టీడీపీకి అక్కడ మేయర్ పదవి బహు దూరమేనా..?
తెలుగుదేశం పార్టీకి చాలా ఆశలు ఉన్నాయి. అయితే అవి సుదీర్ఘ కాలంలో కూడా తీరనివే అవుతున్నాయి. రాజకీయ ఉద్ధండ పిండం చంద్రబాబు ఏలుబడిలో కూడా టీడీపీ విశాఖ [more]
తెలుగుదేశం పార్టీకి చాలా ఆశలు ఉన్నాయి. అయితే అవి సుదీర్ఘ కాలంలో కూడా తీరనివే అవుతున్నాయి. రాజకీయ ఉద్ధండ పిండం చంద్రబాబు ఏలుబడిలో కూడా టీడీపీ విశాఖ [more]
తెలుగుదేశం పార్టీకి చాలా ఆశలు ఉన్నాయి. అయితే అవి సుదీర్ఘ కాలంలో కూడా తీరనివే అవుతున్నాయి. రాజకీయ ఉద్ధండ పిండం చంద్రబాబు ఏలుబడిలో కూడా టీడీపీ విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకోలేక పలుమార్లు చతికిలపడింది. ఇక విశాఖ రాజకీయాల్లో తానే పెద్ద తోపు అని టీడీపీ ఎంతలా ఫీల్ అయినా కూడా విశాఖ మేయర్ దక్కక చిన్నబోయింది. దానికి కారణం టీడీపీకి రాజకీయ అదృష్టం లేకపోవడమే.
మూడున్నర దశాబ్దాలుగా….
టీడీపీకి మేయర్ పీఠం విశాఖలో ఒకే ఒకసారి దక్కింది. అదే చివరి సారి కూడా అయింది. 1983లో అధికారంలోకి వచ్చిన టీడీపీ 1987లో స్థానిక ఎన్నికలను నిర్వహించింది. అపుడు విశాఖ మేయర్ గా టీడీపీకి చెందిన ప్రముఖ న్యాయవాది డీవీ సుబ్బారావు నెగ్గారు. ఆయన అయిదేళ్ల పాటు ఆ కుర్చీలో వెలిగారు. ఆ తరువాత మాత్రం ఎంత ప్రయత్నం చేసినా మేయర్ సీటు అందని పండే అవుతోంది. 1994లో ఎన్టీయార్ నాయకత్వాన టీడీపీ బంపర్ మెజారిటీతో నెగ్గింది. మూడు నెలలు తిరగకుండానే 1995 ఫిబ్రవరిలో విశాఖ మేయర్ ఎన్నికలు పెడితే టీడీపీ చిత్తుగా ఓడింది. కాంగ్రెస్ నాడు అనూహ్యంగా పుంజుకుని గెలిచింది.
అలా ఓడిన బాబు….
ఎన్నికలు అంటే ఎన్నో వ్యూహాలను అమలు చేసే చంద్రబాబుకు కూడా విశాఖ మేయర్ పీఠం కొరకరాని కొయ్యగానే మారింది. చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు 2000లో కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తే మరోసారి టీడీపీ ఘోరంగా ఓడింది. అప్పటికే శాసనసభ ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ దూకుడు చేసి మరీ మేయర్ పీఠం పట్టేసింది. బాబు అధికార బలం, రాజకీయ చాణక్యం కూడా ఎక్కడా పనిచేయకుండా పోయాయి. ఇక 2007లో మరో మారు ఎన్నికలు జరిగాయి. అపుడు బాబు విపక్షంలో ఉన్నారు. వైఎస్సార్ సీఎం గా ఉండగా జరిగిన ఈ ఎన్నికలో మెజారిటీ సీట్లు టీడీపీ దక్కించుకున్నా ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతుతో కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని తన్నుకుపోయింది.
యాంటీ సెంటిమెంట్ తో ….
మేయర్ కి పోటీ అంటే టీడీపీకి అచ్చిరాదు అని చెప్పుకుంటారు. అందుకే ఈసారి తలరాత ఎలా ఉంటుందో అని తమ్ముళ్ళు కంగారు పడుతున్నారు. ఇపుడు వైసీపీ అధికారంలో ఉంది, 98 వార్డులను తమకు అనుకూలంగా డిజైన్ చేసుకున్నారని ఇప్పటికే టీడీపీ ఆరోపిస్తోంది అంటే ఓటమి భయంతోనే అనుకోవాలేమో. జీవీఎంసీ పరిధిలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో వైసీపీ వైపు అయిదుగురు ఉన్నారు. టీడీపీ నుంచి నలుగురు గెలిస్తే సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీకి జై కొట్టేశారు. ఇక ఉత్తరం సీటుకు రాజీనామా చేసి గంటా శ్రీనివాసరావు అస్త సన్యాసమే చేశారు, మిగిలింది తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు వెలగపూడి, గణబాబులే గ్రేటర్ సమరంలో సైకిల్ ని పరుగులు పెట్టించాలి. ఇపుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యమా అన్న చర్చ పసుపు శిబిరంలో ఉంది. మొత్తానికి ఏదైనా అద్భుతం జరిగితే తప్ప టీడీపీకి మేయర్ పీఠం దక్కడం కష్టమే అంటున్నారు.