ఓడినా.. ఈ రచ్చ ఏల సామీ?

ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కీల‌క‌మైన జిల్లా విజ‌య‌న‌గ‌రం. ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీకి ఈ జిల్లా ఒక‌ప్పుడు కంచుకోట‌. ఇక్కడ నుంచి కీల‌క‌మైన నాయ‌కులు పార్టీ త‌ర‌ఫున విజ‌యం సాధించి [more]

Update: 2019-12-27 13:30 GMT

ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కీల‌క‌మైన జిల్లా విజ‌య‌న‌గ‌రం. ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీకి ఈ జిల్లా ఒక‌ప్పుడు కంచుకోట‌. ఇక్కడ నుంచి కీల‌క‌మైన నాయ‌కులు పార్టీ త‌ర‌ఫున విజ‌యం సాధించి కేంద్రంలోనూ చ‌క్రం తిప్పారు. అశోక్‌గ‌జ‌ప‌తిరాజు వంటి ముఖ్యమైన నాయకుల క‌నుస‌న్నల్లో ఈ జిల్లాలో టీడీపీ బ‌లోపేత‌మైంది. అయితే, ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో రాజు స‌హా అంద‌రూ చ‌తికిలపడ్డారు. జ‌గ‌న్ సునామీలో ఈ జిల్లాలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. జిల్లాలో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. అయితే, ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీని నిల‌బెట్టేందుకు, బ‌లమైన కేడ‌ర్‌ను న‌డిపించేందుకు చంద్రబాబు ఇప్పటి వ‌ర‌కు ఎలాంటి ప్రయ‌త్నాలూ చేయ‌లేదు.

ఎన్నికలు ముంచుకొస్తున్నా…

దీనికి ప్రధాన కార‌ణం.. ఇక్కడ నుంచి పార్టీలో ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అశోక్ అనారోగ్యం కార‌ణంగా ఢిల్లీలోనే ఉండి పోయారు. ఇటీవ‌లే ఆయ‌న జిల్లాకు వ‌చ్చారు. అయితే, ఇప్పటికిప్పుడు పార్టీలో ఆయ‌న యాక్టివ్‌గా ఉండే ప‌రిస్థితి లేదు. ఈ నేప‌థ్యంలో ఇక్కడ పార్టీని న‌డిపించేందుకు పుంజుకునేలా చేసేందుకు బ‌ల‌మైన నాయ‌కుడు అవ‌సరం ఎంతైనా ఉంది. మ‌రో నెల రోజుల్లో స్థానిక సంస్థల‌కు నోటిఫికేష‌న్ ఇచ్చేందుకు ప్రభుత్వం స‌న్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో ఘోరంగా ప‌రాజ‌యం చ‌విచూసిన టీడీపీకి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నిక‌లు బూస్ట్ ఇవ్వాలి. లేక‌పోతే.. పార్టీ ఉనికికే ప్రమాదం పొంచి ఉంది.

పోటీ ఉన్నప్పటికీ….

ఈ క్రమంలో స‌రైన నాయ‌క‌త్వం ముందుండి పార్టీని న‌డిపించాల్సిన అవ‌స‌రం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న అశోక్ మీద ఇక పార్టీ అధినేత ఆశ‌లు వ‌దులు కోవాల్సిందే. ఈ క్రమంలోనే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నిక‌ల నాటికి అయినా పార్టీకి జ‌వ‌స‌త్వాలు రావాలంటే కొత్తవారికి అధ్యక్ష ప‌గ్గాలు ఇవ్వాల‌ని స్థానిక టీడీపీ నాయ‌క‌త్వం కోరుతోంది. ఈ క్రమంలో విజ‌య‌న‌గ‌రం టీడీపీ అధ్యక్ష పీఠానికి నేనంటే నేనేన‌ని న‌లుగురు నాయ‌కులు పోటీ ప‌డుతున్నట్టు స‌మాచారం. ఇక్కడ బ‌ల‌మైన వైసీపీ నాయ‌కులు ఉన్న నేప‌థ్యంలో వారికి చెక్ పెట్ట‌డంతోపాటు, పార్టీని దూకుడుగా ముందుకు తీసుకు వెళ్లగ‌లిగే నాయ‌కుల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని కూడా వారు కోరుతున్నారు.

దూకుడుగా వెళతారని…

ప్రధానంగా వైసీపీ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ వంటి నాయ‌కుడిని ఎదుర్కొనేందుకు కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నామని, తమలో ఎవరికి ఆ పదవి కట్టబెట్టినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నట్టు సమాచారం. దీంతో ఆ పదవిని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కెఎ నాయుడుకు కట్టబెడతారని జోరుగా టీడీపీలో ప్రచారం జరుగుతోంది. కేఏ. నాయుడు పార్టీలో దూకుడుగా ముందుకు వెళ‌తార‌న్న పేరు ఉంది.

అశోక్ ప్రమేయం లేకుండా….?

అన్ని జిల్లాల్లో వైసీపీకి స‌రైన కౌంట‌ర్లు ఇవ్వాలంటే యువ‌నేత‌ల‌ను ఎంక‌రేజ్ చేయాల‌ను కుంటు న్నారు. అటు శ్రీకాకుళంలోనూ అముదాలవ‌ల‌స మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ కూన ర‌వికుమార్‌కు జిల్లా పార్టీ ప‌గ్గాలు ఇవ్వాల‌నుకుంటున్నారు. ఇటు విశాఖ‌లో బాల‌య్య చిన్నల్లుడు శ్రీభ‌ర‌త్ ఆర్థికంగా బ‌లంగా ఉండ‌డంతో ఆయ‌న‌కు ఏదో ఒక కీల‌క ప‌ద‌వి ఇవ్వాల‌నుకుంటున్నారు. ఇక విజ‌య‌న‌గ‌రంలో ఎవ‌రిని జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా చేయాల‌న్నా అశోక్‌ గజపతిరాజును సంప్రదించ‌కుండా చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఇదిలావుంటే, త్వర‌లోనే ఆయ‌న విజ‌య‌న‌గ‌రంలో ప‌ర్యటించ‌నున్నారు. ఈ ప‌ర్యట‌న‌లో జిల్లా అధ్యక్షుడిని నిర్ణయిస్తార‌ని భావిస్తున్నారు. మ‌రి బాబు ఎవ‌రికి వీర‌తాడు వేస్తారో చూడాలి.

Tags:    

Similar News