కేవలం మాటలే… చేతలు మాత్రం…?

ప్రార్ధన చేసే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న అంటారు. కానీ తమ్ముళ్లు పెదవులే ఆడిస్తున్నారు తప్ప చేతులకు పని చెప్పడంలేదు. అతి పెద్ద ప్రాంతీయ [more]

Update: 2020-04-04 15:30 GMT

ప్రార్ధన చేసే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న అంటారు. కానీ తమ్ముళ్లు పెదవులే ఆడిస్తున్నారు తప్ప చేతులకు పని చెప్పడంలేదు. అతి పెద్ద ప్రాంతీయ పార్టీ, చాలా ఏళ్ళు అధికారంలో ఉంటూ, అదే విధంగా అనేక దఫాలు బలమైన ప్రతిపక్షంగా కూడా ఉన్న తెలుగుదేశం పార్టీని సంపన్నులు ఎక్కువ ఉన్న రాజకీయ పార్టీగా జాతీయ స్థాయిలోనే చెప్పుకుంటారు. అటువంటి పార్టీ కరోనా వైరస్ వంటి పెను ఉపద్రవం దేశాన్ని ముంచెత్తుతూంటే ఏం చేస్తోంది. కేవలం మాటలతోనే సరిపెడుతోందా. ఇది ఇపుడు అతి పెద్ద చర్చగా ఉంది. టీడీపీ అధినేత, ముమ్మారు ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం పది లక్షలు మాత్రమే వ్యక్తిగత విరాళంగా ఇచ్చారన్నది ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి.

వారు తప్ప……

ఇక చంద్రబాబు పార్టీలో అనేకసార్లు ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంపీలుగా చేసిన వారు ఎంతో మంది ఉన్నారు. వారి సంగతేంటి అన్నది ఆరా తీస్తే ఫుల్ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపొయారంతా. టీడీపీలో ఉన్న ఎంపీల్లో ముగ్గురు లోక్ సభ ఎంపీలు మాత్రం ఇప్పటికి ముందుకువచ్చారు విజయ‌వాడ ఎంపీ కేశినేని నాని అయిదు కోట్ల రూపాయలు కలెక్టర్ కి ఇచ్చారు. అలాగే శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడు కోటి రూపాయలు ఖర్చు చేయమని లెటర్ ఇచ్చారు. ఈ ఇద్దరు కూడా ఎంపీ ల్యాడ్స్ నుంచి మాత్రమే నిధులు ఖర్చు చేయమని ఇచ్చారు. వ్యక్తిగతంగా వీరు విరాళంగా ఇవ్వలేదు. కానీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మాత్రం తన అమర్ రాజా బ్యాటరీస్ తరఫున యాజమాన్య హోదాలో ఏపీకి అయిదు కోట్లు, తెలంగాణాకు కోటి రూపాయలు ఇచ్చారు. ఓ విధంగా గల్లాను మెచ్చుకోవాలి.

పిలుపు ఇవ్వలేరా…?

చంద్రబాబు తాను పది లక్షలు మాత్రమే ఇచ్చి ఊరుకున్నారు. పార్టీ తమ్ముళ్లకు విరాళాల కోసం అసలు పిలుపు ఇవ్వడంలేదు. అదే సమయంలో పేదలను ఆదుకోవాలంటూ, ప్రతీ కుటుంబానికి అయిదు వేల రూపాయ‌లు నెలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ ఆర్ధిక పరిస్థితి తెలిసేనా చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నది అని ఆశ్చర్యపోయిన వారు కూడా ఉన్నారు. మరో వైపు టీడీపీలో మాజీ మంత్రులు, మోతుబరులు చాలా మంది ఉన్నారు. వారు ఇంతవరకూ పైసా కూడా విదల్చలేదు. మరి వారు కూడా వైసీపీ సర్కార్ ఏమీ చేయడంలేదని విమర్శలు చేస్తున్నారు. ఇది తిట్టుకోవడానికి, రాజకీయాలు చేయడానికి తగిన సమయమా అని ఏ మాత్రం ఆలోచన చేయకపోవడమే చిత్రం.

ముందుకు రావాలి….

ఇది కేవలం ప్రభుత్వ సమస్య కాదు, ప్రభుత్వం బాధ్యతగా కీలకంగా పనిచేస్తుంది. కానీ తలా ఓ చేయి వేస్తేనే ఈ ఆపదకాలంలో అంతా ఒడ్డున పడతారు. ఈ సమయంలోనే టీడీపీ నేతల అనుభవాలు కూడా కావాలి. వారి ఉదాత్తత కూడా చాటుకోవాలి. మకిలి రాజకీయాలు, బురద జల్లడాలు మానుకుంటే మంచిది అని మేధావులు సూచిస్తున్నారు. కానీ కేవలం కరోనా వైరస్ నుంచి కూడా సంకుచిత రాజకీయమే కోరుకుంటున్న తమ్ముళ్ళు వైసీపీని బదనాం చేయడానికి మీడియా ముందుకు వస్తున్నారు. చెప్పాలంటే ఇలాంటి సీన్ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఏపీకే ఎందుకో ఆ దురదృష్టమో మరి.

Tags:    

Similar News