ఆయన సైకిల్ దిగేస్తాడట.. మరి బాబు ఏం చేస్తారో?

అస‌లే ఇబ్బందుల్లో ఉన్న టీడీపీకి ప్రస్తుత ప‌రిణామాలు మ‌రిన్ని ఇక్కట్లు తెచ్చేలా ఉన్నాయా ? నాయ‌కులు ఏదో ఒక కార‌ణంతో పార్టీకి దూరంగా ఉన్నారా ? ఎక్కడిక‌క్కడ [more]

Update: 2020-09-22 12:30 GMT

అస‌లే ఇబ్బందుల్లో ఉన్న టీడీపీకి ప్రస్తుత ప‌రిణామాలు మ‌రిన్ని ఇక్కట్లు తెచ్చేలా ఉన్నాయా ? నాయ‌కులు ఏదో ఒక కార‌ణంతో పార్టీకి దూరంగా ఉన్నారా ? ఎక్కడిక‌క్కడ ఎప్పటిక‌ప్పుడు నాయ‌కులు దూర‌మ‌వుతున్నారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు పార్టీ నాయ‌కులు. తాజాగా ఇలాంటి త‌మ్ముడి స్టోరీనే తెర‌మీదికి వ‌చ్చింది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నిడ‌ద‌వోలు నియోజ‌క‌వ‌ర్గంలో ప్రస్తుతం టీడీపీని ప‌ట్టించుకునే నాయ‌కుడు క‌నిపించడం ‌లేదు. పార్టీ కార్యక్రమాలూ ఇక్కడ జ‌ర‌గ‌డం లేదు. దీనికి కార‌ణం ఏంటి? గ‌తంలో ఇక్కడ నుంచి చ‌క్రం తిప్పిన నాయ‌కులు ఇప్పుడు ఏమ‌య్యారు? అనే ప్రశ్నలు సాధార‌ణంగానే తెర‌మీదికి వ‌స్తాయి.

రెండు సార్లు గెలిచి…..

వీటికి స‌మాధానం ఇదే.. నిడ‌ద‌వోలు నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌ఫున బూరుగుప‌ల్లి శేషారావు చ‌క్రం తిప్పారు. 2009, 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న విజ‌యం సాధించి.. పార్టీని బ‌లోపేతం చేశారు. అయితే, ఆయ‌న‌కు సొంత అన్న బూరుగుప‌ల్లి వేణుగోపాల‌కృష్ణ అన్ని విధాలా స‌హ‌క‌రించారు. ప్రముఖ విద్యా వేత్తగా ఉన్న గోపాల కృష్ణ.. త‌మ్ముడికి నిధులు ఇవ్వడం ద‌గ్గర‌నుంచి త‌మ్ముడు రెండు సార్లు గెల‌వ‌డంలో కీల‌కంగా వ్యవ‌హ‌రించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాక శేషారావుకు ఆయ‌న సోద‌రుడితోనే విబేధాలు వ‌చ్చాయ‌న్న టాక్ ఉంది. ఈ క్రమంలోనే గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలో శేషారావుతోపాటు ఆయ‌న అన్న వేణుగోపాల కృష్ణ వీరితోపాటు కుందుల‌ స‌త్యనారాయ‌ణ అనే మ‌రో నేత కూడా టికెట్ కోసం పోటీ ప‌డ్డారు. దీంతో తీవ్ర గంద‌ర‌గోళం ఏర్పడింది.

పార్టీకి దూరంగా…..

ఈ గంద‌ర‌గోళం మ‌ధ్యలో చివ‌రి నిముషంలో టీడీపీ టికెట్ శేషారావునే వ‌రించింది. అయితే, ఆయ‌న ఎన్నిక‌ల్లో దాదాపు 21 వేల ఓట్ల తేడాతో ఓట‌మిపాల‌య్యారు. ఈ ఓట‌మికి త‌న‌కు చివ‌రి నిముషంలో టికెట్ ఖ‌రారు చేయ‌డ‌మే కార‌ణ‌మ‌ని శేషారావు భావిస్తున్నారు. అదే స‌మ‌యంలో సొంత అన్నకూడా పోటీకి రావ‌డంపై ఆయ‌న ఇప్పటికీ ఆవేద‌న‌ను విడిచి పెట్టలేక పోతున్నార‌ట‌. నిజానికి ఆయ‌నపై అనేక ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయినా కూడా బాబు ఆయ‌న‌కే టికెట్ ఇచ్చారు. అయిన‌ప్పటికీ.. ఓట‌మి తాలూకు నెపాన్ని అందరిపైనా వేస్తున్న శేషారావు.. పార్టీకి దూరంగా ఉంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గానికి కూడా దూరంగా ఉంటున్నారు.

క్యాడర్ ను పట్టించుకోక పోవడంతో…..

చంద్రబాబు వ‌ల్లే తాను ఓడిపోయాన‌ని ప్రచారం చేసుకుంటున్నట్టు స్థానిక నేత‌లు చెబుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని ప‌ట్టించుకోవ‌డం లేదు స‌రిక‌దా..? ఎవ‌రైనా కార్యక‌ర్తలు ఫోన్ చేస్తే మ‌నం ప్రతిప‌క్షంలో ఉన్నాం క‌దా ? నాకు ఫోన్ చేసినా ఉప‌యోగం ఏం ఉంటుంది ? ఏం ప‌నులు అవుతాయ‌న్న ధోర‌ణితో మాట్లాడుతున్నార‌ని కార్యక‌ర్తలే వాపోతున్న ప‌రిస్థితి. క‌నీసం కార్యక‌ర్తల‌కు భ‌రోసా కూడా ఆయ‌న ఇవ్వడం లేద‌ని టీడీపీ వాళ్లే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

టిక్కెట్ పై భరోసా ఇస్తేనే…..

ఇక‌, ఇప్పుడు తాను పార్టీ కోసం క‌ష్టించినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ త‌న‌కు టికెట్ ఇస్తార‌నే గ్యారెంటీ ఏంట‌ని ప్రశ్నిస్తున్నార‌ని స‌మాచారం. ఈ విష‌యంలో త‌న‌కు బాబు ఇప్పుడు హామీ ఇస్తేనే.. తాను నియోజ‌క‌వ‌ర్గంలో కృషి చేస్తాన‌ని చెబుతున్నారట‌. పైగా అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఏం ప‌నిచేస్తాం.. అంటూ.. శేషారావు నిరాశ‌గా మాట్లాడుతున్నార‌ని కూడా ప్రచారం జ‌రుగుతోంది. మొత్తానికి ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో నిడ‌ద‌వోలులో టీడీపీని ప‌ట్టించుకునే నాధుడు క‌నిపించ‌డం లేదు.

Tags:    

Similar News