అధ్యక్షా… పదవి అచ్చిరావడంలేదుగా ?

విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్ష పదవి కోసం ఒకప్పుడు కొట్లాట జరిగింది. ఆయనకు ఇస్తే నేను పార్టీలో ఉండను అంటూ సవాళ్ళు చేసుకున్నారు. ఇది చినబాబు పెదబాబుల [more]

Update: 2020-09-27 03:30 GMT

విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్ష పదవి కోసం ఒకప్పుడు కొట్లాట జరిగింది. ఆయనకు ఇస్తే నేను పార్టీలో ఉండను అంటూ సవాళ్ళు చేసుకున్నారు. ఇది చినబాబు పెదబాబుల దాకా పంచాయతీకి వెళ్ళింది. పార్టీలో ఆయన అధ్యక్షుడిగా ఉంటే నేను పార్టీ ఆఫీస్ కే రాను అంటూ ఆనాడు తన పంతం నెగ్గించుకున్నారు విశాఖ సౌత్ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ . ఆయన్ని కాదని విశాఖ అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ కిరీటం మైనారిటీ నాయకుడు డాక్టర్ ఎస్ అ రహమాన్ నెత్తిన చంద్రబాబు పెట్టారు. అప్పట్లో ప్రతీ రోజూ ఇద్దరి మధ్యన గొడవలే. చివరికి అధ్యక్షుడుగా ఉంటూనే టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరిపోయారు రహమాన్. ఈ ఏడాది మొదట్లో వైసీపీ మూడు రాజధానుల ప్రతిపాదనకు జై కొడుతూ రహమాన్ టీడీపీకి గుడ్ బై కొట్టారు. విశాఖ రాజధాని కోసమే తాను పార్టీని వీడుతున్నాను అన్నారు.

ఆరు నెలలు తిరగకుండానే….

ఇక ఆ తరువాత విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ కిరీటం సహజంగానే వాసుపల్లికి దక్కింది. ఆయన ఆరు నెలల పాటు పార్టీని నడిపారు. విశాఖలో టీడీపీకి అంతా తాను అయ్యారు. కానీ ఏమైందో ఏమో కానీ ఈ టీడీపీ బతకదు అంటూ ఒక ఫైన్ మార్నింగ్ అధ్యక్ష పదవిని వదిలేసి మరీ వాసుపల్లి వైసీపీ నీడకు చేరిపోయారు. ఆయన కూడా విశాఖ రాజధానిని ఇచ్చిన జగన్ కే తన మద్దతు అంటున్నారు. విశాఖ ప్రజల కోరిక కూడా ఇదేనని చెబుతున్నారు. మరి విశాఖలో ఇద్దరు అధ్యక్షులు టీడీపీకి ఇలా ఘోరీ కట్టి పార్టీని విశాఖ సంద్రంలో కలిపేసి మరీ వైసీపీలోకి చేరిపోయారు. చంద్రబాబుకు గట్టి షాక్ ఇచ్చేశారు.

ఈయనా అంతేగా…

ఇక విశాఖ రూరల్ జిల్లా ప్రెసిడెంట్ పదవిని ఏరి కోరి మరీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు చంద్రబాబు అప్పగించారు. ఆయన అటూ ఇటూ చూసి నాకొద్దీ అధ్యక్ష పదవి అంటూ గోడ దూకేసి మరీ ఈ మధ్యనే వైసీపీ పంచన చేరిపోయారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన పంచకర్లకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఒకనాడు చాలంజిగా రూరల్ ప్రెసిడెంట్ పదవి తీసుకుని విశాఖలో మహానాడుని విజయవంతం చేయడంతో కీలక పాత్ర పోషించిన పంచకర్ల ఇపుడు టీడీపీ మునిగే నావ అంటున్నారు. అందుకే పార్టీని వీడాల్సివచ్చిందని కూడా చెబుతున్నారు.

యాంటీ సెంటిమెంట్….

విశాఖ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ పదవులకు మంచి పోటీ ఉంటుంది. ఎందుకంటే ఏపీలో కీలకమైన జిల్లా కావడంతో పాటు అధినాయకత్వం చూపు ఎపుడూ ఇటువైపే ఉంటుంది. దాంతో ఈ పదవిని ప్రెస్టేజి గా నేతలు భావిస్తారు. అటువంటి అధ్యక్ష పదవులు ఇపుడు త్రుణప్రాయంగా భావిస్తూ వదిలేస్తున్నారు అంటే టీడీపీకి ఏదో అయిందని తమ్ముళ్ళు తల్లడిల్లుతున్నారు. అంతే కాదు, అధ్యక్ష పదవిని ఇపుడు కొత్తవారు తీసుకోవడానికి కూడా జంకుతున్నారు. ఇక హైకమాండ్ కూడా ఎవరికి పదవులు ఇచ్చినా వైసీపీలో చేరిపోవడం చూసి యాంటీ సెంటిమెంట్ కి బేజారవుతోంది. మొత్తం మీద రాజధాని కాబోతున్న విశాఖ జిల్లాలో టీడీపీకి ప్రెసిడెంట్లు లేక పతనావస్థకు చేరుకుంటోందని అంటున్నారు. ఈ గోడ దూకుళ్ళు ఇంతటితో ఆగుతాయన్న నమ్మకం కూడా ఎవరికీ లేదు అని అంటున్నారు. మరి చంద్రబాబుకే సవాల్ చేస్తున్న విశాఖ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News