‘సైకిల్’‌ని నిలబెడుతున్న ‘ఫ్యాన్’ ఎమ్మెల్యేలు…?

నెల్లూరు జిల్లా మొదట నుంచి తెలుగుదేశం పార్టీకి పెద్ద అనుకూలంగా లేని జిల్లా. మొన్నటివరకు ఇక్కడ కాంగ్రెస్ హవా కొనసాగగా, తర్వాత వైసీపీ ఆధిక్యం నడుస్తోంది. గత [more]

Update: 2021-10-09 05:00 GMT

నెల్లూరు జిల్లా మొదట నుంచి తెలుగుదేశం పార్టీకి పెద్ద అనుకూలంగా లేని జిల్లా. మొన్నటివరకు ఇక్కడ కాంగ్రెస్ హవా కొనసాగగా, తర్వాత వైసీపీ ఆధిక్యం నడుస్తోంది. గత రెండు ఎన్నికల నుంచి జిల్లాలో వైసీపీ అదిరిపోయే విజయాలు సాధిస్తుంది. 2014 ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 10 సీట్లలో వైసీపీ 7 గెలుచుకుంటే, తెలుగుదేశం 3 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇక 2019 ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదు. జగన్ వేవ్‌లో మొత్తం 10 సీట్లు వైసీపీనే గెలుచుకుంది. ఇక వైసీపీ ఆవిర్భవించిన‌ప్పటి నుంచి జ‌రిగిన అన్ని ఎన్నిక‌ల్లోనూ నెల్లూరు ఎంపీ సీటు వైసీపీ ఖాతాలోనే ప‌డింది.

ఎమ్మెల్యేలపై…?

ఇలా వైసీపీకి అండగా నిలబడిన నెల్లూరులో ఇప్పుడుప్పుడే మార్పులు వస్తున్నట్లు కనిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటిన నేపథ్యంలో జిల్లాలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత మొదలైందని తెలుస్తోంది. పైగా వైసీపీ ప్రభుత్వం…ఏదో సంక్షేమ పథకాలు ఇవ్వడమే తప్ప, అభివృద్ధిని గాలికొదిలేసి, ప్రజల నెత్తి మీద పన్నులు భారం వేయడం జగన్‌కు బాగా మైనస్ అవుతోంది. దీనిని తెలుగుదేశం క్యాష్ చేసుకోవాల్సి ఉంది.

తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో….?

పైగా జిల్లాలో ఉన్న పలువురు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తున్నాయి. మైనింగ్, ఇసుక, ఇళ్ల స్థలాలు, కాంట్రాక్ట్‌ల్లో అక్రమాలు చేయడంలో వైసీపీ ఎమ్మెల్యేలు ముందున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వ‌స్తున్నాయి. అలాగే కొందరు ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండటం లేద‌ని.. వీరి ముఖం చూడ‌డ‌మే కష్టం అని తెలుస్తోంది. ఇలా వైసీపీ ఎమ్మెల్యేలపై నెగిటివ్ రావడమే తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుంది.

టీడీపీ నేతలు యాక్టివ్ అయితే?

అయితే ఇక్కడ తెలుగుదేశం నేతలు కూడా ఇంకా పుంజుకోవాల్సిన అవసరముంది. కాకపోతే వైసీపీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉండటం వల్ల ప్రజలు, తెలుగుదేశం వైపు చూస్తున్నారు. టీడీపీ నేత‌ల్లో ఒక‌రిద్దరు మిన‌హా ఎవ్వరూ కూడా ప్రజ‌ల్లోకి వెళ్లడం లేదు. వచ్చే ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగితే, తెలుగుదేశం నేతల కంటే వైసీపీ ఎమ్మెల్యేలే నెల్లూరులో సైకిల్‌ని నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News