ఈ మూడు జిల్లాల్లో మారుతోన్న సీన్‌..?

ఏపీలో మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీని కాపాడుతున్న జిల్లాలు ఏవైనా ఉంటే.. మూడే మూడు అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌టి విశాఖ‌ప‌ట్నం, రెండు గుంటూరు. [more]

Update: 2021-05-15 13:30 GMT

ఏపీలో మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీని కాపాడుతున్న జిల్లాలు ఏవైనా ఉంటే.. మూడే మూడు అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌టి విశాఖ‌ప‌ట్నం, రెండు గుంటూరు. మూడు ప్రకాశం. గ‌త ఎన్నిక‌ల్లో ఈ మూడు జిల్లాల్లోనూ ఒకింత గౌర‌వ‌ప్రద‌మైన ఓట్లు సంపాయించుకోవ‌డంతోపాటు.. నాయ‌కులు కూడా గెలిచారు. విశాఖ‌లో న‌లుగురు ఎమ్మెల్యేలు, గుంటూరులో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ప్రకాశంలో న‌లుగురు ఎమ్మెల్యేలు పార్టీకి ద‌క్కారు. దీంతో ఈ మూడు జిల్లాలు కూడా పార్టీని నిల‌బెట్టాయ‌నే చ‌ర్చ అప్పట్లో బాగానే సాగింది. అయితే.. ఇప్పటికి రెండేళ్లు పూర్తయ్యాయి. మ‌రి ఇప్పుడు ఈ మూడు జిల్లాల్లో టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉంది ? గెలిచిన నేత‌లు ఏం చేస్తున్నారు ? ఓడిపోయినా.. గౌర‌వ‌ప్రద‌మైన ఓట్లు సంపాయించుకున్న టీడీపీ సీనియ‌ర్లు ఎలా ఉన్నారు ? పార్టీ అభ్యున్నతికి ఏమేర‌కుకృషి చేస్తున్నారు? ఈ విష‌యాలు ప‌రిశీలిస్తే.. ఒకింత ఇబ్బందిగానే స‌మాధానం వ‌స్తోంది.

నేతలు ఒక్కొరొక్కరుగా…?

విశాఖ‌లో టీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్యేనేరుగా వైసీపీకి మ‌ద్దతు ప్రక‌టించారు. మ‌రో ఎమ్మెల్యే త‌ట‌స్థంగా ఉన్నారు. ఇటీవ‌ల తెర‌మీదికి వ‌చ్చిన విశాఖ ఉక్కు ఉద్యమ నేప‌థ్యంలో ఆయ‌న త‌న ఎమ్మెల్యే ప‌దవికి రాజీనామా స‌మ‌ర్పించారు. మ‌రో ఎమ్మెల్యే ఎప్పుడు పార్టీ మార‌దామా ? అని కాచుకుని ఉన్నారు. గుంటూరు విష‌యాన్ని తీసుకుంటే.. ఇక్కడ ఓ ఎమ్మెల్యే పార్టీ జంప్ చేసేశారు. గెలిచిన మ‌రో ఎమ్మెల్యే పార్టీలోనే ఉన్నప్పటికీ.. ఆయ‌న కూడా చురుగ్గా వ్యవ‌హ‌రించ‌లేక పోతున్నార‌నే వాద‌న వ‌స్తోంది. గుంటూరు ఎంపీ కూడా అవ‌స‌ర‌మైతేనే పార్టీ విష‌యంలో మాట్లాడుతున్నారు. పైగా ప్రజ‌ల‌కు, పార్టీ నేత‌ల‌కు అస‌లుఅందుబాటులో కూడా ఉండ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది.

కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతూ…

మ‌రోవైపు ప్రకాశం జిల్లాలో న‌లుగురు గెలిచినా.. ఒక‌రు పార్టీకి దూర‌మ‌య్యారు. మిగిలిన ముగ్గురులో ఒక‌రు ప్రభుత్వ కేసుల‌తో ఉక్కిరి బిక్కిరి కి గుర‌వుతూ.. పార్టీ విష‌యంలో పెద్దగా యాక్టివ్‌గా ఉండ‌లేక పోతున్నారు. మ‌రో ఎమ్మెల్యే త‌న వ‌ర్గంలోనే వ్యతిరేక‌త‌ను ఎదుర్కొంటుండగా.. ఇంకో ఎమ్మెల్యే మాత్రం త‌న మానాన త‌ను ప‌నిచేసుకుంటున్నారు. ఈ ప‌రిణామాల‌ను బ‌ట్టి చూస్తే టీడీపీకి కాస్తో కూస్తో ప‌ట్టున్న ఈ మూడు జిల్లాల్లో కూడా పార్టీ ప‌రిస్థితి ఇత‌ర ఓడిపోయిన జిల్లాల మాదిరిగానే ఉంద‌నే తెలుస్తోంది.

పార్టీని గాడిలో పెట్టేందుకు….

పార్టీని గాడిలో పెట్టేందుకు… జిల్లాల నేత‌ల‌తో చ‌ర్చించేందుకు అధినేత చంద్రబాబు స‌మ‌యం ఇవ్వడం లేదు. లోకేష్ వ‌చ్చినా.. పైపైనే ప‌నికానిచ్చి వెళ్లిపోతున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో ప‌రిస్థితి టీడీపీకి ఇబ్బందిగానే ఉంద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చేఎన్నిక‌ల నాటికి ఈ ప‌రిస్థితిని మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. ఇక‌, ఓడిపోయిన నేత‌లు చాలా వ‌ర‌కు పార్టీ మారిపోయారు. మ‌రికొంద‌రు అసంతృప్తితో ఉన్నారు. ఇంకొంద‌రు.. అస‌లు పార్టీలో ఉన్నారో లేరో కూడా తెలియ‌డం లేదు. ఇదీ ఇప్పుడు మూడు జిల్లాల్లో ప‌రిస్థితి మ‌రి చంద్రబాబు ఈ జిల్లాల్లో ప‌ట్టు సాధించేందుకు ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News