పెంచుతుందా… దించుతుందా..?
ఎంత కాదనుకున్నా ఏపీలో ఇప్పటికిపుడు రాజకీయంగా వచ్చే పెద్ద మార్పులు ఏవీ ఉండవని అందరికీ తెలుసు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి గట్టిగా రెండేళ్లు కూడా కాలేదు. [more]
ఎంత కాదనుకున్నా ఏపీలో ఇప్పటికిపుడు రాజకీయంగా వచ్చే పెద్ద మార్పులు ఏవీ ఉండవని అందరికీ తెలుసు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి గట్టిగా రెండేళ్లు కూడా కాలేదు. [more]
ఎంత కాదనుకున్నా ఏపీలో ఇప్పటికిపుడు రాజకీయంగా వచ్చే పెద్ద మార్పులు ఏవీ ఉండవని అందరికీ తెలుసు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి గట్టిగా రెండేళ్లు కూడా కాలేదు. ఇక ఏపీలో సంక్షేమ రధం క్షేమంగా ముందుకు సాగుతోంది. తాయిలాలు, రాయితీలు అందుకుంటున్న వారు ఈ సర్కార్ వద్దు అని ఇపుడే అనేయడానికి సిధ్ధంగా ఉంటారంటే ఎవరూ నమ్మరు. ఇక మరో మూడేళ్ల పాటు వైసీపీయే అధికారంలో ఉంటుంది. దాంతో తెలివైన వారు ఎవరూ సర్కార్ కి భిన్నంగా వెళ్ళరు. ఇలాంటి ఆలోచనల వల్ల ఏపీలో విపక్ష బలం లోకల్ బాడీ ఎన్నికల్లో హఠాత్తుగా పెరిగిపోతుంది అని ఎవరైనా అనుకుంటే అది వట్టి భ్రమే అనక తప్పదు.
గ్రాఫ్ పెరిగేనా ?
ఇక ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పటికీ టీడీపీనే చెప్పుకోవాలి. మేము గట్టి ఆల్టర్నేషన్ అని ఎంతగా జబ్బలు చరచుకున్నా బీజేపీ జనసేనకు పెద్దగా అవకాశం అయితే లేదు. వైసీపీ వీక్ అయిన చోట కచ్చితంగా టీడీపీకే ఆ ఓటు పడుతుంది. తమ ఓటు మురిగిపోకూడదు అన్న సైకాలజీలో భారతీయ ఓటరు ఉండడమే ఇందుకు కారణం. దాంతో విన్నర్ రన్నర్ వైపే ఎపుడూ ఓటరు చూపు ఉంటుంది. మిగిలిన పార్టీలను పెద్దగా పట్టించుకోరు. ఇక టీడీపీ విషయానికి వస్తే గత ఎన్నికల వేళ 23 సీట్ల దగ్గర ఆగిపోయింది. దాంతో ఈ ఎన్నికల్లో కొంత అయినా బలం పెరిగినా తమకు ఉనికి ఉంటుంది అని ఆశపడుతోంది.
ఇబ్బందేనా…?
ఇక బీజేపీ జనసేన కూటమికి హఠాత్తుగా తోసుకువచ్చిన లోకల్ బాడీ ఎన్నికలు చాలా ఇబ్బందే అని చెప్పాలి. ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు వేరు. అక్కడ పార్టీ గుర్తులు ఉంటాయి. పైగా జనాలు క్యాండిడేట్లు, పార్టీలను చూసి ఓట్లు వేస్తారు. కానీ లోకల్ బాడీ ఎన్నికలు అంటే పూర్తిగా క్యాడర్ మీద బేస్ అయిన ఎన్నికలు. బూత్ లెవెల్ వరకూ ఏ పార్టీకి క్యాడర్ బాగా ఉంటుందో ఆ పార్టీ పెర్ఫార్మెన్స్ గట్టిగా ఉంటుంది. అలా చూసుకుంటే కనుక బీజేపీకి జనసేనకు కూడా క్షేత్ర స్థాయిలో పెద్దగా బలం లేదు. ఆది ఆ రెండు పార్టీలకు కూడా తెలుసు. మరి లోకల్ బాడీ ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు వస్తే కనుక అది తిరుపతి ఉప ఎన్నికల మీద కూడా చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అని అంటున్నారు.
పొంగు చల్లారుతుందా…?
ఏపీలో వైసీపీ టీడీపీ పని అయిపోయింది, 2024 ఎన్నికల్లో వచ్చేది మేమే అంటూ బీజేపీ జనసేన నేతలు ఇప్పటిదాకా జబ్బలు చరుస్తూ వస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల కంటే ముందు తిరుపతి బై పోల్ జరిగి కాస్తా ఊపు వస్తే ఆ ప్రభావం తో ఇతర పార్టీల నుంచి నాయకులు వారితో పాటు క్యాడర్ కూడా వచ్చి చేరే సీన్ ఉండేది. అపుడు లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే ఎంతో కొంత ఈ కూటమికి మేలు జరిగేది. కానీ ఇపుడు పూర్తిగా వారి ఆశలు రివర్స్ అవుతున్నాయని అంటున్నారు. లోకల్ బాడీ అర కొర సీట్లు తెచ్చుకుంటే కనుక ఈ కూటమికి అది భారీ షాక్ అనే చెప్పాలి. అపుడు తిరుపతి పాలపొంగు కూడా చప్పున చల్లారుతుంది. అంటే 2024 నాటికి కూడా ఏపీలో ఈ కూటమి బలమైన పునాదులు వేసుకోకపోతే మళ్ళీ ఆ రెండు పార్టీల మధ్యనే పోరు అని కచ్చితంగా చెప్పేయవచ్చు.