లీడర్ల మనసు మారిందటగా

కాలం గడిచే కొద్దీ తెలుగుదేశం పార్టీ నేతల్లో మార్పు కన్పిస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే టీడీపీ నేతలు చాలా మంది అధికార వైసీపీ లేదా కేంద్రంలో [more]

Update: 2019-12-20 02:00 GMT

కాలం గడిచే కొద్దీ తెలుగుదేశం పార్టీ నేతల్లో మార్పు కన్పిస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే టీడీపీ నేతలు చాలా మంది అధికార వైసీపీ లేదా కేంద్రంలో పవర్ లో ఉన్న బీజేపీలో చేరిపోయేందుకు రెడీ అయ్యారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరి చేరికలు ఆగిపోయాయి. అయితే ఆరు నెలలు గడవడంతో ఇప్పుడు టీడీపీలో ఉండటమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చినట్లుంది. విజయనగరం జిల్లాలో చాలా మంది నేతలు ఇప్పుడు టీడీపీలోనే కొనసాగేందుకు మానసికంగా సిద్ధమయ్యారుట. ఈ ఆరునెలల కాలంలో వీరిలో ఎందుకింత మార్పు అన్నది చర్చనీయాంశమైంది.

పార్టీని వీడాలని….

ఎన్నికలు ఫలితాలు వచ్చి టీడీపీకి 23 సీట్లు మాత్రమే రావడం, నారా లోకేష్ వంటి నేతలు కూడా ఓటమి పాలు కావడంతో టీడీపీ నేతల్లో నైరాశ్యం అలుముకుంది. ఇక టీడీపీకి భవిష్యత్తు లేదని భావించారు. విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. తొమ్మిది స్థానాల్లోనూ తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయింది. దీంతో అధికార పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అక్కడ స్పేస్ లేకపోవడం, ఎలాంటి హామీలు లభించకపోవడంతో విజయనగరం టీడీపీ నేతలు బీజేపీ వైపు కూడా చూశారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం అనేక ప్రయత్నాలు చేశారు.

బీజేపీలోకి వెళ్లాలనుకున్నా….

విజయనగరం జిల్లాకు చెందిన సుజయ కృష్ణరంగారావు, ఆయన సోదరుడు బేబినాయన, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ లు బీజేపీ వైపు చూశారు. అయితే టీడీపీలోనే తమకు భవిష్యత్తు ఉంటుందని వీరు భావిస్తున్నారు. బీజేపీలోకి వెళ్లినా ఇప్పటికిప్పుడు రాజకీయంగా తమకు ఒరిగేదేమీ ఉండదని వారు సర్ది చెప్పుకున్నారు. తమ మనసులో ఉన్న సంశయానికి తెరదించేశారు. ద్వారపు రెడ్డి జగదీష్ వంటి నేతలయితే తమకు రాజకీయ భవిష్యత్ నిచ్చింది టీడీపీయే కాబట్టి దాన్ని వదిలి వెళ్లమని బహిరంగంగా చెబుతున్నారు.

గంటా వెంట వెళ్లాలనుకుంటే….?

ఇక కాపు సామాజిక వర్గం నేతలు కూడా సైలెంట్ అయ్యారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గంటా శ్రీనివాసరావు విజయనగరం జిల్లాకు ఇన్ ఛార్జి మంత్రిగా ఉండేవారు. ఆ సమయంలో కాపు సామాజికవర్గం ఎమ్మెల్యేలు మీసాల గీత, డాక్టర్ కే.ఏ నాయుడులు వంటి వారు గంటాకు దగ్గరయ్యారు. గంటా శ్రీనివాసరావుతో పాటు తాము కూడా బీజేపీలోకి వెళ్లేందుకు వీరు సిద్ధమయ్యారు. అయితే గంటా శ్రీనివాస్ సైలెంట్్ కావడంతో ఈ నేతలు కూడా వెనక్కు తగ్గారు. గంటా వెంట బీజేపీలో చేరేందుకు టీడీపీ కాపు సామాజికవర్గం నేతలు సిద్ధమయినా ఆ తర్వాత ఆలోచనను విరమించుకున్నట్లు తెలిసింది. అయతే పార్టీ మారే ఆలోచన వీరి నుంచి తొలిగిపోయినా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ కావడం లేదు. మొత్తం మీద ఆరు నెలల అనంతరం టీడీపీకి కొంత మంచిరోజులు వచ్చినిట్లే కన్పిస్తున్నాయి. నేతలు మనసు మార్చుకుంటున్నట్లే కనపడుతోంది.

Tags:    

Similar News