వీర లెవెల్లో తమ్ముళ్ళ కుమ్ములాటలు ?

తెలుగుదేశం పార్టీ తమది ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పుకుంటుంది. పార్టీ గీత ఎవరూ దాటరని చంద్రబాబు ఎంతో మురిసిపోతూంటారు. అయితే అదంతా వట్టిదేనని ఇపుడు [more]

Update: 2020-12-07 06:30 GMT

తెలుగుదేశం పార్టీ తమది ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పుకుంటుంది. పార్టీ గీత ఎవరూ దాటరని చంద్రబాబు ఎంతో మురిసిపోతూంటారు. అయితే అదంతా వట్టిదేనని ఇపుడు ఎక్కడ చూసినా బాహాటంగా కుమ్ములాడుకున్న తమ్ముళ్ళ తీరు చూస్తే అర్ధమైపోతుంది. తెలుగుదేశం పార్టీకి అసలే ఉత్తరాంధ్ర జిల్లాలు ఈసారి దెబ్బ కొట్టాయి. 34 సీట్లున్న చోట ఆరంటే ఆరు తెచ్చుకుని టీడీపీ నిండా నీరు కారింది. అటువంటి పార్టీని పైకి లేపాలని చంద్రబాబు ఒకవైపు చూస్తూంటే పార్టీ పదవుల కోసం ఆధిపత్యం కోసం తమ్ముళ్ళు వీధిన పడుతున్నారు.

నెల్లిమర్లలో పిల్లి మొగ్గలు…

విజయనగరం జిల్లా నెల్లిమర్ల సీటు టీడీపీకి కంచుకోటగా ఉంది. నిజానికి 2009 వరకూ ఇది భోగాపురంలో ఉండేది. 1983 నుంచి నిన్నటి ఎన్నికల వరకూ పతివాడ నారాయణస్వామి ఇక్కడ నుంచి పలుమార్లు గెలిచారు. ఒక పర్యాయం చక్కెర శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఇక ఆయన 2019 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. బడుకొండ అప్పలనాయుడు వైసీపీ నుంచి జెండా ఎగరేశారు. ఇక ఆయన ఎనభై ఏళ్ల ప్రాయంలో ఉన్నారు. దాంతో రాజకీయాల నుంచి ఆయన తప్పుకుంటున్నారు. తనను ఇంచార్జిగా కొనసాగించవద్దని ఆయన పార్టీ పెద్దలకు చెప్పేశారు కూడా.

వారసుడికి బ్రేకులు…..

పతివాడ నారాయణస్వామి నిన్నటిదాకా పేరుకు ఎమ్మెల్యేగా ఉన్నా మొత్తం చక్రం తిప్పేది మాత్రం కొడుకు తమ్మునాయుడే. ఆయనే 2019 ఎన్నికల్లో కూడా టికెట్ కోసం పట్టుబట్టారు. అయితే టీడీపీలో మరికొందరు కూడా రేసులో ఉండడంతో పెద్దాయననే మళ్ళీ చంద్రబాబు బరిలొకి దింపారు. ఆయన ఎటూ ఓడారు, ఇక ఆయన వారసుడిగా తమ్మునాయుడు ముందుకు వచ్చారు. తననే ఇంచార్జి చేయమని గట్టిగా కోరుతున్నారు. తమ వైపు కొంతమంది నాయకులను తిప్పుకుంటూ తమ్మునాయుడు రాజకీయ క్రీడ మొదలుపెట్టేశారు. ఇక ఆయనకు పోటీగా మాజీ ఎంపీపీ బంగార్రాజుతో పాటు అనేక మంది ఇతర మాజీ ఎంపీలు కూడా రంగంలోకి దిగిపోయారు. ఎన్నాళ్ళైనా ఒకే కుటుంబానికేనా రాజకీయం అంటూ అపుడే గొడవ స్టార్ట్ చేశారు. ఏకంగా సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు తిట్టుకుంటూ పోస్టింగులే పెట్టేస్తున్నారు.

చిరిగి చేట అవుతోందిగా…?

నెల్లిమర్లలో బడుకొండ అప్పలనాయుడు యువకుడు. వైసీపీ ఎమ్మెల్యేగా దూసుకుపోతున్నారు. అటువంటి వేళ అంతా ఒక్కటిగా ఉండాల్సిన తమ్ముళ్ళు ఇలా ఇంచార్జి పదవి కోసం తగవులు ఆడుకోవడం పట్ల టీడీపీ కార్యకర్తలు విసిగిపోతున్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించాలన్న ఆలోచనతో పనిచేయకుండా 2024లో జరిగే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కుమ్ములాడుకోవడమేంటి అని కూడా క్యాడర్ మండిపడుతోంది. నిజానికి పతివాడ స్థాయి ఉన్న నేత ఇపుడు నెల్లిమర్లలో ఎవరూ లేరు. ఇపుడు పోటీ పడుతున్న వారిలో ఎవరిని ఇంచార్జిని చేసినా మిగిలిన వారు సెగలూ పొగలూ రేపుతారు. అందువల్ల ఏంచేయాలో తెలియక అధినాయకత్వం కూడా తల పట్టుకుంటోందిట. చూడాలి నెల్లిమర్లలో సైకిల్ రిపేర్లు ఎలా చేస్తారో.

Tags:    

Similar News