లోక‌ల్ ఎన్నిక‌ల‌కు ముందే అక్కడ సైకిల్‌కు బ్రేకులు

ఏపీలో టీడీపీ చాలా జిల్లాల్లో నిస్తేజంగా ఉన్నా స్థానిక ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌తో ఎక్కడిక‌క్కడ పార్టీ నేత‌ల్లో కొత్త జోష్ వ‌చ్చింది. ఇది అన్ని జిల్లాల్లోనూ ఉన్నా విజ‌య‌న‌గ‌రం [more]

Update: 2021-02-07 00:30 GMT

ఏపీలో టీడీపీ చాలా జిల్లాల్లో నిస్తేజంగా ఉన్నా స్థానిక ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌తో ఎక్కడిక‌క్కడ పార్టీ నేత‌ల్లో కొత్త జోష్ వ‌చ్చింది. ఇది అన్ని జిల్లాల్లోనూ ఉన్నా విజ‌య‌న‌గ‌రం టీడీపీలో ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారింది. ప్రస్తుతం పంచాయ‌తీ ఎన్నిక‌లు జరుగుతున్న నేప‌థ్యంలో జిల్లా టీడీపీ ప‌రిస్థితి ఏంటి ? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు కూడా ఇక్కడ టీడీపీ బ‌లంగా ఉంది. నాయ‌కులు ఎవ‌రికి వారు.. కాకుండా.. అంద‌రూ ఐక్యంగా దూసుకుపోయారు. ప్రతి విష‌యంలోనూ పార్టీకి అనుకూలంగా ప‌నిచేశారు. దీంతో 2014లో పార్టీ విజ‌యం సాధించ‌డంతో ప‌దేళ్ల త‌ర్వాత జిల్లాలో పార్టీకి కాస్త జ‌వ‌స‌త్వాలు వ‌చ్చాయి. స్థానిక ఎన్నిక‌ల్లోనూ చాలా ఏళ్ల త‌ర్వాత జ‌డ్పీచైర్మ‌న్ పీఠం సొంతం చేసుకుని పుంజుకుంది. ఇక‌, వైసీపీ నుంచి కూడా వ‌చ్చిన నాయ‌కులు పార్టీని మ‌రింత బ‌లోపేతం చేశారు.

సైడయిపోతుండటంతో….

క‌ట్ చేస్తే గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో జిల్లాలో అన్ని సీట్లు వైసీపీ స్వీప్ చేసి ప‌డేసింది. మ‌రి ఈ నేప‌థ్యంలో ఇప్పుడు పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధమైనందున టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉంది ? జిల్లా వ్యాప్తంగా పంచాయ‌తీల్లో సైకిల్ స్పీడ్‌ చూపిస్తుందా ? అంటే గ‌తానిక‌న్నా చాలా భిన్నమైన ప‌రిస్థితిని ఇప్పుడు టీడీపీ ఎదుర్కొంటోంది. కీల‌క‌మైన నాయ‌కులు పార్టీకి దూర‌మ‌య్యారు. ఇక‌, గ‌తంలో ప‌ద‌వులు అనుభ‌వించిన వారు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. మ‌రికొంద‌రు లోపాయికారీగా.. అధికార పార్టీకి చేర‌వ‌య్యారు. దీంతో పార్టీ త‌ర‌ఫున పెద్దగా రియాక్ట్ అవుతున్న వారు కూడా క‌నిపించ‌డం లేదు.

అశోక్ అంటేనే…?

ముఖ్యంగా పార్టీ సీనియ‌ర్ నాయకుడు, మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజుకు గ్రూపుల గోల ఎక్కువగా ఉంది. ఆయ‌న‌ను త‌మ‌ను తొక్కేశార‌ని.. మ‌హిళా నాయ‌కులతో పాటు ఓ సామాజిక వ‌ర్గం నేత‌లు గుర్రుగా ఉన్నారు. మ‌రికొంద‌రు పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు రెడీ అయ్యారు. పైగా ప్రభుత్వం అశోక్‌కు వ‌రుస షాకులు ఇస్తూ.. ఆయ‌న్ను మాన్సాస్ ట్రస్టుతో పాటు ప‌లు ఆల‌యాల చైర్మన్ హోదా నుంచి వ‌రుస‌గా తొల‌గిస్తూ వ‌స్తోంది. దీంతో ఆయ‌న రాజ‌కీయంగా సైలెంట్ అయిపోయారు. ప‌ద‌వులు రానీ మాజీ టీడీపీ ఎమ్మెల్యేల‌ది అదే ప‌రిస్థితి. ఫ‌లితంగా జిల్లాలో టీడీపీ ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా త‌యారైంది. ఇక‌, ఇప్పుడు గ్రామ‌పంచాయ‌తీ ఎన్నికల‌కు రంగం సిద్ధమైంది.

గత ఎన్నికల మాదిరిగా…..

జిల్లాలో మొత్తం 34 మండ‌లాలుఉన్నాయి. వీటిలో 920 గ్రామ ‌పంచాయ‌తీలు ఉన్నా యి. గ‌త 2013 స్థానిక స‌మ‌రంలో మెజారిటీ గ్రామాల్లో టీడీపీ అనుకూలురు గెలిచారు. ఇప్పుడు కూడా ఇదే రేంజ్‌లో దూకుడు ప్రద‌ర్శించాల‌ని.. వైసీపీకి చెక్ పెట్టాల‌ని అనుకున్నా.. ఈ రేంజ్‌లో అయితే.. టీడీపీ ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. చంద్రబాబు వ్యూహాత్మకంగా ఇక్కడి ప‌రిస్థితుల‌ను మారిస్తే.. త‌ప్ప.. ప్రస్తుతం ఉన్న వాతావ‌ర‌ణంలో విజ‌య‌న‌గ‌రంలో పార్టీ జెండా మోసేవారు కూడా క‌రువ‌య్యార‌నేది ప‌రిశీల‌కుల మాట‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి. ఏదేమైనా.. టీడీపీకి గ‌ట్టి ప‌ట్టున్న జిల్లాలో ఈ త‌ర‌హా ప‌రిస్థితి రావ‌డానికి కార‌ణాలు కూడా తెలుసుకోవాల‌నేది విశ్లేష‌కుల భావ‌న‌.

Tags:    

Similar News