ఈ బెజ‌వాడ బాస్ సొంత కుంపటి పెట్టుకున్నారా?

అస‌లే అంతంత మాత్రంగా ఉన్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో చిత్రమైన విష‌యాలు తెర‌మీదికి వస్తున్నాయి. చాలా జిల్లాల్లో ప‌రిస్థితి దారుణంగా ఉంద‌నే విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. ఇక‌, [more]

Update: 2020-08-25 15:30 GMT

అస‌లే అంతంత మాత్రంగా ఉన్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో చిత్రమైన విష‌యాలు తెర‌మీదికి వస్తున్నాయి. చాలా జిల్లాల్లో ప‌రిస్థితి దారుణంగా ఉంద‌నే విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. ఇక‌, అంతో ఇంతో కొంత బ‌లంగా ఉన్న బెజ‌వాడ‌లోనూ పార్టీలో బీట‌లు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు విజ‌య‌వాడ‌లో టీడీపీ ఆడింది ఆట‌.. పాడింది పాట అయ్యింది. పార్టీ నేత‌లు ఇష్టారాజ్యంగా వ్యవ‌హ‌రించారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ సునామీ భారీ ఎత్తున వీచింది. అయినా విజ‌య‌వాడ ఎంపీ సీటుతో పాటు తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ జెండాయే ఎగిరింది.

మూడు వర్గాలు…

తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ద్దె రామ్మోహ‌న్ వ‌రుస‌గా విజ‌యం సాధించ‌గా, విజ‌య‌వాడ ఎంపీగా కేశినేని నాని కూడా వ‌రుస విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గంలో కేవ‌లం పాతిక ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి బొండా ఉమా ఓడిపోయారు. అయితే, ఇప్పుడు టీడీపీలో మూడు కూట‌మ‌ులు ఏర్పడ్డాయ‌నేది తాజాగా పార్టీ క‌ల‌వ‌ర‌పెడుతున్న ప్రధాన విష‌యం. వాస్తవానికి నిన్న మొన్నటి వ‌ర‌కు కూడా రెండు కూట‌ములు ఉండేవి. ఒక‌టి ఎమ్మెల్సీ, విజ‌య‌వాడ న‌గ‌ర పార్టీ అధ్యక్షుడు బుద్దా వెంక‌న్న వ‌ర్గంగాను, రెండోది కేశినేని నానీ వ‌ర్గంగాను ఉండేది. అయితే, ఇప్పుడు బొండా ఉమా సొంత కుంప‌టి పెట్టుకున్నార‌నే వార్తలు వ‌స్తున్నాయి.

నాని ప్రకటనతో…

నిన్న మొన్నటి వ‌ర‌కు కూడా ఆయ‌న కేశినేని నాని వ‌ర్గంలో కీల‌క‌మైన నాయ‌కుడిగా ఉన్నారు. అయితే, మేయ‌ర్ పీఠం విష‌యానికి వ‌చ్చే స‌రికి త‌న స‌తీమ‌ణిని నిల‌బెట్టాల‌ని బొండా ఉమా గ‌ట్టిగా ప్రయ‌త్నించారు. కానీ, కేశినేని మాత్రం త‌న కుమార్తె శ్వేత‌ను రంగంలోకి దింపారు. దీనిపై ఇరు ప‌క్షాల మ‌ధ్య రాయ‌బారాలుకూడా న‌డిచాయి. అయిన‌ప్పటికీ.. నాని మాత్రం వెన‌క్కి త‌గ్గలేదు. పైగా త‌న కుమార్తే టీడీపీ మేయ‌ర్ అభ్యర్థి అని నాని మిగిలిన నేత‌ల‌తో సంప్ర‌దించ‌కుండా చేసిన ప్రక‌ట‌న సైతం మిగిలిన టీడీపీ నేత‌ల్లో తీవ్ర అసంతృప్తికి కార‌ణ‌మైంది.

మున్ముందు ప్రమాదమే….

చివ‌ర‌కు బొండా ఉమా..చంద్రబాబు సూచ‌న‌ల‌తో వెన‌క్కి త‌గ్గారు. కానీ, ఆయ‌న నాని వ‌ర్గం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. త‌న‌తో క‌లిసి వ‌చ్చేవారిని వెతుక్కుంటున్నారు. ఈ వ‌ర్గంలోకి ఎమ్మెల్యే గ‌ద్దె చేరుతున్నార‌ని ఆయ‌న నిత్యం బొండా ఉమాతో ట‌చ్‌లో ఉన్నార‌ని తెలుస్తోంది. వాస్తవానికి ఎన్నిక‌ల త‌ర్వాత కూడా తూర్పు ఎమ్మెల్యే గ‌ద్దెకు, ఎంపీ నానికి మంచి సంబంధాలే ఉండేవి. మేయ‌ర్ ప‌ద‌వి విష‌యంలోనే వీరి మ‌ధ్య కూడా తేడా కొట్టేసిందంటున్నారు. మ‌రి టీడీపీలో ఈ వ‌ర్గ పోరును ఆదిలోనే అంతం చేయ‌క‌పోతే..మున్ముందు ప్రమాద‌మేన‌న్నది విశ్లేష‌కుల మాట‌. మ‌రి చంద్రబాబు ఏం చేస్తారో ? చూడాలి.

Tags:    

Similar News