విశాఖ చీలిక తెస్తుందా?

విశాఖను పరిపాలనాపరమైన రాజధానిగా జీఎస్ రావు కమిటీ ప్రతిపాదించింది. దీని మీద ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజానీకం ఓ వైపు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా కూడా [more]

Update: 2019-12-23 08:00 GMT

విశాఖను పరిపాలనాపరమైన రాజధానిగా జీఎస్ రావు కమిటీ ప్రతిపాదించింది. దీని మీద ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజానీకం ఓ వైపు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా కూడా పలువులు సానుకూలంగా స్పందిస్తున్నారు. అయితే మాజీ మంత్రులు, సీనియర్ టీడీపీ నేతలైన చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి మాత్రం దీన్ని గట్టిగానే వ్యతిరేకిస్తున్నారు. అమరావతి ఉండగా వేరే ఎందుకు దండుగ అన్నట్లుగా వారి వైఖరి ఉంది. మూడు రాజధానుల ప్రతిపాదన పిచ్చి తుగ్లక్ చర్య అని మాజీ మంత్రి బండారు అంటున్నారు. ఇది జగన్ అనుభవ రాహిత్యానికి నిదర్శనమని ఆయన హాట్ కామెంట్స్ చేస్తున్నారు. బంగారు బాతు గుడ్డు లాంటి అమ‌రావతిని చంద్రబాబు చేతికి ఇస్తే బాగు చేయలేక జగన్ ఇలాంటి విచిత్ర విన్యాసాలు చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు.

రాష్ట్రమే ముక్కలట…..

ఇక మరో సీనియర్, ఫైర్ బ్రాండ్ అయ్యన్నపాత్రుడైతే ఏపీనే జగన్ ముక్కలు చేస్తున్నాడని ఘాటైన విమర్శలు చేశారు. మూడు రాజధానులు ఏంటి అంటూ ఆయన వెటకారం ఆడారు. ఏపీని అభివృద్ధిని చేయడం జగన్ కి చేతకాదు అనేశారు. రాజధానులు ఇన్ని ఎక్కడైనా ఉంటాయా అంటూ ఆయన దీర్ఘాలు తీశారు. చంద్రబాబు మీద రాజకీయ కక్షతోనే ఇలా వైసీపీ సర్కార్ చేస్తోందని కూడా అయ్యన్న అంటున్నారు. జగన్ వి విద్వంసక రాజకీయ‌ విధానాలుగా అభివర్ణిస్తున్నారు.

ఇష్టం లేదా…?

నిజానికి నవ్యాంధ్ర ఏర్పాటు అయ్యాక మేధావుల నుంచి అంతా విశాఖ రాజధాని అవుతుందని నాడు భావించారు. అప్పట్లో బాబు క్యాబినేట్లో సీనియర్ మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు విశాఖ విషయంలో పోరాడలేదని, ఇపుడు జగన్ సర్కార్ రాజధానిగా ప్రకటించినా వ్యతిరేకిస్తున్నారని విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అభివ్రుధ్ధి అంతా అమరావతిలో పెట్టి విశాఖను పక్కన నెట్టినా తమ్ముళ్ళు టీడీపీ అధినేతకు భజన చేయడమేంటని కూడా కామెంట్స్ వస్తున్నాయి. సొంత ప్రాంతం కంటే రాజకీయమే ముఖ్యమా అని కూడా నిలదీస్తున్నారు.

సైలెంటేనా..?

ఇక విశాఖ రాజధాని విషయంలో మిగిలిన టీడీపీ నేతలు ఇప్పటికైతే సైలెంట్ గా ఉన్నారు. విశాఖలో నలుగురు ఎమ్మెల్యేలు ఉంటే ఒక్క గంటా శ్రీనివాసరావు మాత్రమే సానుకూలంగా స్పందించారు. మిగిలిన వారు మౌనంగా ఉంటున్నారు. విజయనగరానికి చెందిన మాజీ మంత్రి సుజయ క్రిష్ణ రంగారావు సైతం దీని మీద కామెంట్స్ చేయడంలేదు. మరి వీరంతా జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అన్నది అంతుబట్టక తమ్ముళ్ళు అయోమయంలో పడుతున్నారు. మొత్తానికి విశాఖ రాజధాని ప్రతిపాదన కాదు కానీ ఉత్తరాంధ్ర టీడీపీలో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News