ఉన్న చోట కూడా చోటు లేకుండా పోతుందిగా?

విశాఖ సహా ఉత్తరాంధ్రా కంచుకోట అని బీరాలు పలికే రోజులు పోయాయి. సిటీలో టీడీపీ వెరీ స్ట్రాంగ్ అని గొప్పగా చెప్పుకునే కాలం కూడా పోయింది. తాజాగా [more]

Update: 2021-04-01 12:30 GMT

విశాఖ సహా ఉత్తరాంధ్రా కంచుకోట అని బీరాలు పలికే రోజులు పోయాయి. సిటీలో టీడీపీ వెరీ స్ట్రాంగ్ అని గొప్పగా చెప్పుకునే కాలం కూడా పోయింది. తాజాగా జరిగిన మేయర్ ఎన్నికల్లో వైసీపీని జనాలు గెలిపించి అందలం మీద కూర్చోబెట్టారు. విశాఖలో వైసీపీ గెలిస్తే అరాచక పాలన వస్తుందని చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఎంతలా మొత్తుకున్నా సగటు జనాలు అసలు వినిపించుకోలేదు, చివరికి ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ మంటల్లో చలి కాచుకోవాలని చూసినా అసలు వర్కౌట్ కాలేదు.

నగరంలో పాగా …?

వైసీపీ రెబెల్స్ తో కలుపుకుని అరవై దాకా కార్పొరేటర్లను గెలుచుకుంది. ఆ పార్టీ వ్యూహాత్మకమైన తప్పిదాల వల్ల మరి కొన్ని సీట్లు చేజారాయి. ఏది ఏమైనా కూడా విశాఖ నగర పాలన ఇపుడు వైసీపీ చేతికి వచ్చింది. అంతకంటే ఆ పార్టీకి ఆనందం కలిగించేది వేరేది ఉండబోదు. ఇక టీడీపీ 2019 ఎన్నికల్లో విశాఖ సిటీలో నాలుగు సీట్లు గెలిచాను అనుకుందే కానీ వర్తమానంలో జనాలు పూర్తిగా పక్కన పెట్టేశారు అని గ్రహించలేకపోతోంది. వైసీపీ సిటీలోకి కూడా చొచ్చుకు వచ్చేశాక సైకిల్ పార్టీ జోరుకుకు పూర్తిగా బ్రేకులు పడిపోయాయనే అంటున్నారు. నగరం నాలుగు చెరగులా ఫ్యాన్ ఇక గిర్రున తిరగడమే మిగిలి ఉందని కూడా చెబుతున్నారు.

దూరమేనా ….?

విశాఖ సిటీలో టీడీపీ 2019 ఎన్నికల్లో గెలవడం వాస్తవ‌మే కానే గత కొన్ని దశాబ్దాలుగా మాత్రం సిటీలో టీడీపీ బలం దారుణంగా తగ్గుతోంది అన్నది ఒక విశ్లేషణ. 1999 ఎన్నికల తరువాత విశాఖ లోక్ సభ సీటుని టీడీపీ గెలుచుకోలేకపోయింది. అంటే ఇప్పటికి 22 ఏళ్ల నుంచి టీడీపీని విశాఖ ప్రజలు జనం దూరం పెట్టారన్న మాటేగా. అలాగే 1987 నుంచి చూస్తే ఇప్పటికి మళ్లీ మేయర్ పీఠాన్ని టీడీపీ ఎక్కిన చరిత్ర లేనే లేదు. అంటే దాదాపుగా మూడున్నర దశాబ్దాలుగా కార్పోరేషన్ మీద టీడీపీ జెండా ఎగరలేదు అన్న చేదు నిజాన్ని తమ్ముళ్ళు గ్రహించాలి.

తీసికట్టేనా…?

ఇక టీడీపీకి సిటీలో ధీటు అయిన నాయకులు లేకుండా పోతున్నారు. ఉన్న వారిలో చాలా మంది వైసీపీ వైపు చేరిపోగా మిగిలిన కొద్ది మంది కూడా పూర్తిగా నిరాశలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ఇంకా మూడున్నరేళ్ళ కాలం ఉంది. ఈ లోగా విశాఖ సిటీలో ఎన్నో రాజకీయ పరిణామాలు జరుగుతాయి అంటున్నారు. టీడీపీని ఇంకా వీక్ చేయడమే లక్ష్యంగా వైసీపీ పావులు చాలా జోరుగా కదుపుతుంది అంటున్నారు. అదే కనుక జరిగితే బీజేపీ మాదిరిగానే టీడీపీ కూడా గత వైభవాన్ని చెప్పుకుంటూ గడపడమే మిగులుతుంది అంటున్నారు. మొత్తానికి విశాఖ సిటీలో టీడీపీ పొలిటికల్ గా దారుణమైన స్థితిలో ఉందనే చెప్పాలి.

Tags:    

Similar News