“అనంత”లో ఒకే ఒక్కడు
రాజకీయంగా టీడీపీకి అత్యంత కీలకమైన జిల్లా అనంతపురం. ఇక్కడ నుంచి పార్టీలో మేధావి వర్గం బాగానే ఉంది. జేసీ బ్రదర్స్ కానీ, పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, [more]
రాజకీయంగా టీడీపీకి అత్యంత కీలకమైన జిల్లా అనంతపురం. ఇక్కడ నుంచి పార్టీలో మేధావి వర్గం బాగానే ఉంది. జేసీ బ్రదర్స్ కానీ, పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, [more]
రాజకీయంగా టీడీపీకి అత్యంత కీలకమైన జిల్లా అనంతపురం. ఇక్కడ నుంచి పార్టీలో మేధావి వర్గం బాగానే ఉంది. జేసీ బ్రదర్స్ కానీ, పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, నందమూరి బాలకృష్ణ.., హిందూపురం మాజీ ఎంపీ కిష్టప్ప, ఇలా అనేక మంది నాయకులు ఇక్కడ ఉన్నారు. వరదాపురం సూరి వంటి వారు పార్టీ నుంచి బయటకు వెళ్లినా.. మిగిలిన నాయకులు ఓడిపోయినా.. పార్టీలోనే ఉన్నారు. అయితే, వీరు తమను తాము కాపాడుకునేందుకు మాత్రమే ఉన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎక్కడా కూడా పార్టీ తరఫున పోరాటం చేస్తున్నది కూడా కనిపించడం లేదు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోయింది.
పదవులు పొందిన వారు….
2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ కేవలం రెండు సీట్లలో మాత్రమే ఓడిపోతే.. ఈ ఈఎన్నికల్లో పార్టీకి కేవలం రెండు సీట్లే మిగిలాయి. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు అనేక కార్యక్రమాలకు పిలుపు నిస్తున్నారు. అయితే, ఇక్కడ నుంచి వివిధ పదవులు పొందిన నాయకులు మౌనంగా ఉంటున్నారు. అధినేత పిలుపు మేరకు ఏ కార్యక్రమానికి కూడా వారు హాజరుకావడం లేదు. అయితే, చిమ్మచీకట్లో చిరుదీపం మాదిరిగా కదిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ మాత్రం పార్టీలో అన్నీతానై నియోజవకర్గంలో టీడీపీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు.
పార్టీ పిలుపులకు….
ఈ క్రమంలోనే కందికుంట అధికార పక్షంపై తమ పార్టీ పిలుపు ఇస్తోన్న ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అసలు మిగిలిన నియోజకవర్గాల్లో కేడర్‌ను, పార్టీ పిలుపును పట్టించుకున్న నేతలే లేరు. జిల్లాలో ఈ ఒక్క నియోజకవర్గంలోనే పార్టీ కేడర్ ఆత్మస్థయిర్యంతో ముందుకు సాగుతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 2004లో టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీకి కదిరి టికెట్ ఇవ్వడంతో కందికుంట ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. అయితే, తర్వాత మళ్లీ పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే పార్టీని డెవలప్ చేశారు. ఇక, 2009లో టాప్ మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేసి చూపించారు. ప్రజలకు చేరువయ్యారు.
ఓటమి పాలయినా…..
అయితే, అప్పటి వరకు తనకు శిష్యుడుగా ఉన్న అత్తర్ చాంద్‌బాషా..2014లో వైసీపీలో చేరిపోయి.. ఇక్కడ గురువు కందికుంట పైనే వైసీపీ తరఫున పోటీ చేశారు. ఈ క్రమంలోనే కందికుంట కేవలం 714 ఓట్లతో ఓటమి చెందారు. అయినప్పటికీ.. పార్టీ కోసం కట్టుబడ్డారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లారు. అయితే, అత్తర్ తర్వాత టీడీపీ పంచకు చేరుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కందికుంటకే చంద్రబాబు జైకొట్టారు. ఆయన సేవలకు ఫిదా అయిన చంద్రబాబు.. కందికుంటకే టికెట్ ఇచ్చారు. అయితే, ఈ ఏడాది ఎన్నికల్లో కందికుంట జగన్ సునామీ ముందు నిలవలేక పోయారు. అయితే, గతంలో మాదిరిగానే ఓటమిని, గెలుపును సమానంగా భావిస్తూ.. నియోజకవర్గంలో టీడీపీ కోసం కృషి చేస్తున్నారు.
వైసీపీలోకి వెళతారని….
వ్యాపార కార్యక్రమాల నేపథ్యంలో బెంగళూరు, హైదరాబాద్ పర్యటనలు చేస్తున్నా.. టీడీపీ కోసం నియోజకవర్గంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. జిల్లాలో కూడా యాక్టివ్‌గా ఉన్నారు కందికుంట. అత్తర్ మాత్రం కందికుంటకు ఎలాంటి సహకారం అందించడం లేదని టీడీపీ వర్గాలే గుసగుసలాడుతున్నారు. పైకి మాత్రం అత్తర్ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాలకు హాజరవుతున్నాడు. పైగా వైసీపీ నేతలకు టచ్‌లోనే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గ స్థాయిలో కందికుంట పిలుపు ఇచ్చే కార్యక్రమాలకు ఆయన డుమ్మా కొడుతుండడంతో రకరకాల ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఇక, ఇటీవల జగన్ ఇసుక విధానంపై ఆందోళనలకు పిలుపునిచ్చిన చంద్రబాబు ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా యాక్టివ్‌గా పాల్గొన్నది కందికుంట మాత్రమేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన చేపట్టిన ఆందోళనకు పక్క నియోజకవర్గాల నుంచి కూడా నాయకులు కదిలి వచ్చి పాల్గొన్నారు. అయితే ఇప్పటికే రెండు సార్లు ఓడిన కందికుంట ఇదే ఊపు మరో నాలుగేళ్లు కంటిన్యూ చేస్తారా ? లేదా ? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి.