టీడీపీలో ఆ ముగ్గురే యాక్టివ్… మిగిలిన వాళ్ల అడ్రస్?
రాష్ట్రంలో అతి పెద్ద జిల్లాగా ఉన్న గుంటూరు… ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి అత్యంత కీలకమైన జిల్లా. రాజధాని ఏర్పాటు, అంబేడ్కర్ పార్కు, ఇతర పథకాల అమలు వంటి [more]
రాష్ట్రంలో అతి పెద్ద జిల్లాగా ఉన్న గుంటూరు… ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి అత్యంత కీలకమైన జిల్లా. రాజధాని ఏర్పాటు, అంబేడ్కర్ పార్కు, ఇతర పథకాల అమలు వంటి [more]
రాష్ట్రంలో అతి పెద్ద జిల్లాగా ఉన్న గుంటూరు… ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి అత్యంత కీలకమైన జిల్లా. రాజధాని ఏర్పాటు, అంబేడ్కర్ పార్కు, ఇతర పథకాల అమలు వంటి అనేక కార్యక్రమాలకు ఈ జిల్లా వేదిక. అంతేకాదు.. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం కూడా మంగళగిరిలోనే ఉంది. అంటే.. ఒకరకంగా టీడీపీకి ఈ జిల్లా అత్యంత కీలకం. పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ జిల్లా కంచుకోటగా ఉంటోంది. ఎన్నోసార్లు ఈ జిల్లాలో సీట్లే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చాయి. కానీ గత ఏడాది ఎన్నికల్లో కేవలం రెండు నియోజకవర్గాల్లోనే పార్టీ గెలుపు గుర్రం ఎక్కింది. అదే సమయంలో ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. రేపల్లె, గుంటూరు వెస్ట్ నియోజకవర్గాల్లో పార్టీ విజయం సాధించింది. వీరిలో వెస్ట్ ఎమ్మెల్యే గిరి పార్టీకి దూరం అయ్యారు.
కీలక నేతలందరూ…..
కానీ, ఇప్పుడు ఎంత మంది యాక్టివ్‌గా ఉన్నారు ? ఎంతమంది పార్టీని ముందుకు నడిపిస్తున్నారు? అని ఆలోచిస్తే..కేవలం ముగ్గురు నాయకులు మాత్రమే పార్టీలో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. గతంలో మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు కానీ, పార్టీ టికెట్‌పై ఐదుసార్లు గెలుపు గుర్రం ఎక్కిన ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కానీ.. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పల్నాడులో దూకుడుగా వ్యవహరించిన యరపతినేని శ్రీనివాసరావు కానీ.. ఎవరూ ముందుకు రావడం లేదు. ఎవరూ నోరు విప్పడం లేదు. ఏదో ఒక కారణంగా వారు మౌనం పాటిస్తున్నారు. వ్యాపారాలు కావొచ్చు.. వ్యవహారాలు కావొచ్చు.. కేసుల భయం కావొచ్చు.. లోపాయికారీ.. ఒప్పందాలు కావొచ్చు.. ఇలా ఏదేమైనా.. మొత్తంగా టీడీపీ నేతలు పెద్దగా యాక్టివ్‌గా ఉండడం లేదు.
వీరు ముగ్గురే…..
అంతెందుకు.. టీడీపీ అధినేత కుమారుడు, మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన మాజీ మంత్రి నారా లోకేష్ కూడా ఇప్పుడు ఎక్కడా దర్శనం ఇవ్వడం లేదు. ఏదో రెండు పిట్ట కబుర్లు చెబుతూ.. హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారు. అయితే, ఇంత నిర్వేదంలోనూ పార్టీ కార్యక్రమాలు, అధినేత ఆదేశాలను భుజాన వేసుకున్న నాయకులు ముగ్గురు కనిపిస్తున్నారు. వారే బాపట్ల నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ, నరసారావుపేటలో చదలవాడ అరవిందబాబు, వినుకొండ సహా జిల్లాలో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పార్టీ కార్యక్రమాలను నడిపిస్తున్నారు.
ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ….
బాపట్లలో అన్నం సతీష్ ప్రభాకర్ ను చంద్రబాబు బాగా విశ్వసించారు. గత రెండు ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. రెండుసార్లు కూడా ఓడిన ఆయన బీజేపీలోకి జంప్ చేసేశారు. దీంతో ఎప్పటి నుంచో పార్టీలో అంటిపెట్టుకుని ఉండి.. ప్రజలకు సేవ చేస్తున్న టీడీపీ నాయకుడు వేగేశ్నకు అవకాశం ఇచ్చారు. ఆయన ఇప్పుడు ప్రజల్లో బాగా తిరుగుతున్నారు. ప్రతి వారంలో రెండు, మూడు కార్యక్రమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటూ నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. ఇక, జీవీ ఆంజనేయులు వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు నిత్యం చుక్కలు చూపిస్తున్నారు. అదేసమయంలో జిల్లా రాజకీయాలను కూడా మేనేజ్ చేస్తున్నారు.
నరసరావు పేటలో…..
బొల్లా చేపడుతోన్న కార్యక్రమాల్లో ఎప్పుడూ ఏదో ఒక లొసుగులను బయటకు తీస్తూ బొల్లాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా ఏదో ఒక ప్రెస్‌మీట్‌తో వైసీపీపై విరుచుకు పడుతోన్న ఆయన ఇప్పుడు నరసారావుపేట పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కావడంతో తన కార్యాలయాన్ని నరసారావుపేటకు మార్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక, పేటలో .. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. అరవిందబాబు పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నారు.
వారు తప్ప…..
రాజకీయాలకు కొత్తే అయినా అందరిని ఆయన కలుపుకుని వెళుతూ స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిని గట్టిగా ఢీకొంటున్నారు. రెండుసార్లు గెలిచిన గోపిరెడ్డికి అరవిందబాబు నుంచి ఊహించని పోటీ ఎదురవుతోంది. జిల్లాలో ఈ ముగ్గురు నేతలు తప్ప.. ఇంకెవరూ కూడా పార్టీ వాయస్ వినిపించకపోవడం గమనార్హం. చిత్రం ఏంటంటే.. మొన్నా మధ్య పార్టీ కార్యాలయంలో జెండా ఎగరేయాల్సి వస్తే.. కృష్ణాజిల్లా నుంచి నేతలను తీసుకువెళ్లడం..! ఇది గుంటూరు టీడీపీ పరిస్థితి..!