తిరుప‌తి రెఫ‌రెండం కాదా.. అచ్చెన్న టోన్ మారిందే?

“ఏపీలో ఒక్క ఛాన్స్ అంటూ.. జోలె ప‌ట్టుకుని అడుక్కుంటే .. ప్రజ‌లు అవ‌కాశం ఇచ్చారు. ఇప్పుడు ఈ అరాచ‌క జ‌గ‌న్ ప్రభుత్వంపై విసిగెత్తిపోయారు. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌స్తాయా? [more]

Update: 2021-04-08 11:00 GMT

“ఏపీలో ఒక్క ఛాన్స్ అంటూ.. జోలె ప‌ట్టుకుని అడుక్కుంటే .. ప్రజ‌లు అవ‌కాశం ఇచ్చారు. ఇప్పుడు ఈ అరాచ‌క జ‌గ‌న్ ప్రభుత్వంపై విసిగెత్తిపోయారు. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌స్తాయా? ఎప్పుడు త‌రిమికొడ‌దామా? బుద్ధి చెబుదామా? అని ప్రజ‌లు ఎదురు చూస్తున్నారు.“- ఇదీ స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌కు ముందు.. ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ నేత‌లు చేసిన ప్రక‌ట‌న‌లు. అయితే… పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో అంటే.. పార్టీ గుర్తులపై ఎన్నిక‌లు జ‌ర‌గ‌వు క‌నుక‌.. ఎవ‌రు ఎన్ని సాధించార‌నే విష‌యంలో సందిగ్ధం ఉంది. పంచాయ‌తీ ఎన్నికల్లో తాము 50 శాతం స‌ర్పంచ్ స్థానాలు గెలిచామ‌ని టీడీపీ చెపితే.. వైసీపీ 90 శాతంకు పైగా స‌ర్పంచ్‌లు గెలిచామ‌ని చెప్పుకుంది.

మూడు రాజధానులకు వ్యతిరేకంగా…..

కానీ, ఇటీవ‌ల ముగిసిన స్థానిక‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో మాత్రం ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్ సైతం ప్రచారం చేశారు. ఈ సంద‌ర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. “మూడు రాజ‌ధానుల‌కు వ్యతిరేకంగా జ‌గ‌న్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. మీ ఓటుతో దిమ్మతిరిగే స‌మాధానం చెప్పాలి. ఈ ఎన్నిక‌ల‌తో జ‌గ‌న్‌కు బుద్ధి రావాలి. ఈ ఎన్నిక‌లు పార్టీ గుర్తుల‌పై జ‌రుగుతున్నాయి క‌నుక‌.. వైసీపీకి గ‌ట్టిగా ప్రజ‌లు బుద్ధి చెప్పాలి. ఈ ఎన్నిక‌లు మూడు రాజ‌ధానుల‌కు వ్యతిరేకంగా అమ‌రావ‌తికి అనుకూలంగా రెఫ‌రెండ‌మే!“ అని చెప్పుకొచ్చారు.

కానీ తిరుపతిలో మాత్రం…..

‌క‌ట్ చేస్తే.. ప్రజ‌లు ఎలాంటి తీర్పు చెప్పారో.. టీడీపీకి అర్ధమైంది. స్వయంగా బాబు రంగంలోకి దిగి ప్రచారం చేసిన‌.. మూడు కార్పొరేష‌న్లు.. విశాఖ‌, విజ‌య‌వాడ‌, గుంటూరుల్లోనే పార్టీ చ‌తికిల ప‌డింది. ఇక‌, ఇప్పుడు వ‌చ్చే 17వ తారీకున తిరుప‌తి పార్లమెంటు ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. మ‌రి దీనిని కూడా ప్రభుత్వానికి రెఫ‌రెండ‌మే అనాలి క‌దా! అలానే ప్రజ‌ల్లోకి వెళ్లాలి క‌దా?! కానీ, టీడీపీ టోన్ మారింది.

భిన్నమైన కామెంట్లతో…..

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు.. భిన్నమైన కామెంట్లు చేశారు. “ఈ ఎన్నిక ప్రభుత్వానికి రిఫ‌రెండం కాద‌ని చెప్పారు. అంతేకాదు.. ప్రభుత్వంలో ఎవ‌రు ఉంటే వారికి అనుకూలంగా రావ‌డం ఉప ఎన్నిక‌లో స‌ర్వసాధార‌ణం“ అన్నారు. తిరుపతిలో తమ ట్రాక్ రికార్డు కూడా బాగా లేదని చెప్పారు. మ‌రి దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి ? తిరుప‌తి ఉప ఎన్నిక ఫ‌లితం విష‌యంలో టీడీపీకి వాళ్లకు ముందే క్లారిటీ వ‌చ్చేసిన‌ట్టుందే ? అన్న‌ది ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Tags:    

Similar News