టీడీపీలో ఈ బ్యాలన్స్ తప్పిందా ?

ఉత్తరాంధ్ర టీడీపీలో ఇపుడు సామాజిక సమీకరణలు మారుతున్నాయి. అవి బాలన్స్ కూడా తప్పాయని కొందరు సీనియర్లు రగులుతున్నారు. పార్టీలో ఒక సామాజికవర్గం పెత్తనం పెరిగింది అని గుర్రుమంటున్నారు. [more]

Update: 2020-11-14 15:30 GMT

ఉత్తరాంధ్ర టీడీపీలో ఇపుడు సామాజిక సమీకరణలు మారుతున్నాయి. అవి బాలన్స్ కూడా తప్పాయని కొందరు సీనియర్లు రగులుతున్నారు. పార్టీలో ఒక సామాజికవర్గం పెత్తనం పెరిగింది అని గుర్రుమంటున్నారు. చంద్రబాబు మొదటి నుంచి వెలమలకు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పెత్తనం ఇస్తూ వస్తున్నారు. అయితే కొంతలో కొంత తూర్పు కాపులకు కూడా అవకాశాలు ఇస్తూ ఎక్కడికక్కడ సమన్వయం చేసుకుంటూ ఇప్పటిదాకా వచ్చారు. అది మంత్రి వర్గం కూర్పు అయినా పార్టీ పదవులు అయినా కూడా చంద్రబాబు చాలా జాగ్రత్తగా ఈ రెండు బలమైన సామాజికవర్గాలను కలుపుతూ రేర్ ఫీట్ చేస్తూ వచ్చారు. కానీ ఎన్నికల్లో ఓడిన తరువాత మాత్రం బాబు తన ఆలోచనలు మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది.

వారే ముందుకు…

ఉత్తరాంధ్ర మూడు జిల్లాలో ఇపుడు వెలమలకే టీడీపీలో రాజ్యంగా కనిపిస్తోంది. అచ్చెన్నాయుడు ఏకంగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అయ్యారు. దాంతో పాటు ఆయన అసెంబ్లీలో పార్టీ తరఫున ఉప నాయకుడు. ఇక చంద్రబాబుకు కుడి భుజంలాంటి నేత. రాష్ట్రంలో ఏది జరిగినా అచ్చెన్న నాయకత్వంలోనే విచారణ కమిటీని బాబు వేస్తున్నారు. అలా ఆయన అగ్రభాగంలో ఉన్నారు. ఇక విశాఖలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా సీనియర్ నేతగా పొలిట్ బ్యూరోలో ఉన్నారు. మరో నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి కూడా బాబు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇక అదే సమాజికవర్గానికి చెందిన సబ్బం హరిని కూడా బాబు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహ‌ననాయుడుని జాతీయ ప్రధాన‌ కార్యదర్శిగా, అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా చంద్రబాబు తీసుకుని వారికే పెద్ద పీట వేశారు.

నలుగుతున్న కాపులు….

ఈ పరిణామాలతో టీడీపీలో తూర్పు కాపులు రగులుతున్నారని టాక్. ప్రత్యేకించి తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన కళా వెంకటరావు ఏ తప్పూ చేయకపోయినా ఆయన్ని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించడాన్ని కూడా తప్పుపడుతున్నారు. అంతే కాదు, విశాఖ జిల్లాకు చెందిన కాపు నేత గంటా శ్రీనివాసరావుకి ఏ పదవీ ఇవ్వకపోవడాన్ని కూడా ఎత్తిచూపుతున్నారు. విజయనగరం జిల్లాలో బలమైన కాపు నేతలుగా ఉన్న కొండపల్లి అప్పలనాయుడుని పక్కన పెట్టారని కూడా అంటున్నారు. ఇక అదే జిల్లాలొ మహిళా నాయకురాలిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు విజయనగరం ఇంచార్జి పదవి అయినా ఇవ్వలేదని ఆక్షేపిస్తున్నారు. కాపు నాయకులు ఈ మధ్య చాలా మంది వైసీపీలోకి వెల్లిపోవడానికి కూడా చంద్రబాబు విధానాలే కారణం అని కూడా అంటున్నారు.

సత్తా చూపుతారా..?

ఉత్తరాంధ్రా సహా రాష్ట్రంలో 36 లక్షల మంది దాకా తూర్పు కాపులు ఉన్నారని వారు లెక్కలు చెబుతున్నారు. ఇందులో తొంబై శాతం మంది ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఉన్నారని కూడా వివరిస్తున్నారు. తన బలాన్ని ఎవరు తక్కువ అంచనా వేసినా ఇబ్బందేనని అంటున్నారు. మరి చంద్రబాబు ఒకే సామాజిక వర్గాన్ని దగ్గర తీయడం ద్వారా తమను చిన్న చూపు చూస్తున్నారు అన్న బాధ వారిలో మరింత ఎక్కువైతే మూడు జిల్లాల్లో ఫలితాలు తేడా కొడతాయి అని అంటున్నారు. అదే సమయంలో వైసీపీ కాపులకు మూడు జిల్లాల్లో రెండు మంత్రి పదవులు ఇచ్చింది. అలాగే వెలమలకు , ఇతర సామాజికవర్గాలకు మంత్రి పదవులతో పాటు, సామాజిక‌ న్యాయం చేస్తోంది.దాన్ని టీడీపీ గమనించాలని తూర్పు కాపు సామాజికవర్గం నేతలు కోరుతున్నారు.

Tags:    

Similar News