టీడీపీలో ఈ నేతలు ఇక కన్పించరా?
పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు 2014 ఎన్నికల్లో స్వీప్ చేసి మరీ చంద్రబాబును అధికారంలోకి తీసుకువచ్చారు. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో అభివృద్ధి కంటే సొంత పార్టీ నేతల [more]
పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు 2014 ఎన్నికల్లో స్వీప్ చేసి మరీ చంద్రబాబును అధికారంలోకి తీసుకువచ్చారు. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో అభివృద్ధి కంటే సొంత పార్టీ నేతల [more]
పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు 2014 ఎన్నికల్లో స్వీప్ చేసి మరీ చంద్రబాబును అధికారంలోకి తీసుకువచ్చారు. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో అభివృద్ధి కంటే సొంత పార్టీ నేతల కుమ్ములాటలే ఎక్కువైపోయాయి. చివరకు టిక్కెట్ల వ్యవహారంలో ఒకరికి మరొకరు ఎర్త్ పెట్టుకున్నారు. దీంతో విసుగెత్తిన పశ్చిమ ఓటరు టీడీపీకి రెండు సీట్లతో సరిపెట్టేశాడు. పాలకొల్లు, ఉండిలో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. పార్టీ పవర్‌లో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలగడంతో పాటు హీరోలుగా ఉన్న నేతల్లో కొందరి అడ్రస్ ప్రస్తుతానికి గల్లంతవ్వగా.. మరి కొందరు సరైన టైం కోసం వెయిటింగ్‌లో ఉన్నారు.
ముళ్లపూడి బాపిరాజు: టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో దూకుడుగా ఉన్న ఆయన అధికారంలోకి వచ్చాక అంతకుమించిన దూకుడు చూపించడంతో పాటు గ్రూపు రాజకీయాలకు కేంద్రబిందువుగా మారిపోయారు. ముఖ్యంగా రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో కొన్ని వర్గాలను ఎంకరేజ్ చేయడం ద్వారా ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారిపోయారన్న విమర్శలు తెచ్చుకున్నారు. జడ్పీచైర్మన్‌గా ఆయనపై ఉన్న అంచనాలు అందుకోలేకపోయినా పవర్‌లో ఉన్నప్పుడు సపరేట్‌గా గ్రూప్ మెయింటైన్ చేశారు. చివరకు 2019 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం సీటు కోసం విశ్వప్రయత్నం చేసినా బాబు పట్టించుకోలేదు. ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం కొన్ని నియోజకవర్గాల నేతలకు ఆర్థికసాయం చేసినా అవి రాకపోవడంతో తీవ్ర నిరుత్సాహంతో బాపిరాజు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన విజయవాడలోనే ఎక్కువుగా ఉండడంతో పార్టీ కేడర్‌కు ఆయనకు దూరం పెరిగిపోతోంది.. అటు టీడీపీ అధిష్టానానం వద్ద కూడా పట్టు సడలుతోంది.
మాగంటి బాబు: టీడీపీ అధికారంలో ఉంటే మాగంటి హడావిడే వేరు. 2009 ఎన్నికల్లోనే టీడీపీ నుంచి ఎంపీగా ఓడిన బాబు 2014 ఎన్నికల్లో ఎట్టకేలకు ఎంపీగా ఐదేళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓసీ నేతలు ఉన్న చోట మినహా, మిగిలిన ఎస్సీ, బీసీ నేతలు ఉన్న నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించి పార్టీని నాశనం చేయడంతో పాటు నేతలను ముప్పుతిప్పలు పెట్టారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక గత ఎన్నికలకు ముందు ఆయనకు టిక్కెట్ ఇవ్వాలా ? వద్దా ? అని చంద్రబాబు మీమాంసలో పడినా చివరకు మాగంటి సీనియార్టీని గౌరవించి సీటు ఇస్తే చిత్తుగా ఓడిపోయారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత మాగంటి రాజకీయాల్లో ఉన్నానా ? లేనా ?అన‌్నట్టుగా ఉన్నారు. ఆయన వారసుడు కూడా బయటకు రాకపోవడంతో మాగంటి ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యూచర్‌పై పెద్ద సస్పెన్స్ ఉంది.
పీతల సుజాత: చింతలపూడి నుంచి గత టర్మ్‌లో రెండోసారి ఎమ్మెల్యే అయిన సుజాత మంత్రిగా మూడేళ్ల పాటు హవా కొనసాగించారు. సుజాత వ్యతిరేక కోటరీ చక్రం తిప్పడంతో ఆమె 2017లో మంత్రి పదవికి దూరమయ్యారు. చివరకు గత ఎన్నికల్లో ఆమెకు సీటు కూడా రాలేదు. గత ఎన్నికల్లో చింతలపూడిలో ఓడిన కర్రా రాజారావు అనారోగ్యంతో ఉండడంతో మళ్లీ సుజాత వర్గం యాక్టివ్ అవుతోంది. టీడీపీ పదవుల్లో కూడా సరైన ప్రాధాన్యత లేదని అసంతృప్తితో ఉన్న సుజాత ప్రస్తుతం చింతలపూడి టీడీపీకి పెద్ద ఆప్షన్‌గా ఉన్నారు. మళ్లీ నియోజకవర్గ పగ్గాలు వస్తాయన్న ఆశతో సుజాత ఉన్నారు.
కలువపూడి శివ: పశ్చిమగోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా మార్చిన శివ వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. గత ఎన్నికల్లో చంద్రబాబు బలవంతంపై ఎంపీగా పోటీ చేసి ఓడిన శివ ఆ తర్వాత రాజకీయాల్లో ఉన్నారా ? అన్న సందేహాలు వచ్చే వైఖరితో ఉన్నారు. పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ప్రతి రోజు ఏదో ఒక సంచలనంతో వార్తల్లో ఉండే శివ ఎంపీగా పోటీ చేసి తాను తప్పు చేశానని.. చంద్రబాబు తన రాజకీయ భవిష్యత్తుపై దెబ్బ కొట్టారని మదన పడుతున్నారు. శివ మళ్లీ ఎప్పుడు యాక్టివ్ అవుతారో ? కూడా పార్టీ కేడర్‌కే తెలియడం లేదు.
మొడియం శ్రీనివాస్: 2012 ఉప ఎన్నికల్లో ఓడి 2014లో పోలవరం ఎమ్మెల్యేగా గెలిచిన మొడియం శ్రీనివాస్ గత ఐదేళ్లలో నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకున్నారు. అప్పటి ఏలూరు ఎంపీ మాగంటి బాబుతో మొడియంకు ఏ మాత్రం పొసగలేదు. ఐదేళ్ల పాటు పోలవరంలో రెండు గ్రూపుల గోలే సాగింది. చివరకు గత ఎన్నికల్లో మొడియంకు సీటు రాలేదు. ఎన్నికల ప్రచారంలో కూడా అంటీముట్టనట్టుగా ఉన్న మొడియం ఇప్పుడిప్పుడే మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. నియోజకవర్గంలో ఆయనకంటూ ఓ కేడర్ ఉన్నా వాళ్లను సమన్వయం చేసుకోవడంలో వెనకపడుతోన్న పరిస్థితి. ప్రస్తుత టీడీపీ ఇన్‌చార్జ్ బొరంగ శ్రీను స్ట్రాంగ్‌గా ఉండడంతో మొడియం భవిష్యత్తు ఏంటనేది చెప్పలేని పరిస్థితి.