అదే డేట్ తో దడ లేపుతున్నారుగా?

తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఘోర పరాజయం ఎదురైంది గత ఎన్నికల్లో. ఆ ఫలితాలు వచ్చిన తేదీ మే 23. అదే విధంగా ఆ పార్టీకి [more]

Update: 2020-03-09 05:00 GMT

తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఘోర పరాజయం ఎదురైంది గత ఎన్నికల్లో. ఆ ఫలితాలు వచ్చిన తేదీ మే 23. అదే విధంగా ఆ పార్టీకి వచ్చిన స్థానాలు 23 మాత్రమే. గత టిడిపి ప్రభుత్వం వైసిపి నుంచి పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించింది 23 మందినే. ఇదంతా కాకతాళీయంగా జరిగినా తమ్ముళ్లకు 23 ఫీవర్ ఇంకా తగ్గలేదని సోషల్ మీడియా లో రోజు ప్రచారం నడుస్తూనే ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే ఈనెల నిర్వహిస్తున్న స్థానిక ఎన్నికల్లో మునిసిపాలిటిలకు పోలింగ్ తేదీ 23 కావడంతో ఇప్పుడు టిడిపి ని ఆ తేదీ సెంటిమెంట్ వెంటాడుతుంది.

ఈసారి ఎలా …?

మునిసిపాలిటీలు, కార్పొరేషన్ లలో గత చరిత్ర తీసుకుంటే తెలుగుదేశం పార్టీకే ప్రజలు పట్టం కడుతూ రావడం సంప్రదాయంగా వస్తుంది. అయితే ఈసారి మున్సిపోల్స్ లో ఆ రికార్డ్ కనుమరుగు అవుతుందన్న భయం పసుపు కోటలో మొదలైంది. మద్యం, డబ్బు పంచకుండా జగన్ సర్కార్ తీసుకుంటామంటున్న చర్యలకు ప్రధాన విపక్షం బెంబేలెత్తిపోతోంది. అక్రమాలు అడ్డుకోవడానికి జగన్ ప్రభుత్వానికి హక్కేముంది అంటూ సాక్షాత్తు టిడిపి అధినేత చంద్రబాబే హుంకరించారు. చర్యలు తీసుకుంటే ఎన్నికల కమిషన్ తీసుకోవాలి నోటిఫికేషన్ వచ్చాకా అధికారంలో ఉన్న వారు కూడా ఒక పార్టీనే అని మర్చిపోతే ఎలా అంటూ హెచ్చరికలు జారీ చేశారు.

ముందే డీలా పడ్డారా …?

వాస్తవానికి ఎన్నికల కమిషన్ మాత్రమే కాదు పారదర్శక పాలన కోరుకునే ప్రజాస్వామ్య వాదులు ఎవరైనా మద్యం, డబ్బు పంచకుండా ఎన్నికలు జరగాలని కోరుకునే వారు ఎవరైనా స్వాగతిస్తారు. దీనికి భిన్నంగా చస్ అవేమీ లేకుండా ఎన్నికలు ఏమిటన్న ధోరణిలో ప్రధాన విపక్ష అధినేత నుంచి పలువురు ఆ పార్టీ వారు పెదవి విరవడం చర్చనీయంగా మారింది. ఎన్నికలు జరగకుండానే చేతులు ఎత్తేస్తున్నారు చూడండి అంటూ అధికారపక్షం ఈ వ్యాఖ్యలపై ప్రచారం మొదలు పెట్టేసింది కూడా. దీన్ని తిప్పికొట్టే సరైన వ్యూహం టిడిపి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. తాము గెలిస్తే ప్రలోభాలు అంటూ కేసులు పెట్టి పదవులు పీకేయాలనే వ్యూహం అధికారపార్టీ అనుసరిస్తుందన్న అనుమానం విపక్షంలో వ్యక్తం అవుతుంది.

గట్టి దెబ్బె తగిలిందా …?

ఇటీవల తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో ఆర్ధిక అండదండలు అందిస్తున్న కొన్ని కార్పొరేట్ కంపెనీలు, విద్యా సంస్థలపై వరుసగా జరిగిన ఐటి దాడులు సాగాయి. అది కూడా టిడిపి ఆర్ధిక మూలలకు దెబ్బ కొట్టిందని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు పార్టీ సొమ్ము అయితే రిస్క్ చేస్తారు. సొంత డబ్బు ఖర్చు పెట్టి తీరా దొరికిపోతే పదవీ పోయి, సొమ్ము పోయి జైలు పాలు అయితే దిక్కెవరన్న సమస్యే వారిని వేధిస్తుంది. ఈ నేపథ్యంలో జేబులో సొమ్ము పెట్టి ఈ ఎన్నికల్లో జూదం ఆడేందుకు ప్రధాన విపక్షంలో నేతలు వెనుకాడుతున్నట్లు తెలిసింది. దాంతో స్థానిక ఎన్నికల్లో గెలుపు అంత ఈజీ కాదన్న అంతర్మధనం సైకిల్ పార్టీలో బెంగ ను పెంచుతుంది.

Tags:    

Similar News