దారికి రావడం కష్టమేనా?

గోవిందుడి సన్నిధిలో ఉన్న తిరుపతి నియోజకవర్గంలో పసుపు పార్టీ నేతల గ్రూపుల గోల మామూాలుగా లేదు. పార్టీ అధినేత ఆదేశాలను సయితం టీడీపీ నేతలు బేఖాతరు చేస్తున్నారు. [more]

Update: 2020-02-05 03:30 GMT

గోవిందుడి సన్నిధిలో ఉన్న తిరుపతి నియోజకవర్గంలో పసుపు పార్టీ నేతల గ్రూపుల గోల మామూాలుగా లేదు. పార్టీ అధినేత ఆదేశాలను సయితం టీడీపీ నేతలు బేఖాతరు చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను పట్టించుకోకపోగా, క్యాడర్ ను సయితం వదిలేసినట్లే కనపడుతోంది. తిరుపతి నియోజకవర్గంలో తొలి నుంచి టీడీపీకి పట్టుంది. ఇందుకు ఉదాహరణ గత ఎన్నికల ఫలితాలే అని చెప్పుకోవచ్చు.

తిరుపతిలోనే స్వల్ప ఓట్లతో…..

గత ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కుప్పం నియోజకవర్గం మినహా అన్ని స్థానాల్లో పార్టీ ఓటమి పాలయింది. ఇందుకు జగన్ హవా కారణమయినప్పటికీ 12 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు టీడీపీపై దాదాపు 25 వేల ఓట్ల పైచిలుకు ఆధిక్యత సాధించారు. కుప్పంలోనూ చంద్రబాబు గెలిచినా మెజారిటీ తగ్గింది. కానీ ఒక్క తిరుపతి నియోజకవర్గంలోనే కేవలం 800 ఓట్ల తేడాతో టీడీపీ ఓటమి పాలయింది.

వ్యతిరేకత ఉన్నప్పటికీ….

టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా సుగుణమ్మ పై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ టీడీపీ కేవలం 800 ఓట్ల తేడాతోనే ఓటమి చవి చూడటం ఆ పార్టీ పట్టు ఎంత ఉందో చెప్పకనే చెప్పొచ్చు. సుగుణమ్మనే తిరుపతి టీడీపీ ఇన్ ఛార్జిగా అధిష్టానం కొనసాగిస్తుంది. అయితే ఓటమి పాలయిన తర్వాత తిరుపతి నియోజకవర్గంలో గ్రూపులగోల మొదలయింది. మాజీ తుడా ఛైర్మన్ నరసింహయాదవ్ గత ఎన్నికల్లో టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో సుగుణమ్మతో కలసి పనిచేయడానికి ఆయన ఇష్టపడటంలేదు. మొక్కుబడిగానే కార్యక్రమాల్లో పాల్గొంటున్నా క్యాడర్ కు అందుబాటులో ఉండటం లేదు.

బాబు పర్యటనలో…..

ఇటీవల చంద్రబాబు అమరావతి రాజధాని కోసం చేస్తున్న ఆందోళనల్లో భాగంగా తిరుపతి వచ్చినప్పుడు టీడీపీ నేతలందరూ చేతులెత్తేశారు. బాబు పర్యటనకు కనీసం జన సమీకరణ కూడా చేయలేదు. దీంతో బాబు షో ప్లాప్ అయిందన్న టాక్ వచ్చింది. ఇందుకు పోలీసు ఆంక్షలు కారణమని బయటకు చెబుతున్నప్పటికీ టీడీపీ నేతల మధ్య ఉన్న విభేదాలే కారణమని పార్టీ అధిష్టానం గుర్తించింది. తిరుపతి నియోజకవర్గంలో సుగుణమ్మకు సహకరించాల్సిందేనని అధిష్టానం చెబుతోంది. మరి తిరుపతి టీడీపీ నేతలు దారికొస్తారో? లేదో? చూడాల్సి ఉంది.

Tags:    

Similar News