కలవకుంటే ఎవరికి నష్టం..?

దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్నారు వారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇద్దరూ కలవని పరిస్థితి. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో దారుణ ఓటమిని చవిచూసిన నేతల్లో [more]

Update: 2019-10-30 08:00 GMT

దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్నారు వారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇద్దరూ కలవని పరిస్థితి. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో దారుణ ఓటమిని చవిచూసిన నేతల్లో జ్ఞానోదయం అయినట్లుంది. అందుకే ఇక ముందు గ్రూపులు, వర్గాలు జాన్తా నై అంటూ చేతులు కలిపి ముందుకు నడుస్తున్నారు. అయితే ఇది ఎంతకాలం? అన్నదే ప్రశ్నం. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీలో మొన్నటి వరకూ రెండు గ్రూపులున్నాయి. అది బహిరంగ రహస్యమే. అధికారంలో ఉన్నప్పుడు కూడా వీరు ఎడమొహం, పెడమొహంలా ఉండేవారు.

ఇద్దరు మంత్రులుగా….

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు మంత్రులుండేవారు. ఒకరు కింజారపు అచ్చెన్నాయుడు, మరొకరు కళా వెంకట్రావు. కింజారపు ఎర్రన్నాయుడు బతికున్నంత కాలం శ్రీకాకుళం జిల్లా టీడీపీని ఆయనే శాసించేవారు. ఆయన మాటకు తిరుగులేదు. తెలుగుదేశం పార్టీలోనే నెంబరు 2గా ఎర్రన్నాయుడు ఒకప్పుడు వెలుగొందారు. ఎర్రన్నాయుడు మృతితో ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు పార్టీకి, క్యాడర్ కు పెద్దదిక్కయ్యారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అంతా తానే అయి నడిపించారు.

పార్టీని గ్రిప్ లోకి తెచ్చుకునేందుకు….

మరోవైపు కిమిడి కళా వెంకట్రావు. ఎర్రన్నాయుడు మరణం తర్వాత టీడీపీని గ్రిప్ లో పెట్టుకోవాలని భావించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కావడం, లోకేష్ కు దగ్గర అవ్వడంతో ఆయన వెంటనే మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మొన్నటి వరకూ ఈ ఇద్దరూ మంత్రులుగా ఉన్నా ఒకరంటే ఒకరికి పడేది కాదు. ఒకరి వైపు మరొకరు చూసుకునే వారు కాదు. జిల్లా స్థాయి సమావేశాల్లోనూ పలకరింపులు ఉండేవి కావు. టీడీపీ కార్యక్రమాలు కూడా కలసి చేసింది లేదనే చెప్పాలి. ఒకరిపై మరొకరు అధిష్టానానికి ఫిర్యాదు చేసుకునే వారు. అయితే మొన్నటి ఎన్నికలు వీరి పరిస్థితిలో మార్పు తెచ్చాయి.

దారుణ ఓటమితో….

ఇటీవల జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళంలో కేవలం రెండంటే రెండు సీట్లు టీడీపీకి దక్కాయి. అందులో అచ్చెన్నాయుడు ఒకరు. ఇచ్ఛాపురం, టెక్కలి మాత్రమే టీడీపీ ఖాతాలో పడ్డాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కళావెంకట్రావు ఓటమి పాలయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు టెక్కెలి డివజన్ వైపు కళా వెంకట్రావు, పాలకొండ డివిజన్ వైపు అచ్చెన్నాయుడు చూసే వారే కాదు. అయితే ఇప్పుడు దారుణ ఓటమితో ఆ అహం తగ్గించుకుని ఇద్దరూ కలసి పోయారంటున్నారు. ఇటీవల చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన తర్వాత వీరిలో ఐక్యత కన్పిస్తుందని పసుపు పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు శత్రువులుగా మెలిగిన ఈ నేతలిద్దరూ అది పోయాక మాత్రం ఒక్కటవ్వడం నిజంగా పార్టీకి లాభమేనని చెప్పక తప్పదు.

Tags:    

Similar News