పడకేసింది అందుకే..?

తూర్పుగోదావరి జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా వుండే జిల్లా. అలాంటి జిల్లాల్లో మొన్నటి ఎన్నికల ఫలితాల తరువాత టిడిపి జోష్ కనిపించడమే లేదు. జిల్లాల్లో రాజమండ్రి [more]

Update: 2019-10-27 08:00 GMT

తూర్పుగోదావరి జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా వుండే జిల్లా. అలాంటి జిల్లాల్లో మొన్నటి ఎన్నికల ఫలితాల తరువాత టిడిపి జోష్ కనిపించడమే లేదు. జిల్లాల్లో రాజమండ్రి అర్బన్, రూరల్, మండపేట, పెద్దాపురం మినహా అంతా వైసిపి సునామీలో కొట్టుకుపోయారు. ఒక్క రాజోలు లో మాత్రం వ్యక్తిగత ఇమేజ్ తో జనసేన ఒక్క సీటు దక్కించుకుంది. మొత్తం 19 నియోజకవర్గాల్లో 14 వైసిపి ఖాతాలోకి పోయాయి. ఇక పార్లమెంటు సీట్లు మూడూ వైసిపి నే దక్కించుకుంది. ఈ పరిస్థితుల్లో టీడీపీని గాడిన పెట్టాలిసిన సీనియర్లు దిక్కులు చూస్తూ ఉండటంతో క్యాడర్ ఆందోళన చెందుతున్నారు.

హేమా హేమీలు పట్టించుకుంటేనా …?

జిల్లాలో పెద్ద దిక్కుగా వున్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పత్తా లేకుండా పోయారు. ఇక మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పరిస్థితి అంతంత మాత్రమే. మరో సీనియర్ నేత డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెన్ను చికిత్స తో మంచం పట్టారు. ఇక అడపాదడపా టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రు గొంతు వినిపిస్తున్నా అదేమీ కార్యకర్తల్లో హుషారు తేలేకపోతుంది. మరో పక్క మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన మాగంటి మురళి మోహన్, చలమలశెట్టి సునీల్, బాలయోగి కుమారుడు హరీష్ మాధుర్ మాత్రం అడపా దడపా కార్యక్రమాల్లోనే కనిపిస్తున్నారు. ఇక జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు అని చాలా మందికి తెలియని రీతిలో టిడిపి నడుస్తుంది.

తోటను, వరపులను ఆపలేక పోయారు ….

ఇటీవల జిల్లాలో బలమైన కాపు సామాజిక వర్గ నాయకుడు తోట త్రిమూర్తులు టిడిపి కి గుడ్ బై కొట్టేశారు. ఆయన్ను బుజ్జగించాలని అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. అదే బాటలో మాజీ డిసిసిబి అధ్యక్షుడు వరుపుల రాజా టిడిపిని వీడి వెళ్లిపోయారు. దాంతో ప్రత్తిపాడు నియోజకవర్గం బాధ్యతలు చూసే వారే లేకుండా పోయారు. ఇక్కడ తక్షణం ఇంఛార్జి ను నియమించాలని క్యాడర్ మొత్తుకుంటున్నా టిడిపి లోని జిల్లా పెద్ద తలకాయలు పట్టించుకున్న పాపానికి పోలేదంటే తెలుగుదేశం ఎంతటి దయనీయ పరిస్థితికి వచ్చిందో తేలిపోతుంది.

ఎవరు బాధ్యతలు స్వీకరించినా ….

ఎందరో సీనియర్లు ఉన్నా టీడీపీ పడకేయడానికి రీజన్స్ కూడా ఉన్నాయని తూర్పు గోదావరి జిల్లా నేతలు తమలో తాము గుసగుస లాడుకుంటున్నారు. ఎవరు బాధ్యతలు నెత్తికి ఎత్తుకుంటే వారికి చేతి చమురు వదిలిపోతుందనే అంతా కాడి వదిలి పోయారన్న టాక్ బలంగా వినిపిస్తుంది. వచ్చే స్థానిక ఎన్నికల్లో అంగబలం అర్ధబలం అవసరం. ఈ రెండిటికి లెక్కలేనంత ధనం కూడా కావాలి.

మరికొందరు వైసిపి లోకి ….

అందుకే ఇటీవల కాకినాడ మేయర్ సుంకర పావని ఆమె భర్త తిరుమల కుమార్ వైసిపి లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జోరుగా నడుస్తుంది. ముఖ్యమంత్రి జగన్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనల్లో పావని హుషారుగా పాల్గొనడం ఈ అనుమానాలను బలపరుస్తుంది. ఇక కాకినాడ సిటీ టిడిపి అధ్యక్షుడు నున్న దొరబాబు సైతం జై జగన్ అనేస్తారనే ప్రచారం చూస్తుంటే రాబోయే రోజుల్లో టీడీపీ మరింతగా కుంగిపోయే వాతావరణమే కనిపిస్తుంది. మరి ఈ సంక్షోభాలనుంచి అధినేత చంద్రబాబు ఎలా పార్టీని గట్టెక్కిస్తారు ? తూర్పు లో టీడీపీని బలోపేతం చేసుకునేందుకు ఎలాంటి ఎత్తుగడలు వేస్తారో చూడాలి.

Tags:    

Similar News