మళ్లీ మొదటికొచ్చిందే…? మిగిలిన ఆ కొద్ది మందీ కూడా?

కృష్ణా జిల్లా గుడివాడ‌లో టీడీపీ వ్యూహం ఎలా ఉంది ? ఇక్కడ పార్టీ నిల‌బ‌డుతుందా ? న‌డిపించే నాయ‌కుడు ఉన్నాడా ? చంద్రబాబు ఏమేర‌కు ఇక్కడ పార్టీని [more]

Update: 2020-04-15 14:30 GMT

కృష్ణా జిల్లా గుడివాడ‌లో టీడీపీ వ్యూహం ఎలా ఉంది ? ఇక్కడ పార్టీ నిల‌బ‌డుతుందా ? న‌డిపించే నాయ‌కుడు ఉన్నాడా ? చంద్రబాబు ఏమేర‌కు ఇక్కడ పార్టీని నిల‌బెట్టేందుకు ప్రయ‌త్నిస్తున్నారు ? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉద‌యిస్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే జిల్లాలోనే కీల‌క‌మైన స్థానం గుడివాడ‌. దివంగ‌త మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవ‌స్థాప‌కులు ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వ‌హించిన నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో టీడీపీకి, ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ముందు నుంచి ఎంతో అవినాభావ సంబంధం ఉండేది. అయితే ఇప్పుడు టీడీపీకి ఇక్కడ జెండా ప‌ట్టే నాథుడే కొర‌వ‌డ్డాడు. నిజానికి ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి, ఏపీ మంత్రిగా ఉన్న కొడాలి నాని ఎదిగింది. రాజ‌కీయాలు చేసింది కూడా టీడీపీ నుంచే కావ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో ఆయ‌న పార్టీలో కీలక నాయ‌కుడిగా త‌న‌కంటూ కంచుకోట‌ను ఏర్పాటు చేసుకున్నది కూడా టీడీపీ నుంచే కావ‌డం గ‌మ‌నార్హం.

ఎంతో మంది ఉన్నా…..

అలాంటి నియోజక వ‌ర్గంలో కొడాలి నాని పార్టీల‌తో సంబంధం లేని నాయ‌కుడిగా ఎదిగిపోయాడు. ఈ నేప‌థ్యంలో నానిని ఎదుర్కొనే స్థాయిలో నాయ‌కుడిని ఇక్కడ ఏర్పాటు చేయ‌డంలోను, వ్యూహాత్మకంగా పార్టీని న‌డిపించ‌డం లోనూ టీడీపీ అడుగ‌డుగునా విఫ‌ల‌మ‌వుతోంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలో అప్పటికే అక్కడ ఉన్న నాయ‌కులు త‌మ‌కు టికెట్ ల‌భించ‌డం ఖాయ‌మ‌ని అనుకున్నారు. త‌మ‌కు త‌ప్ప చంద్రబాబు మ‌రో ఆప్షన్ లేద‌ని అనుకున్నారు. దీంతో ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు చాలా యాక్టివ్‌గా రాజ‌కీయాలు చేశారు. పిన్నమ‌నేని వెంక‌టేశ్వర‌రావు, రావి వెంక‌టేశ్వర‌రావు, పిన్నమ‌నేని బాబ్జీ, య‌ల‌వ‌ర్తి వెంక‌టేశ్వర‌రావు చాలా మంది టీడీపీ సీటు కోసం ప్రయ‌త్నాలు చేశారు.

ఈ ఇద్దరినీ కాదని…..

వీరిలో పిన్నమ‌నేని, రావి ఇద్దరూ టీడీపీని ముందుకు న‌డిపించారు. అయితే, అనూహ్యంగా చంద్రబాబు ఇక్కడ విజ‌య‌వాడ నుంచి వ‌చ్చిన దేవినేని అవినాశ్‌ను నిల‌బెట్టారు. ఆయ‌న‌కు టికెట్ ఇచ్చారు. అంతేకాదు, అవినాష్ గెలుపున‌కు కృషి చేయాల‌ని ఆదేశించారు. దీంతో అప్పటి వ‌ర‌కు ఒక క‌ట్టుమీదున్న టీడీపీ నాయ‌కులు ఎవ‌రికివారుగా దూర‌మయ్యారు. అవినాష్‌కు స‌హ‌క‌రించ‌లేద‌నేది వాస్తవం. నిజానికి ఎవ‌రు మాత్రం స‌హ‌క‌రిస్తారు? ఈ విష‌యం చంద్రబాబుకు మాత్రం తెలియ‌దా? అప్పటి వ‌ర‌కు గుడివాడ స‌రిహ‌ద్దులు కూడా తెలియ‌ని అవినాష్‌ను అనూహ్యంగా అక్కడ దింప‌డ‌మే త‌ప్పు! ఇక అవినాష్ ఓట‌మి త‌ర్వాత వైసీపీలోకి జంప్ చేయ‌డంతో ఇప్పుడు మ‌ళ్లీ రావికి ప‌గ్గాలు ఇచ్చారు.

ఎవరినీ సంప్రదించకుండా….

అయితే, ఇది కూడా ఓ వ‌ర్గాన్ని ఇబ్బంది పెడుతోంది. పార్టీని బ‌లోపేతం చేయాల‌నుకున్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు త‌మ‌తో ఒక్కమాట కూడా చెప్పలేద‌ని మ‌రో వ‌ర్గం అల‌క‌బూనింది. రావి అంటే ప‌డ‌ని వ‌ర్గాలు మొత్తం ఇప్పుడు పార్టీకి దూరం కాగా… మంత్రిగా ఉన్న నాని దూకుడుతో మ‌రి కొంద‌రు నేత‌లు వైసీపీలోకి వెళ్లిపోయారు. దీంతో గుడివాడ టీడీపీలో మ‌ళ్లీ ముస‌లం అలానే ఉంది. స్థానిక ఎన్నిక‌ల్లో జోష్ చూపిస్తుంద‌ని భావించిన‌ప్పటికీ.. టీడీపీ చ‌తికిల ప‌డింది. ఇప్పటికైనా చంద్రబాబు ఇక్కడ బ‌ల‌మైన నేత‌కు ప‌గ్గాలు ఇస్తేనే పార్టీ నిల‌బ‌డే అవ‌కాశం ఉంది. లేక‌పోతే ఇక్కడ గెలుపు టీడీపీ ఇప్పట్లో మ‌ర్చిపోవాల్సిందే.

Tags:    

Similar News