ఈ తమ్ముడు ఒట్టు పెట్టాడు..నమ్మొచ్చా…?

తెలుగుదేశం పార్టీ ఇపుడు తన నీడను కూడా చూసి జడుసుకునే పరిస్థితి ఏర్పడింది. పార్టీ పుట్టెడు కష్టాల్లో ఉంది. నాయకులు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఎమ్మెల్యేలు అయితే పూటకో [more]

Update: 2020-10-20 09:30 GMT

తెలుగుదేశం పార్టీ ఇపుడు తన నీడను కూడా చూసి జడుసుకునే పరిస్థితి ఏర్పడింది. పార్టీ పుట్టెడు కష్టాల్లో ఉంది. నాయకులు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఎమ్మెల్యేలు అయితే పూటకో పేరు మీడియాలో వస్తోంది. దాంతో ఎవరిని నమ్మాలో తెలియక చంద్రబాబు లాంటి రాజకీయ దురంధరుడు తికమకపడుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఉత్తరాంధ్రాలో అచ్చంగా అరుగురు ఎమ్మెల్యేలు టీడీపీ తరఫున గెలిచారు. వీరిలో మెజారిటీ సైకిల్ దిగిపోతుందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి విదితమే. చంద్రబాబు ప్రతీ రోజూ వారితో ఫోన్లో టచ్ లో ఉన్నా కూడా హ్యాండ్ ఇచ్చేది ఎవరో ఆయన కూడా కనిపెట్టలేకపోతున్నారుట.

ఎంతగానో నానినా…?

ఇక శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే ఇద్దరంటే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారిలో ఒకరు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అయితే మరొకరు ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్. ఆయన వరసగా రెండవసారి ఇదే సీటు నుంచి గెలిచారు. ఆయన తండ్రి కాలం నుంచి టీడీపీలోనే ఉన్నారు. ఈ మధ్యనే తండ్రి ప్రకాష్ కాలధర్మం చెందారు. పరామర్శల పేరిట ఆయన దగ్గరకు ఎక్కువగా వచ్చింది వైసీపీ నేతలే. దాంతో ఆయన టీడీపీని వీడిపోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగింది. దానికి తోడు ఆయన ఒక్కసారిగా టీడీపీలో యాక్టివిటీస్ తగ్గించేశారు. ఈ పరిణామాలన్నీ చూసిన వారు అచ్చెన్న ఒక్కరే టీడీపీకి మిగిలేది అని కూడా అనేసుకున్నారు.

మౌనంగానే చూస్తూ ….

మరి ఇది ఒకరోజులో జరిగిన ప్రచారం కాదు కానీ దాన్ని ఇంతకాలం ఎమ్మెల్యే అశోక్ కనీసం ఖండించలేదు. కానీ సడెన్ గా ఆయన ఇపుడు మీడియా ముందుకు వచ్చి మరీ తాను టీడీపీలోనే పుట్టాను, ఇక్కడే ఎదిగాను, ఊపిరి ఉన్నంతవరకూ సైకిల్ పార్టీని వీడేది లేదు అంటూ పెద్ద ఒట్టే వేశారు. తనకు రాజకీయ జన్మను ఇచ్చి తన కుటుంబాన్ని మొత్తం కలుపుకున్న సైకిల్ పార్టీని ఎలా వదిలేసుకుంటాను అంటూ చాలా పెద్ద మాటలే చెప్పారు. అంతే కాదు, టీడీపీకి తిరుగులేదని కూడా గట్టిగా గర్జించారు. తాను ఇంతకాలం పార్టీ పరంగా చురుకుగా పాలుపంచుకోనందుకు బాధపడుతున్నానని కూడా వాపోయారు. మొత్తానికి అశోక్ తాను గోడ దూకను అంటూ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసి అధినేత బాబుకు ఆనందం కలిగించారు.

ఇంత చేసినా …

ఎమ్మెల్యే తమ్ముడు ఇలా బయటకు వచ్చి తాను టీడీపీని వీడను అని చెప్పాక కూడా నమ్మకపోతే అది టీడీపీ బేలతనమే అవుతుంది అంటున్నారు. నిజానికి వైసీపీ అతన్ని తమ వైపు తిప్పుకోవడానికి విశ్వప్రయత్నం చేసిందని అంటారు. అదే సమయంలో ఆయన వైపు నుంచి కూడా సంకేతాలు వచ్చాయని కూడా చెబుతారు. అయితే అచ్చెన్నాయుడుకి రాష్ట్ర పదవి ఇస్తారని ప్రచారం సాగడంతో ఆయన సొంత జిల్లా నుంచి అతి పెద్ద ఝలక్ ఇస్తే తట్టుకోవడం కష్టమేనని భావించే పెద్దలు రంగంలోకి దిగి సర్దుబాటు చేశారు అన్న మాట వినిపిస్తోంది. అయితే ఒట్లు ఎన్ని వేసినా రాగం ఎంత పెద్దది తీసినా చివరికి గెలిచేది రాజకీయం. రాజకీయాల్లో ఎపుడైనా ఏమైనా జరగవచ్చు. అలాగని నమ్మకూడదా అంటే ఉన్నంతవరకూ మన పార్టీ వాడే అనుకుని నమ్మాల్సిందేనని తమ్ముళ్ళే అంటున్నారు.

Tags:    

Similar News