గన్నవరానికి అర్జున సారథ్యం.. సైకిల్ పరుగులు పెట్టేనా..?
కృష్ణా జిల్లా టీడీపీ రాజకీయాల్లో అనూహ్యమైన ఘటన చోటు చేసుకోనుందా ? ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాని.. నాయకుడు అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ కానున్నారా ? [more]
కృష్ణా జిల్లా టీడీపీ రాజకీయాల్లో అనూహ్యమైన ఘటన చోటు చేసుకోనుందా ? ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాని.. నాయకుడు అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ కానున్నారా ? [more]
కృష్ణా జిల్లా టీడీపీ రాజకీయాల్లో అనూహ్యమైన ఘటన చోటు చేసుకోనుందా ? ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాని.. నాయకుడు అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ కానున్నారా ? కీలకమైన టీడీపీ కంచుకోటలో మరింత కీలకమైన బాధ్యతలను చంద్రబాబు ఆయనకు అప్పగించనున్నారా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ఔననే అంటున్నారు నాయకులు. గన్నవరం నియోజకవర్గంలో కొన్ని దశాబ్దాలుగా టీడీపీ హవా కొనసాగుతోంది. అయితే, ఇటీవల కాలంలో ఈ నియోజకవర్గంలో పెను కుదుపు ఏర్పడింది. 2009, 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ ఘన విజయం సాధించింది. నిజానికి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జగన్ సునామీని తట్టుకుని నిలబెట్టుకున్న రెండు నియోజకవర్గాల్లో ఇది ఒకటి.
వంశీ వీడటంతో…..
ఈ నియోజకవర్గంలో వల్లభనేని వంశీకి మంచి పట్టుంది. అయితే, ఎన్నికలు ముగిసి, ఆయన గెలిచిన తర్వాత నుంచిమాత్రం ఆయనపై ప్రచారం ఊపందుకుంది. ఆయన పార్టీలో ఉంటారా ? వెళ్తారా ? అనే ప్రచారం సాగింది. ఈ క్రమంలోనే ఆయన మూడు మాసాల కిందట పార్టీకి రిజైన్ చేశారు. అయితే, పార్టీ ఎమ్మెల్యేగా మాత్రం కొనసాగుతున్నారు. దీంతో ఇక్కడ పార్టీ డీలా పడింది. నిన్నటి వరకు కూడా అన్నీ వంశీ అయి ఇక్కడ పార్టీని నడిపించారు. అయితే, ఆయన పార్టీని వీడి వైసీపీకి మద్దతివ్వడంతో ఇక్కడ టీడీపీ సైకిల్‌ను నడిపించే నాయకులు లేకుండా పోయారు. ఈ క్రమంలో గడిచిన మూడు మాసాలుగా ఇక్కడ పార్టీ కార్యక్రమాలు జరగలేదు. ఇదిలావుంటే, త్వరలోనే స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లను నియమించాలని చంద్రబాబు నిర్ణయించారు.
ఇన్ ఛార్జి పదవి కోసం….
ఈ క్రమంలోనే గన్నవరం నియోజకవర్గానికి ప్రస్తుతం కృష్ణాజిల్లా టీడీపీ ఇంచార్జ్, ఎమ్మెల్సీగా ఉన్న బచ్చుల అర్జునుడును నియమించేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారని తెలిసింది. వాస్తవానికి ఆయనకంటే కూడా ముందు నుంచి ఇక్కడ ఇంచార్జ్ పీఠం కోసం ప్రముఖ పారిశ్రామిక వేత్త పుట్టగుంట సతీష్‌కుమార్, జెడ్పీ మాజీ చైర్ పర్సన్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సతీమణి అనురాధలు పోటీ పడ్డారు. అయితే, ఇటీవల కాలంలో వారు ఆసక్తి చూపించలేదు. దీంతో చంద్రబాబు సంస్థాగత ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం జిల్లాలోని నాలుగు మండలాలకు నలుగురిని నియమించారు. వీరిలో బచ్చుల అర్జునుడు కూడా ఉన్నారు.
ఆ ఓటింగ్ ఎక్కువగా ఉండటంతో….
ఈయనకు బాపులపాడు మండల టీడీపీ బాధ్యతలను అప్పగించారు. మిగిలిన వారితో పోలిస్తే ఇటీవల కాలంలో బచ్చుల చాలా యాక్టివ్‌గా ఉన్నారు. దీంతో చంద్రబాబు ఆయనను త్వరలోనే గన్నవరం ఇంచార్జ్‌ను చేయనున్నారని తెలిసింది. అదే టైంలో బీసీల్లో యాదవ సామాజికవర్గానికి చెందిన అర్జునుడికి సీటు ఇస్తే నియోజకవర్గంలో ఎక్కువుగా ఉన్న యాదవుల ఓటింగ్ కూడా పార్టీకి ప్లస్ అవుతుందని అధిష్టానం అంచనా వేస్తోంది. ఇక రాజకీయంగా చూస్తే దూకుడు స్వభావం ఎక్కువగా ఉన్న బచ్చుల.. జిల్లాపై పట్టుంది. అదే సమయంలో మాటకు మాట కౌంటర్ ఇచ్చే నాయకుడిగా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, వంశీ హవాను తట్టుకుని, నియోజకవర్గంలో పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్తారు. సైకిల్‌ను ఎలా నడిపిస్తారు ? అనేది చూడాలి. ఏదేమైనా పార్టీలో కష్టించిన నాయకుడిగా ఆయన మంచి అవకాశం లభించిందని అంటున్నారు.