వెనక్కు తగ్గితే నష్టపోయేదెవరు ?

ఏమో ఎన్నికలు అంటేనే తెలుగుదేశం పార్టీ ఎందుకో వెనకా ముందూ ఆడుతోంది. బస్తీ మే సవాల్ పంచాయతీ ఎన్నికలు పెట్టండి అంటూ ఈ ఏడాది మొదట్లో పెద్ద [more]

Update: 2021-04-02 05:00 GMT

ఏమో ఎన్నికలు అంటేనే తెలుగుదేశం పార్టీ ఎందుకో వెనకా ముందూ ఆడుతోంది. బస్తీ మే సవాల్ పంచాయతీ ఎన్నికలు పెట్టండి అంటూ ఈ ఏడాది మొదట్లో పెద్ద నోర్లు చేసిన తమ్ముళ్ళు అంతా ఇపుడు ఫుల్ సైలెంట్ అయిపోయారు. అధికార వైసీపీకి ఎన్నికలు అంటే భయం. జగన్ ఎన్నికలకు వెళ్ళే ధైర్యం చేయడం లేదు అన్నది కూడా పసుపు పార్టీ నేతలే. కానీ ఒక్కసారిగా ఆ మాటలే వారికే రివర్స్ లో వచ్చి తగులుతున్న సీన్ ఇపుడు కనిపిస్తోంది.

దెబ్బకు ఠా…..

ఎన్నికలు పెట్టండి అని పోరి మరీ పెట్టించిన తెలుగుదేశానికి స్థానిక ఎన్నికల్లో ఒక విధంగా శృంగ భంగమే అయింది. పార్టీ గుర్తులు లేని పంచాయతీ ఎన్నికలు కూడా ఏకపక్షంగా వైసీపీకే ఓటెత్తాయి. ఇక మునిసిపాలిటీల విషయానికి వస్తే అంతకంటే దారుణంగా రిజల్ట్ వచ్చి టీడీపీని వెక్కిరించాయి. ఇపుడు పరిషత్ ఎన్నికలు అంటున్నారు. నిజానికి నిమ్మగడ్డ పదవీ కాలం మరికొంతకాలం ఉండి ఉంటే ఇప్పట్లో పరిషత్ ఎన్నికలు జరిగేవి కావు అన్న మాట కూడా ఉంది. తెలుగుదేశానికి ఇపుడు కాని కాలం వచ్చిపడింది. ఆయన పదవీ విరమణ చేశారు.

ఎన్నికలకు నై …?

ఇక కొత్తగా వచ్చిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిణి నీలం సాహ్ని ఆద్వర్యంలో ఎన్నికలు జరగనున్నాయి. దాంతో పాటు ప్రజల నాడిని చూసిన వైసీపీ ఇదే ఊపులో పరిషత్ ఎన్నికలను కూడా నిర్వహించేసి లాభపడాలని చూడడంలో తప్పులేదు. ఇలా ఇప్పటికిపుడు వచ్చిపడిన ఎన్నికలను తట్టుకోలేమని తెలుగుదేశంలో చర్చగా ఉందిట. ఇప్పటికే చాలా జిల్లాలలో పార్టీ పెద్దలకు దిగువ స్థాయి నాయకులు మేము ఈ భారం మోయలేమని కూడా చెప్పేస్తున్నారుట. ఇదే సమయంలో కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు టీడీపీ ఎన్నికలను బహిష్కరిస్తే మేలు అన్న మాట అన్నారని ప్రచారం సాగుతోంది. నిజానికి అధినాయకత్వానికి కూడా ఎన్నికలకు వెళ్ళడం ఇష్టం లేదు కానీ పార్టీగా ఎదుర్కోవాలి అన్నదే వారి ఆలోచన.

చేతులెత్తేస్తే…?

ఒక రాజకీయ పార్టీ అన్న తరువాత ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా ఎన్నికలను ఫేస్ చేయాల్సిందే. ఓటమి అన్నది ఎన్నికల్లో సహజం. అయితే టీడీపీ పరిస్థితి ఇపుడు భిన్నంగా ఉంది ఎన్నికలకు ఓకే చెప్పినా పోటీ చేసేందుకు అభ్యర్ధులు లేరు అన్న మాట కూడా ఉంది. మరో వైపు ఫలితం కళ్ల ముందు కనిపిస్తోంది. అధికార పార్టీ దౌర్జన్యాలు, దాష్టికం లాంటి మాటలు ఎన్ని వాడినా కూడా జనాలే కాదు, పార్టీ జనాలు కూడా నమ్మే సీన్ లేదిపుడు. దాంతో ఓ విధంగా మేము పోటీకి దూరం అని చెప్పేసి ఊరుకుంటే హుందాగానే ఉంటుంది. కానీ అదే సమయంలో టీడీపీ రాజకీయంగా చేతులెత్తేసింది అన్న మచ్చ కూడా పడుతుంది. ఎవరో కాదు వైసీపీ నేతలే ప్రచారం చేస్తే ఆ విధంగా కూడా పార్టీ పరువు గంగలో కలుస్తుంది అన్న భయం ఉంది. మొత్తానికి ఎటూ తేల్చుకోలేని సందిగ్దావస్థలో టీడీపీ ఉంది అన్నది నిజం.

Tags:    

Similar News