సీమలో టీడీపీకి సీన్ ఉందా…?

స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి అంటూ టీడీపీ పెద్దలు బాగా గర్జిస్తున్నారు. ఇప్పుడే ఎన్నికలు పెట్టాలి లేకపోతే అసలు కుదరదు అని వాదిస్తున్నారు. స్థానిక సంస్థలు, వాటి [more]

Update: 2020-11-15 13:30 GMT

స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి అంటూ టీడీపీ పెద్దలు బాగా గర్జిస్తున్నారు. ఇప్పుడే ఎన్నికలు పెట్టాలి లేకపోతే అసలు కుదరదు అని వాదిస్తున్నారు. స్థానిక సంస్థలు, వాటి అధికారాలు, విధులూ విధానాల గురించి పెద్ద లెక్చర్లే ఇస్తున్నారు. ఇంతకీ 2018 ఆగస్ట్ లో పదవీకాలం పూర్తి అయితే తన హయాంలో వాటిని పూర్తి చేయని టీడీపీ పెద్దలు ఇపుడు మాత్రం శివాలెత్తుతున్నారు. మరి నాడు అదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీగా ఉన్నారు. చేతిలో అధికారం ఉంది. నాడు ఎన్నికలను జరిపించడానికి ఎందుకు భయం బెదురు పుట్టాయో తెలియదు కానీ పుణ్యకాలమంతా గడిపేశారు. స్థానిక నిధులకు పాతర కూడా వేశారు. ఇక మార్చిలో ఎన్నికలు ఏదో విధంగా జరుగుతాయనుకుంటే వాయిదా పడ్డాయి. కరోనా ఉంటే ఎన్నికలు ఎందుకు అని గద్దించింది ఇదే టీడీపీ పెద్దలు.

సీటు కదులుతుందా…?

ఇపుడు స్థానిక ఎన్నికలు పెడితే టీడీపీ ఏపీలో గెలుస్తుందా. దానికి సంబంధించి సంకేతాలు ఏమైనా ఉన్నాయా అంటే అది ఎవరికీ తెలియడంలేదు కనీసం ఆ దిశగా సూచనలు కూడా లేవు. చంద్రబాబు ఏమైనా జనాల్లోకి వస్తే ఆయనకు ఉన్న ఆదరణ చూసుకుని టీడీపీకి గాలి ఉందని ఎవరైనా అంచనా వేసుకుంటారు. కానీ కరోనా తరువాత ఆయన హైదరాబాద్ కి పరిమితం అయ్యారు. ఇపుడు ఎన్నికలు పెట్టమంటున్నారు. విపక్ష పాత్ర ఏ మాత్రం పోషించారని ఎన్నికలు అంటున్నారో తెలియదు కానీ ఎన్నికలు పెడితే వైసీపీ ఓడుతుందని, జగన్ సీటు కదులుతుందని జోస్యాలు అయితే తమ్ముళ్ళు చాలా బాగా చెబుతున్నారు.

సీమలో తీసికట్టు……

ఇక రాయలసీమలో వైసీపీదే మొదటి నుంచి ఆధిపత్యం. ఇక్కడ చూస్తే నాలుగు జిల్లాలు కలుపుకుని 52 అసెంబ్లీ సీట్లు ఉంటే మూడంటే మూడు టీడీపీ గెలుచుకుంది. అందరూ మాజీలు అయ్యారు. పైగా ఎవరికి వారు తీరిక లేని విధంగా సొంత వ్యాపారాల్లో ఉన్నారు. రాజకీయంగా పెద్ద కుటుంబాలు, రాజకీయ నేతలు కూడా ఎందుకొచ్చిన తంటా అనుకుని కిమ్మనకుండా ఉన్నారు. సీమకు చెందిన చంద్రబాబు అయితే ఈ వైపే చూడడం లేదు. బాబు ఆశలు, ఆకాంక్షలు అన్నీ కూడా కోస్తా మీదనే పెట్టుకుని రాజకీయం చేస్తారని అందరికీ తెలుసు. దాంతో ఏడాదిన్నర కాలంగా టీడీపీ దిగనారిపోయిన పరిస్థితి సీమలో ఉంది.

కాడెత్తేదెవరు….?

రాయలసీమలో చూసుకుంటే నాయకులు చాలా మంది ఉన్నారు. వారంతా బయటకు మాత్రం రారు. ఎవరికి వారు లోపాయికారి వ్యవహారాలను అధికార పార్టీతో చేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు. ఇక అధినేత చంద్రబాబే ఈ వైపు తొంగి చూడకపోతే వారికి ఏం పట్టింది అన్నట్లుగానే ఉన్నారు. దాంతో టీడీపీ ఎగిరిపడి మరీ ఎన్నికలు తీసుకువచ్చినా కూడా సీమలో పాత ఫలితాలే పునరావృత్తం అయితే అపుడు ఏ విధంగా తలెత్తుకుంటారు అన్నది తమ్ముళ్ల ప్రశ్న. సీమకు అయిదేళ్ళ పాటు న్యాయం చేయని టీడీపీకి మూడు రాజధానులను కూడా అడ్డుకుంటోందన్న బాధ జనాల్లో ఉంది. ఈ టైం లో ఎన్నికలకు వెళ్తే సీమలో సీన్ సితారే అని అంటున్నారు.

Tags:    

Similar News