూడా టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో జిల్లాలో ఇక టీడీపీ జెండా ఎగ‌ర‌డం శాశ్వత‌మ‌ని అనుకున్నారు. అయితే, ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో మాత్రం టీడీపీకి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. పాల‌కొల్లు, ఉండి మిన‌హా ఎక్కడా పార్టీ గెలుపు గుర్రం ఎక్కలేక పోయింది. ఇక‌, కీల‌క‌మైన మెట్ట ప్రాంతంలోని చింతల‌పూడి, పోల‌వరం నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా పార్టీ ఘోరంగా ఓడిపోయింది. చింత‌ల‌పూడి నుంచి పోటీ చేసిన క‌ర్రా రాజారావు, పోల‌వ‌రం నుంచి పోటీ చేసిన బొర‌గం శ్రీనివాస్ ఇద్దరూ కూడా గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు.

ఎప్పటికీ పుంజుకునే…..

స‌రే! ఎన్నిక‌ల‌న్నాక .. గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మే. అయితే, ఓడిపోయిన త‌ర్వాత అయినా.. టీడీపీని బ‌లోపేతం చేసుకునేందు కు కార్యక‌ర్తల్లో మ‌నోధైర్యం నింపేందుకు నాయ‌కులు ప్రయ‌త్నిస్తారు. ఇప్పుడు కాక‌పోతే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో లేదా స్తానిక సంస్థల ఎన్నిక‌ల్లో అయినా.. టీడీపీని గెలుపు గుర్రం ఎక్కించేందుకు సిద్ధమ‌వుతారు. నిత్యం ప్రజ‌ల్లో ఉంటూ.. వారి స‌మ‌స్యలు తెలుసుకుని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల‌పై నిగ్గదీస్తారు. అయితే, ఈ ఇద్దరూ కూడా ఎక్కడా క‌నిపించ‌డం లేదు. క‌ర్రా రాజారావు.. వ‌య‌సు రీత్యా పెద్దాయ‌న కావ‌డంతో ఆయ‌న పెద్దగా యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. దీంతో కార్యక‌ర్తలు చెల్లాచెదుర‌య్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఆయ‌న నామ్ కే వాస్తేగా మాత్రమే ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఓ అవుట్ డేటెడ్ నాయ‌కుడు అయిన రాజారావును న‌మ్ముకుని ఇక్కడ రాజ‌కీయం చేస్తే టీడీపీ ఎప్పట‌కీ పుంజుకునే ప‌రిస్థితి లేదు.

పోలవరం శ్రీను కూడా….

వ‌యోః భారంతో ఉన్న రాజారావునే ఇక్కడ కంటిన్యూ చేస్తే టీడీపీ ఆశ‌లు వ‌దులు కోవాల్సిందే. ఎన్నికల‌కు ముందు ఏదో మ‌మ అనిపించి కార్యక్రమాలు చేసినా. త‌ర్వాత మాత్రం ఎవ‌రికీ క‌నిపించక పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో పార్టీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేసే అవ‌కాశం లేదు. ఒక వేళ ఉన్నా.. కేడ‌ర్ ఆయ‌న‌కు స‌హ‌క‌రించే అవ‌కాశం కూడా లేదు. ఈయ‌న‌ను న‌మ్ముకుంటే మ‌రింత దారుణమ‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక‌, పోల‌వ‌రం విష‌యానికి వ‌స్తే.. 2014లో ఇక్కడ నుంచి మొడియం శ్రీనివాస్ గెలిచారు. అయితే, అవినీతి మ‌ర‌క‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌ను ప‌క్కన పెట్టిన చంద్రబాబు.. బొర‌గం శ్రీనును ఎన్నిక‌ల్లో నిల‌బెట్టారు. అయితే, ఆయ‌న కూడా ఓట‌మి త‌ర్వాత ఇక్కడ క‌నిపించ‌డం లేదు.

కష్టపడిన వారిని….

క‌న్వీన‌ర్ స్థాయిలో మాత్రం నియోజ‌క‌వ‌ర్గంలో తిర‌గ‌లేక పోతున్నార‌న్న అప‌వాదు ఉంది. ఇక్కడ కూడా బొర‌గం నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ఉన్న వైసీపీని అన్ని విధాలా ఢీ కొట్టే నాయ‌కుడు కాద‌న్న అభిప్రాయం ఉంది. నియోజ‌క‌వర్గంలోని ఏడు మండ‌లాల‌కు చెందిన కేడ‌ర్ అభిప్రాయంతో ఇక్కడ బ‌ల‌మైన నాయ‌కుడికి బాధ్యత‌లు అప్పగిస్తేనే పార్టీ పుంజుకునే ఛాన్స్ ఉంది. ఇక ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ కోసం క‌ష్టప‌డిన వారిని ప‌క్కన పెట్టి… కొంద‌రి మాట విన్న చంద్రబాబు ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో భారీగా మూల్యం చెల్లించుకోక త‌ప్పలేదు. ఇప్ప‌టికైనా వీరిద్దరినీ ప‌క్కకు త‌ప్పించి ప్రజాబ‌లం ఉన్న నాయ‌కుల‌ను నియ‌మించాల‌ని ఇక్కడి కేడ‌ర్ కోరుతోంది.

Tags:    

Similar News