ఇక్కడ టీడీపీని రక్షించేదెవరు? ఐదు నియోజకవర్గాల్లో?

ప‌శ్చిమ‌గోదావ‌రి టీడీపీ సీన్ ఏడాది కాలంలోనే పూర్తిగా రివ‌ర్స్ అయ్యింది. ఈ జిల్లా పేరు చెపితే ఒక‌ప్పుడు టీడీపీకి కంచుకోట‌. 2014 ఎన్నిక‌ల్లో క్వీన్‌స్వీప్ చేసిన పార్టీ [more]

Update: 2020-08-26 14:30 GMT

ప‌శ్చిమ‌గోదావ‌రి టీడీపీ సీన్ ఏడాది కాలంలోనే పూర్తిగా రివ‌ర్స్ అయ్యింది. ఈ జిల్లా పేరు చెపితే ఒక‌ప్పుడు టీడీపీకి కంచుకోట‌. 2014 ఎన్నిక‌ల్లో క్వీన్‌స్వీప్ చేసిన పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం రెండంటే రెండు సీట్లతోనే స‌రిపెట్టుకుంది. ఎన్నిక‌ల్లో ఓడిన ఏడాది కాలంలో క‌ట్ చేస్తే పార్టీ ప‌రిస్థితి ఘోరంగా ఉంది. ఐదారు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని న‌డిపించే నాథుడు లేక కునారిల్లుతోంది. కొవ్వూరు, చింత‌ల‌పూడి, తాడేప‌ల్లిగూడెం, నిడ‌ద‌వోలు, భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని నడిపించే నాయ‌కుడే లేకుండా పోయాడు. కొవ్వూరులో గ‌త ఎన్నిక‌ల్లో స్థానిక టీడీపీ కేడ‌ర్ అప్పుడు మంత్రిగా ఉన్న కేఎస్‌.జ‌వ‌హ‌ర్‌ను వ‌ద్దని బాబుపై ఒత్తిడి చేయ‌గా బాబు జ‌వ‌హ‌ర్‌ను కృష్ణా జిల్లా తిరువూరుకు పంపారు. ఇక్కడ‌కు పాయ‌క‌రావుపేట మాజీ ఎమ్మెల్యే అనిత‌ను దిగుమ‌తి చేసుకోగా ఆమె ఎన్నిక‌ల్లో ఓడిన వెంట‌నే అడ్రస్ లేకుండా పోయారు. ఇప్పుడు అనిత‌కు పాయ‌క‌రావుపేట ప‌గ్గాలు ఇవ్వడంతో కొవ్వూరు టీడీపీ అనాథ‌గా మారింది. జ‌వ‌హ‌ర్ ఇక్కడ‌కు వ‌చ్చేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నా చంద్రబాబు త‌ట‌ప‌టాయిస్తోన్న ప‌రిస్థితి.

ఏ నియోజకవర్గం చూసినా….

ఇక చింత‌ల‌పూడిలోనూ కొవ్వూరు ప‌రిస్థితే. ఇక్కడ మాజీ మంత్రి పీత‌ల సుజాత‌ను బ‌ల‌వంతంగా త‌ప్పించి అవుట్‌డేటెడ్ నాయ‌కుడు క‌ర్రా రాజారావుకు సీటు ఇవ్వగా ఘోరంగా ఓడిపోయారు. ఎన్నిక‌ల్లో ఓడిన రాజారావు వ‌యోః భారంతో నియోజ‌క‌వ‌ర్గంలో తిర‌గ‌లేని ప‌రిస్థితి. అస‌లు రాజారావుకంటూ సొంత కేడ‌రే లేదు. ఇక్కడ మ‌ళ్లీ సుజాత‌కే ప‌గ్గాలు ఇచ్చే ఆలోచ‌న‌లో అధిష్టానం ఉంది. నియోజ‌క‌వ‌ర్గంలో సుజాత‌ వ‌ర్గం కూడా ఆమెకే బాధ్యత‌లు ఇస్తే యాక్టివ్ అయ్యేందుకు కాచుకుని ఉంది. ఇక తాడేప‌ల్లిగూడెంలో గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన మాజీ ఎమ్మెల్యే ఈలి నాని వైసీపీ నేత‌ల‌తో చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతుండ‌డంతో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని ప‌ట్టించుకోవ‌డం లేదు. నానికి టీడీపీలో కొన‌సాగే ఉద్దేశం లేద‌ని చెపుతున్న టీడీపీ కేడ‌ర్ ఇక్కడ ప‌గ్గాలు జ‌డ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు ఇవ్వాల‌ని కోరుతున్నాయి.

ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుండా……

ఇక భీమ‌వ‌రంలో మాజీ ఎమ్మెల్యే పుల‌ప‌ర్తి అంజిబాబు ( గంటా వియ్యంకుడు) అధికారంలో ఉండ‌గానే యాక్టివ్‌గా ఉండ‌ర‌ని.. ఆయ‌నో ముభావంతో కూడిన రాజ‌కీయాలు చేస్తార‌న్న పేరుంది. ఇక ఇప్పుడు ఓడిపోవ‌డంతో ఆయ‌న అస్సలు బ‌య‌ట‌కు రావ‌డం లేదు. అస‌లు తానో టీడీపీ నేత‌ను అన్న విష‌య‌మే ఆయ‌న మ‌ర్చిపోయిన‌ట్టున్నార‌ని టీడీపీ నేత‌లే చెవులు కొరుక్కుంటున్నాయి. అంజిబాబు వైసీపీలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ట‌. ఇక నిడ‌ద‌వోలులో రెండు సార్లు వ‌రుస‌గా గెలిచిన మాజీ ఎమ్మెల్యే బూరుగుప‌ల్లి శేషారావు రాజ‌కీయాల ప‌ట్ల విముఖ‌త‌తో ఉన్నార‌ని టీడీపీ వ‌ర్గాలే చెపుతున్నాయి. క‌నీసం సాధార‌ణ కార్యక‌ర్త ఫోన్ చేసినా ఇప్పుడు పార్టీ కోసం క‌ష్టప‌డితే ఉప‌యోగం ఉండ‌ద‌న్న నిరాశ ప్రవ‌చ‌నాలు ప‌లుకుతున్నార‌ట‌. ఇక ఆయ‌న్ను త‌ప్పిస్తే అక్కడ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టేందుకు మ‌రో నేత కాచుకుని కూర్చొని ఉన్నారు. ఏదేమైనా టీడీపీ కంచుకోట‌లో ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ దుకాణం బంద్ చేసే ప‌రిస్థితుల్లో ఉంద‌న్నది మాత్రం నిజం.

Tags:    

Similar News