పెత్తనం కోసమే పెటాకులు చేశారుగా… ఇప్పుడు ఆదుకునేదెవరు?

శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ప‌రిస్థితి ఏంటి? అక్కడ ఏం జ‌రుగుతోంది? పార్టీని ఎవ‌రు ముందుండి న‌డిపిస్తారు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. గ‌తంలో ఇక్కడి [more]

Update: 2020-04-21 03:30 GMT

శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ప‌రిస్థితి ఏంటి? అక్కడ ఏం జ‌రుగుతోంది? పార్టీని ఎవ‌రు ముందుండి న‌డిపిస్తారు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. గ‌తంలో ఇక్కడి నుంచి కావ‌లి ప్రతిభాభార‌తి ప్రాతినిధ్యం వ‌హించారు. ఇక్కడ టీడీపీలో నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధం లేని నాయ‌కుల పెత్తనం కూడా ఒక‌ప్పుడు జోరుగా సాగింది. ముఖ్యంగా ప్రతిభా భార‌తితో విభేదాలు ఉన్న క‌ళా వెంక‌ట్రావు (ఆయ‌న సొంత నియోజ‌క‌వర్గం రాజాం) ఇక్కడ ఆమె హ‌వాను త‌గ్గించేందుకు అనేక ప్రయ‌త్నాలు చేశారు. ఈ క్రమంలోనే నియోజ‌క‌వ‌ర్గంలో ఆమె హ‌వా దాదాపు త‌గ్గిపోయింది. ఉమ్మడి ఏపీ స్పీక‌ర్‌గా వ్యవ‌హ‌రించిన ప్రతిభా భార‌తి.. ప్రజ‌ల‌కు, టీడీపీ క్యాడర్ కు దూర‌మ‌య్యార‌నే వాద‌న కూడా ఉంది.

కొండ్రును పార్టీలో చేర్చుకున్నా….

2004, 2009, 2014 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా ఆమె మూడు సార్లు ఓడిపోయారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత‌ చంద్రబాబు గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలో కొండ్రు మ‌ుర‌ళీ మోహ‌న్‌ను పార్టీలోకి తీసుకున్నారు. అయితే, కొండ్రు కూడా గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీని త‌ట్టుకుని విజ‌యం సాధించ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌నే వాద‌న ఉంది. పైగా పార్టీ నేత‌ల‌తోనూ ఆయ‌న పుంజుకోలేక పోయారు. పార్టీ నేత‌ల‌తో క‌లిసి కార్యక్ర‌మాలు నిర్వహించ‌డంలోను, ప్రజ‌ల్లోకి పార్టీని తీసుకు వెళ్లడంలోనూ ఆయ‌న విఫ‌ల‌మ‌య్యారు. దీనికితోడు అంత‌ర్గత క‌ల‌హాల‌తోపార్టీ ఇప్పటికే ఇబ్బంది ప‌డుతోంది.

ప్రతిభా భారతి ఉన్నా…?

ఇదే స‌మ‌యంలో వైసీపీ నుంచి విజ‌యం సాధించిన కంభాల జోగులు పార్టీని, ప్రభుత్వ కార్యక్రమాల‌ను ప్రజ‌ల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్తున్నారు. దీంతో రాజాంలో ఇప్పుడు టీడీపీ జెండా ప‌ట్టుకునేవారు క‌రువ‌య్యార‌ని అంటున్నారు. ప్రతిభా భార‌తి ఉన్నప్పటికీ..ఆమె అనారో గ్యంతో ఇబ్బంది ప‌డుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె తన కుమార్తె గ్రీష్మకు గ‌తేడాది ఎన్నిక‌ల్లోనే టికెట్ ఇప్పించుకునే ప్రయ‌త్నం చేసినా.. టీడీపీలో వ‌ర్గ పోరు కార‌ణం గా ఆమెకు టికెట్ ల‌భించ‌లేదు. పోనీ.. పార్టీని ముందుకు న‌డిపించే ప్రయ‌త్నం చేస్తున్నారా ? అంటే..ఆమె అది కూడా చేయ‌డం లేదు.

కార్యాలయానికి తాళం….

ఇటీవ‌ల టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పుర‌స్కరించుకుని కూడా ఆమె బ‌య‌ట‌కు రాలేదు. కష్టకాలంలో ఉన్నప్పుడు చంద్రబాబు త‌న‌ను ప‌ట్టించుకోలేద‌న్న ఆవేద‌న ఆమెలో ఉంది. ఇక ఇప్పుడు పార్టీకి భ‌విష్యత్ లేక‌పోవడంతో కోండ్రు సైతం త‌న దారి తాను చూసుకోనున్నార‌ని అంటున్నారు. దీంతో రాజాంలో టీడీపీ కార్యాల యానికి వేసిన తాళం వేసిన‌ట్టే ఉండ‌డంపై చంద్రబాబుకు కూడా నివేదిక‌లు అందాయి. కొండ్రు ముర‌ళి ప్రస్తుతం ఇంచార్జ్‌గా ఉన్నా ఆయ‌న వైసీపీ వైపు చూస్తున్నార‌ని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఎవ‌రినైనా కొత్తవారికి అవ‌కాశం ఇవ్వాలా ? లేక ప్రతిభా భారతి కుమార్తెకు అవ‌కాశం ఇవ్వాలా ? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికైతే టీడీపీని న‌డిపించే వారు మాత్రం క‌నిపించ‌డం లేద‌నేది వాస్తవం.

Tags:    

Similar News